Friday, September 19, 2025

ఎదురీదుతు బతికేస్తా

 విధిరాతను ఎదురిస్తూ వీరుడిలా బ్రతికేస్తా

కష్టాలకు చిరునగవుతొ బదులిస్తూ బ్రతికేస్తా


బాధలు భేదించలేని పాషాణం నాహృదయం

రాతిగుండె కాఠిన్యం చూపిస్తూ బ్రతికేస్తా


సమస్యలే చుట్టుముట్టి సుడిగుండం రేపుతున్న

చేపలాగ వరదల్లో ఈదేస్తూ బ్రతికేస్తా


గెలుపు ఓటములు రెండూ గిలిగింతలు పెడుతున్నా

ఆశావహ నింగిలోన విహరిస్తూ బ్రతికేస్తా


కవనమంత మధుదారలు గావుగదా కవిశేఖర

కోకిలనై మధురకవిత వినిపిస్తూ బ్రతికేస్తా

Thursday, May 1, 2025

ఓర్వలేనితనం

 నిన్నునీవు మార్చకోక ఇతరుల నిందించకండి

నాప్రగతిని ఓర్వలేక రాళ్లుమీరు రువ్వకండి


తలరాతలు మార్చాలని తరతరాల నాగమనం

నాపయనం నచ్చకుంటె  గోతులనే తవ్వకండి


నేటివసం తాన్నిచూసి

మనసుమబ్బు తేలియాడ

రేపటి గ్రీష్మాన్నితలచి పదేపదే వెరవకండి


జగతినంత పూలదారి నడిపించుటె నాధ్యేయం

అడుగడుగున నాపదముల ముళ్లకంప బరువకండి


రేపటిఆ ఉషోదయం కవిశేఖరు గాంచెనులే

ఆవెలుతురు చూడలేక జగతికనులు మూయకండి

Wednesday, December 25, 2024

స్వాతంత్య్రం పాట

 ఎక్కడిదీ స్వాతంత్ర్యం ఎవ్వరికీ స్వాతంత్ర్యం

ఉన్నోడికా లేనోడిక మనుషులనే అందరికా

యుగాలెన్ని మారినా బతుకుతీరు మారలే

తరాలెన్ని పోయినా తలరాతలు మారలే

దాస్యమింక తొలగలేదు బతుకుపోరు తప్పలేదు

ఐనాయెందుకు యీ స్వాతంత్ర్య సంబరాలు  ఎక్కడిదీ


మనిషి జాతిపుట్టుకకూ స్త్రీమూర్తే మూలమైన

ఆడబిడ్డ పుట్టుకకూ ఆటంకమె యడుగడుగున

అంగడిలో పశువులుగ అమ్మఘయుట వీడలేదు

ఐనా. ఐనా 

ఐనాయెందుకు మనకీ స్వాతంత్ర్య సంబరాలు  ఎక్కడిదీ


ఆలనపాలన లేని అనాథలుగ ధీనత్వం

ఆడుకునే వయసులోనె పనితప్పని హీనత్వం

 మెతుకులేక బడిలేక  ఒంటరిగా బతుకలేక

 వెట్టిఊబిలోకి నెట్టె రాక్షసత్వంమీడలేదు

ఐనా. ఐనా 

ఐనాయెందుకు మనకీ స్వాతంత్ర్య సంబరాలు  ఎక్కడిదీ


పెన్నుపట్టు యువతనేడు గన్నుపట్టి కదులుతోంది

మానవతా జాడలలో మతతత్వం రేగుతోంది

రాచరికపు అరాచకమె అణువణువున జ్వలిస్తోంది

ఐనా. ఐనా 

ఐనాయెందుకు మనకీ స్వాతంత్ర్య సంబరాలు  ఎక్కడిదీ


Saturday, November 30, 2024

బాల్యం

 అపూర్వమైనది బాల్యం

అపురూపమైనది బాల్యం

ఎంతెత్తుకెదిగినా కుదురైనది బాల్యం

సంఘర్షణలకు సాంత్వనం బాల్యం

ఊహలపిట్టగూడు బాల్యం

అలరించిన సీతాకోక బాల్యం

నింగిలపొడిసిన సింగిడి బాల్యం

గ్రీష్మమెరుగని వసంతం బాల్యం

అలలై విరిసే నురగలు బాల్యం

శరత్కాలపు చంద్రిక బాల్యం

మమతల కోవెల బాల్యం

మల్లెల అల్లిక బాల్యం

మధురాతిమధురం బాల్యం

మరుపురాని మరువలేని

ముత్యపుచిప్ప బాల్యం

Friday, November 8, 2024

చందమామ గజల్

 ఆకసాన అందమై యలరింది చందమామ

ఈధరణి చీకట్లను తరిమింది చందమామ


తనకిలలో సాటిలేక తనకెవ్వరు పోటిరాక

అనదినమ్ము అలుపులేక ఎదిగింది చందమామ


అమావాస్య నిశీవ్యథలు అమాంతమ్ము కప్పేసిన

తొలివెలుగులు పొందేందుకు తపించింది చందమామ


వెలుగులన్ని నీరసించి ఆనవాలె కోల్పోయిన

తిరిగివెలుగు పులిమేందుకు భరించింది చందమామ


తనువునిండ వెలుగులుంటె ఆహార్యమె కవిశేఖర 

రవికిరణపు వేదనెంతొ భరించింది చందమామ

Friday, October 4, 2024

గజల్ చందమామ

 ఆకసాన అందమై యలరింది చందమామ

ఈధరణి చీకట్లను తరిమింది చందమామ


తనకిలలో సాటిలేక తనకెవ్వరు పోటిరాక

అనదినమ్ము అలుపులేక ఎదిగింది చందమామ


అమావాస్య నిశీవ్యథలు అమాంతమ్ము కప్పేసిన

తొలివెలుగులు పొందేందుకు తపించింది చందమామ


వెలుగులన్ని నీరసించి ఆనవాలె కోల్పోయిన

తిరిగివెలుగు పులిమేందుకు భరించింది చందమామ


తనువునిండ వెలుగులుంటె ఆహార్యమె కవిశేఖర 

రవికిరణపు వేదనెంతొ భరించింది చందమామ

Tuesday, January 23, 2024

గజల్ (శిలలన్నీ)

 గజల్ 


శిలలన్నీ ప్రతిమలుగా ప్రభవించుట సాధ్యమేన మనుషులంత మహాత్ములై వెలుగొందుట సాధ్యమేన


ఊహలన్నీ పెనుగాలికి ఏకమేడలై కూలెను కాలముతో సాగకుండా ఎదురించుట సాధ్యమేన


సాంకేతిక ముసుగులోన సమాజగతి దాగున్నది అభివృద్దిని కాంచకుండా నిదురించుట సాధ్యమేన 


అజ్ఞానపు ఆగాదాలు అడుగడుగున ప్రతిఘటించె 

ప్రత్యామ్నాయ ప్రగతిబాట పయనించుట సాధ్యమేన 


మానవతను మరచిపోయి మనుగడ సాగించు టేల 

మమత లేక మనషులుగా జీవించుట సాధ్యమేన


తోలుబొమ్మలాడించుట సూత్రధారి పనితనమే ఆజ్ఞ మీరి క్షణమయినా మనగలుగుట సాధ్యమేన


అపజయాల చింతనలో కవిరాజుకు కలతెందుకు తెగిన గాలిపటమిలలో పైకెగురుట సాధ్యమేన


పచ్చిమట్ల రాజశేఖర్