Friday, May 19, 2017

అమృత దార

అంతరిక్షపు అంతరంగమెరిగిన మనిషి
పంచభూతాల్ని వశం చేసుకోవడంలో
పలుమార్లు పరాజితుడవుతుండు !

అందని దానికి అర్రులు జాస్తూ
అహర్నిషలు శ్రమిస్తుండు
అందినదీ అందుబాటునున్నది
అద్భుతమైనా అలుసుగనే జూస్తుండు !

పంచభూతాల్లో తానొకటై
జీవకోటి జీవనాధారమై
సకల జీవులు సదా కాంక్షించే
అమృతతుల్యమైన జలదారను
దుడుకుతనంతో దుర్వినియోగం జేస్తుండు !

పుడమితల్లి పొత్తిళ్లలో
పురుడోసుకున్న ప్రాణికోటి దాహార్తిని తీర్చుటకు
నీలి మబ్బుస్తన్యము నుంచి
నేల పొత్తిళ్లకు జాలువారిన అమృతదారను
సిన్నపల్లెల్లో సిమెంటురోడ్లు,
మునిసిపాలిటీ మురికి కాలువలు
నేరుగా ఊరిబయటకు నెట్టేసి
తల్లీబిడ్డల అనుబంధానికి
అభివృధ్ధి పేర ఆటంకమవుతుండు !

ఆప్యాయంగ తనవైపు జూసినా
ఆకలితో కేకలేసినా
యెదలోతుల్లోంచి పొంగుకొచ్చి
ఉబికి ఊటగా మారి
సస్యములు పరవశించే
పాలదారలనందించు మట్టి పొరల్ని
గొట్టపు బావుల పేర
తూట్లు తూట్లు పొడుస్తుండు
నీళ్ల జాడగానరాక నీరసించి పోతుండు !


ఇకనైన ఇగురంగ మసలుకో
అభివృద్ధి అసలురంగు తెలుసుకో
నీటి విలువను నీవుగా గుర్తెరిగి
మొద్దు నిదురను వదిలిపెట్టి
మెలుకువతో ముందడుగెయి
ఊరికో చెరువు పూడిక తీయి !
ఇంటికో ఇంకుడుగుంత నిర్మించు !!
నింగి జారిన నీటిచుక్కల
నొక్కొక్కటి ఒడిసిపట్టు
భూమి పొరలగుండ వడగట్టి
ధరణి గర్భగుడిల దాచిపెట్టు !!!
సుజలదారను సుస్థిర పరిచి
ఒడుపుగ తోడుకో
పొదుపుగ వాడుకో
అన్ని జీవులకది ఆధారమని యెరిగి
అవసరమున్నంత అనుభవించు !
పంచభూతాల్ని పవిత్రంగ
భావితరాలకందించి
మానవత్వమున్న మనిషిగ మారిపో. !
సకల ప్రాణులకు స్వచ్ఛ జలమందించి
సర్వప్రాణి భూయిష్ట
స్వచ్ఛ భారత నిర్మాతగ నిలిచిపో . . . !

                       -పచ్చిమట్ల రాజశేఖర్
                          తెలుగు లెక్చరర్
                          9676666353

Thursday, April 6, 2017

చెర'బడి'

అప్పుడే పుట్టిన రెక్కలతో
హాయిగా విహరించాలనుకునే
సీతాకోకల్ని
బడి బందదిఖానాలో
బందించారెందుకు నాన్న !

మీ స్థాయికి తగిన
కార్పోరేటు నర్సరీ నెంచుకున్నారు తప్ప
ఆ భారము
నే మోయగలనో లేదో తలంచలేదెందుకు నాన్న !

అక్కడ
రంగురంగుల పూలు లేవు
ఉక్కపోతకు ఉడికి
వాడిన ముఖారవిందాలుతప్ప !
బోసినవ్వులు లేవు
బోసిపోయిన విషన్న వదనాలుతప్ప!

అయినా
చదువుతా నాన్నా
నీ క్కావల్సిన పేరు కోసం
అక్కడే చదువుతాన్నాన్నా

ఆ కాఠిన్యాన్ని తాలలేక
రెక్కలు నలుగుతున్నా
మీ ఆనందం కోసం
నే బడికి వెళ్తా నాన్న !

కాని
నామనసు తెర వెనుకుండి
నా అభివృధ్ధికాటంకమవుతున్న
అఘాతం చూడు నాన్న

అల్లారుముద్దుగా
గోరు ముద్దలు తినిపిస్తూ
అనునిత్యం కనిపించే అమ్మ
వేలు పట్టి నడిపిస్తూ
నడక చూసి మురిసిపోయే నాన్న
 అమాసకో పున్నానికో
అతిథులై వచ్చి
ఆప్యాయంగా మాట్లాడే మాటలు
యాడదంతా తలుచుకుంటూ
మీకోసం చదువుకుంటాలే నాన్న !

నన్ను తలెత్తుకు నిలిపేందుకు
చదివించే చదువుల భారంతో
నే గూనిపోయి నా సరే
నీ నమ్మకం కోసం చదువుతా నాన్న !!


