Sunday, December 18, 2016

ఆకాశమంతెత్తు నాన్న

జీవం పోసింది అమ్మే అయినా
జీవితాన్నిచ్చేది నాన్నే
చిన్ననాటి నీ తప్పటడుగులు
తప్పుటడుగులవకుండా
ఊతమిచ్చి ఉరకలు నేర్పేది నాన్నే !
నడక నేర్చిన బాల్యాన్ని
విడిచి పెట్టకుండా ఒడిసి పట్టుకొని
నిత్యం నీ వెన్నంటి ఉంటూ
నడత నేర్పి నడిపించేది నాన్నే !

ఆలుబిడ్డల పోషణార్థమై
అనుదినం శ్రమిస్తూ
తాను నిలువునా స్రవిస్తూ
అందరికీ వెలుగులు పంచేది నాన్నే !

పరివారపు ప్రగతికైై పరితపిస్తూ
కష్టాలకడలి మథించి
మధుర ఫలాలు మనకందించే
నిస్వార్థ నిరాడంబరుడు  నాన్నే !

హనుమంతుని వంటి
అందమైన మూర్తిని
జగత్ దర్శనానికి  నిలిపే
అగుపించని ఆలంబనా శిల నాన్నే !

బాధలన్ని దిగమింగుతూ
కన్నీటిని స్వేదంగా కష్టిస్తూ
అందరినీ అందళమెక్కించి
అథఃపాతాళానికి కూరుకుపోయిన
అవిరల శ్రామికుడు ఆదర్శమూర్తి  నాన్నే !

ఇంతింతైై యెదిగిన నీవు
మొలిచిన రెక్కలతో వలసవోయి
నీకైై నీవు నిర్మించుకున్న
సుందర ఆకాశ హర్మ్యాలకు
పునాది రాయి  నాన్నే  !

తానుచేరని తీరాలను 
దాటుతున్న నిన్నుచూసి
అంతులేని ఆనందంతో గంతులేసేది నాన్న!

గగనపథాన పతంగివైై విహరిస్తూ
అలసిసొలసి ఆదమరచి
అంచలంచలుగ దిగజారుతు
పతనమవుతున్న నిన్ను
తన చేతి దారంతో చైైతన్యపరిచి
ఎగురుతున్న నీ ఉన్నతిని చూసి
మురిసిపోతూ మైమరచిపోయేది నాన్నే !

నాన్నంటే ప్రేమ !
నాన్నంటే నమ్మకం !
నాన్నంటే ఆదర్శం !
నాన్నంటే ఆత్మీయ స్పర్శ !
  కొంండంత అంండ   !

నాన్ననే పిలుపు అమోఘం
                అనిర్వచనీయం
            ఆకాశమంత ఎత్తు !
                                     
                      - పచ్చిమట్ల రాజశేఖర్









No comments: