Tuesday, December 31, 2019

నడిచే దేవుళ్లు

అవనిపై నడయాడే అపర దేవతారూపాలు
మన ఆశలుదీర్చే అమృతభాండాలు
చెమటను చమురుగజేసి సత్తువంత వత్తిజేసి
మన బతుకున వెలుగునింప  కరిగిపోవు దీపాలు
వారిఆశల నణుచుకొని వారసుల భవితను కలగంటారు
నీ యెదుగుదలకు అట్టడుగున నిలిచి పునాదవుతారు
నీఓటమి తాలూకు వేదనకు బాసటవుతారు
నింగికెగసిన నిన్నుచూసి పొంగిపోతారు
భంగపాటును చూసివారు కుంగిపోతారు
జగతి నిన్ను ప్రశంసిస్తే హర్షిస్తారు
నీఉనికిని విమర్శిస్తే వర్షిస్తారు
రెక్కవిదిల్చి మనమెగిరిపోతే మదన పడుతారు
మళ్లీమళ్లీ త్యాగాలకు ఒడిగడుతారు!

రాజశేఖర్ పచ్చిమట్ల
31-12-19

Sunday, December 29, 2019

సీసపద్య సొగసుసీసపద్యాలను ఛీదరిం చుటగాదు
సీసమే పద్యాల శిఖర మౌను
గాన యో గ్యములైన గమకమ్ము లనుగూడి
సంగీత ఝరిలాగ సాగి పోవు
పాల్కుర్కి సోమన్న పాండిత్య మునుదెల్ప
సీసము లనుగూర్చి రాశి వోసె
సరళప దాలలో సరసభా వమునిల్పి
సెలయేటి పరవళ్ల సేర దీసి
శ్రీనాథ కవిరాజు శ్రీపతు లొప్పేల
సీసము లనురాసి సిరుల నొందె

పద్య మందు మిగుల హృద్యమౌ సీసమ్ము
నవర సభరి తమయి నాట్య మాడె
పండి తులనె గాదు పామరు లునుమెచ్చె
సీస పద్య మిలలొ వాసి కెక్కె

Monday, December 23, 2019

శీర్షిక: మధురజ్ఞాపకం ఆరోజు


పేదవాని కడుపుమంట చల్లార్చే మెతుకులవర్షం కురిసిననాడు
బిచ్చెగాళ్ల జోళెలొదిలి కాయకష్టాన్ని నమ్ముకున్ననాడు
వృద్దాప్యంనిండిన వృత్తులన్ని నవయవ్వన సవ్వడి జేసిననాడు
స్వార్థపుమురికి నిండిన మనుషుల యెదల్లో త్యాగపరిమళాలు వెల్లివిరిసిననాడు
కులమతాలకుళ్లును వదిలించే
మానవతగంగా తరంగాలు మహిని వెల్లువెత్తిననాడు
అవుతుంది భువిలో అద్భుతమే ఆరోజు
నామదిని ఆనందడోలికల ఊయలలూపుతూ

Thursday, December 19, 2019

గజల్

నిండుచంద్రుని వెదకడంలో రాత్రులెన్నో గడిచిపాయె
నీకోసం నిరీక్షణలో దినములెన్నో గడిచిపాయె

మావరాకను మదిన తలచి హృదయద్వారము తెరిచివుంచితి
రాజకొమరుడు రాకలేకనే రాత్రులెన్నో గడిచిపాయె

నీటియద్దము తెరలమీదనీ
మోముచందురు గాంచజూచితి
అలల కదలిక లాగకుండనే
రాత్రులెన్నో గడిచిపాయె

పూలవనమును కలియదిరిగితి సీతకోక చిలుకనై
వదనారవిందం వెతుకుటలో వనములెన్నో దాటిపాయె

నిశికన్నెల నిజరూపం కవిరాజుకు గనపడకనే
ఊహలలో ఊగిసలతో రోజులెన్నో గడిచిపాయె

Sunday, December 15, 2019

శీర్షిక : సమ్మోహన రూపం


ప్రియతమా!
ఆకాశంలోని ఇరులన్నిటినీ
గుప్పిట బంధించినట్టు
అలవోకగా నల్లనికురులను
వామహస్తమున మడచిపెట్టిన నాచెలీ!

