Thursday, May 5, 2022

ఉరివెట్టుకున్న మోకుముత్తాదు

 

ఆలుమొగల తీరు అన్యోన్యంగుండి

దినాం ఒకళ్లెంబడి ఇంకొకలున్నట్టు

నిత్తెం నింగికెగబాకె

గౌడన్న వొంటిమీద గజ్జెలహారమై

దారిన వోయెటోళ్ల దాహందీర్చె

మోకుముత్తాదు పొద్దుగూకినంక

రంగులబొంత గప్పుకొని

సిగ్గులమొగ్గై సిలుక్కొయ్యెక్కుతై జంటగువ్వలతీరు!

అరె బయ్ 

ఆన్లైన్ల ఆడరిత్తె అచ్చేది

గాదు కల్లుసుక్క!

గాలిలో వేలాడే దీపమై

పూటకో పుట్టువై

 ప్రమాదపు అంచున

కత్తిమొనపై నిల్సున్న

శ్రమజీవుల సెమటముక్క!

ఆకట అలమటించే బిడ్డలకడుపునింప

సేపుకచ్చిన సురధారలు!

తొవ్వనడిచే పాదచారుల

దూపదీర్చే ఊటసెలిమలు!

గీతకత్తోలె పదునైన బతుకులు

మోటువోయి మొత్తుకుంటున్నయి

బీరుబరండీల పారుకంల వడి

తెల్లగల్లు తెర్వు కచ్చినోడెలేడాయె


బర్వసలేని బతుకులకెవడు రాక

బొత్తలన్ని బీడువడ్డయి

తాళ్లన్ని తలలిరిగి రాతికంబాలోలె

బొట్టుబోనం లేక ముండవోసినట్టున్నయి!

కుండలెన్నొ మోసిన

కాడుబాద్ధ కాళ్లిరిగి మూలవడ్డది!

గుజికాళ్లకడ్డంబడి

నడువకుండ నాలెకు సరంగొడుతున్నది!

మోకుముత్తాదులు మొద్దుమొకం జూడని బెంగతో

సిలుక్కొయ్యెకురివెట్టుకున్నయి!

ఉయ్యాలూగుతున్నయి!!

గౌడన్నల బతుకు గాలిల దీపమైనయి!!!


రాజశేఖర్ పచ్చిమట్ల

9676666353


Saturday, September 11, 2021

తాటిచెట్టు పాట

 మొగులంట వెరిగిందీ పోద్దాటిచెట్టు ఓనా రామయ్య

పోద్దాటిచెట్టు ఓనా రామయ్య

పోద్దాటిచెట్టెక్కి సెట్టుసుట్టువడుతవా ఓనా రామయ్య

బీడుదులుపుకత్తవా  ఓనా రామయ్య


మోకూముత్తాదుగట్టి కాటమగౌనికి మొక్కి

ఎగవాకి యెక్కుతా ఓహ్ నా లచ్చిమి

సుట్టువట్టి సూపుతా ఓహ్ నా లచ్చిమి

(మొగినిముద్దాడుతా ఓహ్ నా లచ్చిమి)


పందిరంట వెరిగింది పండుదాడిచెట్టు ఓ నారామయ్య

పండుదాడిచెట్టు ఓహ్ నారామయ్య

పండుదాడిచెట్టెక్కి ముంజలుదినిపిత్తవా ఓ నారామయ్య

మోకూముత్తాదుగట్టి యెల్లవతల్లికి మొక్కి

ఎగబాకీయెక్కుతా ఓహ్ నాలచ్చిమి

ముంజలన్ని దింపుతా ఓహ్ నాలచ్చిమి


సుక్కలంటవెరిగింది సురపరుపుదాడు ఓహ్ నారామయ్య

సురపరుపుదాడు ఓహ్ నారామయ్య

పరుపుదాడిచెట్టెక్కి కల్లంపుకత్తవా ఓహ్ నారామయ్య

కల్లంపుకత్తవా ఓహ్ నారామయ్య

మోకూముత్తాదుగట్టి తల్లిదండ్రిని దలిచి

ఎగబాకీయెక్కుతా ఓహ్ నాలచ్చిమి(రంగసాని)

కల్లంపుకత్తనే ఓహ్ నాలచ్చిమీ

కల్లంపుకత్తనే ఓహ్ నాలచ్చిమీ


నాకమంతవెరిగిందీ నాపదాడిచెట్టు ఓహ్ నారామయ్య

నాపదాడిచెట్టు ఓహ్ నారామయ్య

నాపదాడిచెట్టెక్కి మంచికల్లుదెత్తవా ఓహ్ నారామయ్య

మంచికల్లుదెత్తవా ఓహ్ నారామయ్య

మోకూముత్తాదుగట్టి చెట్టుమొదలుకు మొక్కి

ఉడుతోలెగవాకుతా ఓహ్ నాలచ్చిమి

మంచికల్లుదించుతా ఓహ్ నాలచ్చిమి

ఇద్దరమూగూడుదాము లొట్టెడంతదాగుదాము

ఊగుకుంటవోదామె ఓహ్ నాలచ్చిమి

తూగుకుంటవోదామె ఓహ్ నాలచ్చిమి

Friday, August 20, 2021

సుట్టుజుట్టిన సుట్టబట్టా నెత్తిమీద నిండూ కుండా

కుండదించి కల్లంప రాదో గౌడసాని ఎల్లమ్మ మాకూ


కల్లు కుండెత్తుకోని పోయేటి ఓ పిల్ల

దూపార దమ్మంప రాదో గౌడసాని

 దామార దమ్మంప రాదో


ఎలితికుండ మెడల మీద నిలువకుండ తొలుకుతాది 

దమ్మెట్ల వొంపాలే తాతో నీకు 

దమ్మెట్ల వొంపాలే తాతా


అల్పబుద్దుల నడవడి

 మధుర జలపు బావి మౌనమ్ము గానుండి

ధరను జనులకంత తపము దీర్చు

ఉప్పు నీరు మెండు గున్నట్టి సంద్రమ్ము

(దూప దీర్చ పోగ దూర తరుము)

