Friday, October 24, 2025

ఆశావాదం గజల్

 దరిచేరని గమ్యానికి దిగులెందుకు నేస్తమా

కాచుకున్న కష్టాలకు వెరపెందుకు నేస్తమా


శిశిరంలో రాలితేనె వసంతమై పూస్తుందీ

చేజారిన విజయాలకు చింతెందుకు నేస్తమా


పాలకడలి విషమువెనుక అమృతపొంగు పొరిలినదీ

ఫలితముకై రేబవళ్ళు కలతెందుకు నేస్తమా


వెలుగువెంటె చీకట్లూ నిశిదాటితె ఉషోదయం

కృషిచేసిన వృధా కాదు గుబులెందుకు నేస్తమా


సరసుశిరసు మాడితేనె మబ్బులయ్యి కురిసేదీ

మార్పుకోరి నడిచేందుకు బెరుకెందుకు నేస్తమా


ఉలిదెబ్బల కోర్వకుండ శిలలువెలుగు లీనవుగా

విజయాలను చేరలేని నడకెందుకు నేస్తమా


గమ్యమెంత కష్టతరమొ కవిశేఖరు డెరుగునులే

అడుగుముందు కేసినడువు అలుపెందుకు నేస్తమా

Monday, October 20, 2025

దీపావళి గజల్

 ప్రమిదలాగ వెలగాలని సాధనలే దీపావళి

తిమిరమంత తొలగాలని బోధనలే దీపావళి


సెగలురేపు చలిమంటల గిలిగింతలు పెట్టువేళ హిమసహితపు సంధ్యలన్ని వేదనలే దీపావళి


మనచుట్టూ నేడుకూడ అసురలింక ఉన్నరుగా

మనసునంటు రాక్షసగుణ భేదనలే దీపావళి


బతుకంతా తిమిరమోలె కష్టాలే మసురుతున్న

ప్రమిదవయ్యి వెలగాలనె బోధనలే దీపావళి


అమవసనిశి అమాంతమూ కవిశేఖరు కమ్మజూడ

దారిద్ర్యము బాపునట్టి శోధనలే దీపావళి


రాజశేఖర్ పచ్చిమట్ల

Friday, September 19, 2025

ఎదురీదుతు బతికేస్తా

 విధిరాతను ఎదురిస్తూ వీరుడిలా బ్రతికేస్తా

కష్టాలకు చిరునగవుతొ బదులిస్తూ బ్రతికేస్తా


బాధలు భేదించలేని పాషాణం నాహృదయం

రాతిగుండె కాఠిన్యం చూపిస్తూ బ్రతికేస్తా


సమస్యలే చుట్టుముట్టి సుడిగుండం రేపుతున్న

చేపలాగ వరదల్లో ఈదేస్తూ బ్రతికేస్తా


గెలుపు ఓటములు రెండూ గిలిగింతలు పెడుతున్నా

ఆశావహ నింగిలోన విహరిస్తూ బ్రతికేస్తా


కవనమంత మధుదారలు గావుగదా కవిశేఖర

కోకిలనై మధురకవిత వినిపిస్తూ బ్రతికేస్తా

Thursday, May 1, 2025

ఓర్వలేనితనం

 నిన్నునీవు మార్చకోక ఇతరుల నిందించకండి

నాప్రగతిని ఓర్వలేక రాళ్లుమీరు రువ్వకండి


తలరాతలు మార్చాలని తరతరాల నాగమనం

నాపయనం నచ్చకుంటె  గోతులనే తవ్వకండి


నేటివసం తాన్నిచూసి

మనసుమబ్బు తేలియాడ

రేపటి గ్రీష్మాన్నితలచి పదేపదే వెరవకండి


జగతినంత పూలదారి నడిపించుటె నాధ్యేయం

అడుగడుగున నాపదముల ముళ్లకంప బరువకండి


రేపటిఆ ఉషోదయం కవిశేఖరు గాంచెనులే

ఆవెలుతురు చూడలేక జగతికనులు మూయకండి