నల్లకలువల కొలువులైన
కన్నుల చూపులను
నా స్పటికపుహృదయంపై
వారజేసిన నా చెలీ!

అరవిరిసిన వెన్నెల వదనమున
దరహాసము మెరియగ
ఎరుపెక్కిన చెక్కిలి సొగసు
కైపెక్కిస్తున్నది నా చెలీ!

జడులను సైతం చైతన్యపరిచెడు
భానూదయ కరస్పర్శ
చిగురించెడు చెంగల్వ సొగసుల
కౌముదీయుత కౌమారచందురిని
కిందజేయు దేవకన్యవై
నాకనుచూపుల కడ జేరితివి చెలీ!

అప్సరసాంగన వైన నీరూపం
నన్ను భావకవినిజేసింది!
మోహనమూర్తివైన నీరూపం
నన్ను నీ దాసుని జేసింది!

ప్రియా!
నాకనులలో నీరూపం చెరిగిపోనీయకు
నామదిని ముగ్ధ మనోహర
ప్రణయకావ్యమొనరించి
నీ సొగసున కంకితమిస్తాను చెలీ!
Tuesday, December 3, 2019

చిగురించిన మోడుబతికినన్నాళ్లు
పరులకొరకు పరితపించి
ఉల్లు కొరుకుతున్నా
ఊరకుండి
నీర గార్చి నీరసించి
త్యాగంతో తనువంతా
చిక్కి శల్యమై శుష్కమై

మోడుగ మారిన
ఈదుల మొరే
ఈశ్వరుని ముట్టిందో
ఎండిన తనువు చిగురించింది!
నిలువెల్లా లతావితానమై
విరులతో పరిమళాంచింది!

ఉట్టి


పూరి గుడిసెలో
పెంకుటింట్లో
నట్టనడుమ
ఉట్టిమీద బువ్వకుండ
ఊగుతుంది ఊయల!


కుక్క పిల్లులు
కాల్గాలిన పిల్లులై తిరుగుతూ
లొటపెట పెదాలకు నక్కాశపడ్డట్టు
ఊరిళ్లూరుతుంటయి!

ఆకాశంలో వేలాడే ఉట్టి
అందదు యెలుకకు పిల్లికి
భద్రతకు భరోసా ఉట్టి
నమ్మకానికి నమూనా ఉట్టి!

ఉట్టిమీది కూడు వట్టిపోదు
గాదెల్ల దిన్సుకు తెగుల్రాదు
మనతాత ముత్తాతల
మేథస్సు సజీవసాక్ష్యం!
పూరిగుడిసెల
ఒంటరిగా ఊగుతుంది ఉట్టి
మూడుకాళ్ల ముసలితీరు!

Monday, December 2, 2019

శీర్షిక: గగన విహారి గడ్డమట్టి పొరల్లో పురుడోసుకున్న మేలిమి ముత్యం
దుబ్బతో దోబూచులాడిన పగడం

యెల్లవారలకు తల్లైన ఉల్లి
తల్లికన్నా హితైషిగా తళూకులీలిన ఉల్లి

వారసంత పెద్దర్వాజ కటూఇటూ ఉండి
అందరినీ స్వాగతించిన ఉల్లి
ధనగర్వంతో అందరికీ దూరమైతున్నది
మట్టితో  మమైకము నెడవాసి
మనిషితో మమకారము నంటువాసి
పుడమి పొత్తిళ్ల నొదిలి
దినదిన ప్రవర్థమై
ఇంతింతై వటుడింతై
మబ్బుల కెగబాకి
గగన విహారియై గర్వపడుతున్నది ఉల్లి

తల్లితనాన్ని మరిచిన ఉల్లినిజూసి తల్లడిల్లుతుంది జనం!
చుక్కలకెగబాకిన సక్కనమ్మకై బిక్కుబిక్కుమంటూ బెంగటిల్లుతుంది జనం!