అట్ట హాస మలర గర్జమొందు



మిడిసి పడుదు రెపుడు మితజ్ఞానులుమెండు

అణిగి యుందురపర జ్ఞాను లంత 

పూర్ణ ఘటము తీరు పూర్ణ పురుషులుండు

పచ్చి మట్ల మాట పసిడి మూట

Sunday, July 4, 2021

అమ్మఒడే అసలుబడి

  

అనంతవిశ్వమంటి 

గర్భకుహరంలో నలుసై వెలిసిన నిన్ను

ఈయవనికి  పరిచయం చేసి

అనందపుఅలలపై పూసిన వెలుగుకిరణం అమ్మ!


ఉంగఉంగ అంటూ 

దైవభాషల నువు ధ్యానంచేస్తుంటే

ఊకొడుతున్నావనుకుంటూ

సాగిసాగి ఊసులు జెప్పే తొలిగురువు అమ్మ!


అడ్డంగా అమ్మవొడిలో

శేషశయనుడవై యున్నా

మొలిచీమొలువని కాల్జేతులతో

గాలిలో ఈదులాడుతున్న నీయాటలుగని

మురిసిమైమరిచేది అమ్మ!


ఖాళీదిమాక్ తో ఇలకచ్చిన నీకు

అత్త తాత నాన్న మామఅంటూ

బంధాల మాధుర్యాన్ని

యెదలోని ప్రేమామృత దారలతో రంగరించి

భావిజీవితానికి భరోసానిచ్చే బడి అమ్మఒడి!


అలతియలతి మాటలతో

పాలుగారే పలుకుల జడివానల తడిసిముద్దై

పచ్చియనుభూతులు పంచే

నులివెచ్చని చీరకొంగు అమ్మ!

మునిమాపువేళలో

నల్లని ఆకాశంలో పూసిన తారలహారాల్ని చూపుతూ

గానకోకిలై సప్తస్వరాల నాలపిస్తది

చిట్టిపొట్టి కథలతో ఆలోచనానందాలు పంచుతూ

గోరుముద్దలు పెడుతూ గోములాడేది అమ్మ!



తెలియనిలోకంలో తెగువతో బతికేలా

నేలనుంచి మొదలు నింగిదాకా

అన్నింటిని అరచేతి కందించి

వంతపాడేటి పసితనానికి మురిసి

గానామృతంతో  జ్ఞానాన్నందించే అమ్మఒడే అసలు బడి!


తను నీవెంటున్నా లేకున్నా

కాకులుగద్దలు తన్నకుండా

నిత్యం నిను రెక్కలకింద గాచే

శ్రీరామరక్ష అమ్మ! 


గురుతరమైన అమ్మ పాదాల చెంతే

కులాసైన బతుకు

నడిసంద్రపు నావసొంటి మనబతుకును

దరిజేర్చు తెరచాప అమ్మ చేయిచలువ!

Monday, June 28, 2021

అక్షరక్షేత్రాలు

 కరోనా వేటుకు 

ఎర్రజెండా ముందటి రైల్లతీరు

బడులన్ని నిలవడిపోయె


నవోదయపు సూర్యకిరణాలై

వచ్చివాలే ఛాత్రపక్షుల లేని

కొలనులై వెలవెలబోయె


అక్షరాల సాగుచేసే 

కర్షకక్షేత్రాలై చిగురించే

సరస్వతీ నిలయాలు 

వెల్లివిరిసె విరులసరులు లేక

తెల్లబోయినయి


అలలగోదారై 

గబ్బిలాల 

Saturday, June 5, 2021

ప్రశ్నిస్తున్న వనం


ఈ ఒక్కచిత్రం చాలు

మనుషుల మేథను కదిలించడానికీ

ఈఒక్క చిత్రం చాలు

బుద్ధిజీవులు ఆత్మావలోకనం చేసుకోడానికీ

కళ్లకు కడుతుందీ చిత్రం

పచ్చనిచెట్టు పర్యావరణానికెందుకవసరమో?

అనువంత గింజలోంచి అంకురించినదాది

నిరంతరం పెరిగి నింగికెగబాకి

ఆకాశమంత నిండి

ప్రాణీకోటికంత అమృతప్రాణవాయువందించ

పుఢమిపై వెలసినదీ భూరూహము!


కొమ్మలు రెమ్మలు పూలుఫలములు

పచ్చనివాయువీవెనలూపు పత్రములు!

మానవసంస్కృతికి నెలవులు తరువులు

పశుపక్షాదులకు ఆవాసాలు!


ఓమనిషీ

నీకళ్లను మనసుకతికించి చూడూ

ఆచెట్టు విసిగివేసారి

విశ్వరూపధారియై అవతరించింది!


ఆ తరువును జూస్తే

గుండె తరుక్కుపోతలేదు

సకలప్రాణుల కావాసమై 

యెదిగి ఒదిగిన తను యెండి

మానవ పైశాచికత్వాన్ని ప్రశ్నిస్తలేదు!

మనిషీ 

ఆలోచించు 

ఇది అభివృద్ధి కాదు అథోగతి!

ఇది మానవ మనుగడకు గొడ్డలిపెట్టు!

ఇది పిచ్చెక్కిన బెబ్బులి

చేస్తున్న విధ్వంసానికి పరాకాష్ట!