Tuesday, March 28, 2017

యుగాది

 విరియించి తన కుంచె విదిలించెనో యేమొ
       ఆకురాల్చినతర్వు లంకురించె !
 మండుటెండను త్రోసి మావిచిగురుతొడ్గి
       పూలు ఫలముతోడ పుష్ట మొందె !
 పుట్టువయినభూమి పులకింత నొందేల
       విరగబూసెనుచూడు వేపలన్ని!
 చిగురుటాకులజేరి చిలుకలు కులుకంగ
           కొత్తరాగములెత్తె కోకిలమ్మ!
ఆరు రుచులతోడ నరుదైన పచ్చడి
     ఆరగించినమేను ఆర్తి దీరు!
అటులె జనుల చింత లన్నింటి నెడబాపి
    హితము గూర్చ వచ్చె హేవళంబి !

                -రాజశేఖర్ పచ్చిమట్ల
                       M.A M.Phil (central university)
                 తెలుగు లెక్చరర్
     

Monday, March 27, 2017

ఉగాది కి స్వాగతం

  విపంచి తన కుంచె విదిలించ
 నక్కడక్కడ వడ్డ సిరా చుక్కలోలె
మండుటెండకు తనువు మాడుతున్న
పుడమి క్యాన్వాసుపై
 ఆకురాల్చిన చెట్లు అంకురించి
పచ్చని చిగురుల పలుకరింప

మావిచివురులు తొడిగి మారాకువేసి
పుష్ప ఫల శోభితములయి పరిఢవించ
వేపలు చిగురించి విరబూసి
పుడమి తల్లికి పూల దుప్పటి గప్పి
ఆనందాతిశయముతో  నలరారుతుండ

చిలుకల కులుకులలు
కోకిల కూతలు
పక్షుల కిలకిల రావాలతో
ప్రకృతి పరవశించ
సుఖదుఃఖాల సుందర
మేళవింపయిన జీవితాలను
తీపి పులుపు చేదు
వగరు లవణ కారము
ఆరు రుచుల అద్భుత పాయసమోలే
రసమయ మొనర్చి రంజిల జేసి

హలాహలము మింగి
అమృతమందించు హరుని వోలె
క్రొంగొత్త రాగాల కోటి ఆశలతో
మనుగడ సాగించు మానవాలి కంత
వెన్నుదన్నుగ నిల్చి

సకల సంతోషాలు జగతికినందించ
సుందర సుఖమయ స్వప్నిత
జీవితాన్నందించ వచ్చిన
హేవళంభికి
సాదర స్వాగతమ్ము !

          - రాజశేఖర్ పచ్చిమట్ల

Friday, March 17, 2017

నాన్నంటే . ?

 కనిపించేదైవం నాన్న
నడిపించే నేస్తం నాన్న
కలనైనా స్వార్థమెరుగని
కల్పతరువు నాన్న!

యెదలోతుల్లో దుఃఖం
 యేరులయి పారుతున్న
 కన్నీరు కనుకొలుకుల జారనీకుండా
 కొసపంటికింద అదిమి పట్టే గొప్ప సాహసికుడు నాన్న

 అంతరంగమందు లావా
అలజడి రేపుతున్నా
 యెగిసి పడకుండా ఒడిసి పట్టి
నిగ్రహించుకు నిలబడే ధీనగమే నాన్న . !

తను(వు)ఎండల మాడుతున్న
తనవారికి నీడనందించి
తనువు జిగి సచ్చి సైసుమన్నా
పండ్లనందించ తనపడే తరురాజమే నాన్న . !

తన మదిలోని బాధల
అగాథపు లోతుల్నీ
తనువులో దాచుకుని
కనుగవ గంభీరతను చాటు కడలే నాన్న . !

తనువణువణువూ
 ఆటుపోటులతో అతలాకుతలమవుతున్నా
తన వారందరినీ సాగరపు
టలలపయి ఓలలాడించే ఆదర్శమూర్తి నాన్న . !

తను(వు)పొరలలో
కన్నీటి కాలువలు పారుతున్నా
తనువు పయి తరువులను
నిలిపే సహనశీలధరణే నాన్న . !

నాన్నంటే ఆదరణ !

నాన్నంటే ఆలంబన !

నాన్నంటే ఆవేశం మాటున దాగిన  ఆప్యాయత . !
                              -రాజశేఖర్ పచ్చిమట్ల

Wednesday, March 8, 2017

మానవతకు మారురూపు మహిళ

జవసత్త్వములను జగతికి నందించి
మానవాళి పేర మహిన నిల్పి
మానవత్వమునకు మారుపేరుగనిల్చు
మగువ లేక మనిషి మహిని లేడు

త్యాగశీలి మహిళ

ఆ.వె.
అవని మీద మనిషి నవతరింపగజేసి
అణువణువుగ తాను కరిగి పోయి
జీవజాతికంత చేవనందించేటి
మహిళ సాటి లేరు మహిని యెవరు