త్యాగదనానికి తరవారసులై నిలుస్తున్నదీ ప్రకృతీ
సొగసుదనానికి పొలుపుధారలై కురుస్తున్నదీ ప్రకృతీ
ఆకాశానికి నిచ్చెనలౌతు పచ్చదనమ్మును వెచ్చగమోస్తూ
ఆచ్ఛాదనతో నాకపుదారులు పరుస్తున్నదీ ప్రకృతీ
వసంతరాగం మదిలోపొదిగీ కువకువలాడే పక్షిగణములై
ఉషొదయంలో తొలితొలిసంధ్యై విరుస్తున్నదీ ప్రకృతీ
వేగిరపడియెటి వేసవిరవినీ చల్లనిగాలుల పింఛమునిమిరీ
పరువాలొలికే పైరగాలులై వీస్తున్నదీ ప్రకృతీ
హిమతరంగమే విరుచుకుపడితే శిరసులొంచిమరి సరసాలాడీ
వెండితొడుగులా మెయిపూతలతో మెరుస్తున్నదీ ప్రకృతీ
నిడుజడికురిసే పరువపువానలొ సొగసులు నిండానానీ
పండువెన్నెలయి శరచ్ఛంద్రికలు పరుస్తున్నదీ ప్రకృతీ
ఋతువులమాయకు ఋజువులుతనై 'రాజ'సమందే రాచకన్నియా
రంగులవలువలు సింగారించుకు మోహిస్తున్నది ప్రకృతీ