Saturday, February 13, 2021

పొగసూరిన బాల్యం

 

బడిబందయిన్నాటినుండి

కాళ్లకు సంకెకళ్లేసినట్టు

బాల్యం బంధీఅయ్యింది బందెలదొడ్డిల


లేలేత చేతుల విరిసిన నగుమోముతో

పండువెన్నెల సందమామసొంటి

బాల్యం  పొగసూరుతుంది పల్లెల్లో!


బతుకు భారమైన సంసారసారథికి

చేతనైన సాయంతో చేయూతనిస్తూ 

నిగనిగలబాల్యం వసివాడిపోతున్నది!

ఆడిపాడుతూ ఆటగోరే పిల్లలు

పత్తిసేన్లల్ల పట్టనపలిగిన

పత్తికాయోలె నవ్వుతున్నరు!


విరిసే గులాబీలు కరువుసాలెగూటిలో

మొగ్గలుగానే ముకులించుకుపోతున్నది బాల్యం

గమ్యపు దారులు వెదుకలేక

గతిదప్పిన బాల్యం

బర్లకాడ గొర్లకాడ కట్టెకావలై బిగుసుకుపోయింది!

కమ్మరి కొలిమిల నిప్పురవ్వలై

సెగలుగక్కుతూ పనిముట్లకు పదునువెడ్తుంది 

కుమ్మరాముల సగంగాలిన 

కుండలయి కూలవడుతున్నది బాల్యం!


ఇటుకబట్టీల యినుపకంచెలు దాటలేక

మట్టికొట్టుకపోతున్నది

ఎంగిలి కప్పులు కడుగలేక

యెదల మదనవడుతున్నది బాల్యం!


చినిగిన గుడ్ఢలు అరిగిన సెప్పులు

కమిలిన సేతులు కాలేకడుపులతో

కలవరపడుతున్నది బాల్యం!


బలపంతో బతుకుదిద్దుకునే 

లేలేతచేతుల బాల్యం

సేన్లల్ల సెల్కలల్ల కందిపోతున్నది!

పసులకొట్టాల్లో

 ఇసిరేయబడి కంపుగొడుతున్నది

నవనీత సుకుమార  బతుకులు

బండసరుసుకపోతున్నయి!


తరాలు మారినా

తలరాతలు మారలే

ప్రభుత్వాలు మారినా

పాలకులు మారినా

తీరుమారని తీయనిబాల్యం

నిరాదరణకు గురవుతున్నది

అంతరాలు పెరిగిపెరిగి

నక్కకు నాగలోకముతీరు

పేదోని ఆకలిదీరేదెప్పుడు?

పసితనానికి బరోసాయెప్పుడు?

బుడిబుడి యడుగుల బాల్యానికి

బడిచేరువయ్యేదెపుడు?

తోటకూర కట్టలై వాడుతున్న బాల్యానికి

పనుల విముక్తెన్నడు?

పసిడికాంతుల బాల్యం

సీతాకోకలై విహరించేదెన్నాళ్లకు?


No comments: