Tuesday, November 28, 2023

శీర్షిక: చెదిరినకల

 అంశం: చిత్రకవిత


కవిపేరు: రాజశేఖర్ పచ్చిమట్ల

9676666353


నామనోవీధిని విహరించే చెలి కనువాకిట చేరినక్షణం


నాజీవనయానం రంగుల హరివిల్లై విరిసింది నిజం


నీతోకలిసి నడిచిన గతమంతా తలపించే నందనవనం


నన్నువీడిన మరుక్షణం నేనో విలపించే పగిలిన అద్దం


పంచవన్నెల చంద్ర వదనాన్ని బండబార్చావెందు చెలీ!

Monday, November 27, 2023

ప్రజా పాశుపతం (ఓటు)

 

అందని ఆశలు రేపి

అమాయకప్రజల నాడించే

నయవంచక నాయకుల

నడ్డివిరిచే పాశుపతాస్త్రం


మద్యమాంసాల మత్తులమమరిపించి

నోట్లు చూపి నోరూరించినా

తాయిలాల గమ్మత్తులో చిత్తుగాక

గుండాల గుండెల్లో దింపే పోటు


ఉచిత పథకాలు ఉత్తుత్త హామీలు

అమలుకు నోచని ఆశల పలారానికై

 అహరహం ఎదురుచూపులు

సంక్షేమం అందనిద్రాక్షేనని తెలిసి

స్వక్షేమాన్ని గద్దెదించే ప్రజాతీర్పు


అయిదు రోజులు అందట్ల దిరిగి

కడుపులు గడ్డాలు వట్టుకొని

అయిదేండ్లు బానిసల్లా జూసి

ఎదురుతిరిగితే యెదలతన్నే

అణచివేతను తుణిచివేసే వజ్రాయుధం


ఓట్లపేరుతో వరదలుగ పారుతు

వంగివంగి దండంపెట్టి

గెలిచినం పంగనామాలు వెట్టే పాలకులను

మనీదప్ప మనుషి మర్మమెరుగని 

దగాకోరు నాయకదండును

పల్లెఅతీగతీ దెలువని మదపుటేనుగు

పెద్దమనుషుల మెడలువంచే అంకుశం


అహం నిండిన ధుర్యోధనాదుల

ధనాధికార మదమణిచే పరుశురామాస్త్రం

రాజకీయ వంచన చేసే

రాబందుల రెక్కలు నరికి

విచక్షణాయుత విలువలు దెలిసి

ప్రజారంజకపాలకుల నిర్ణయించే పెద్దరికం

అసలు సిసలు ప్రజాస్వామ్యం

అంశం: శాంతి శీర్షిక: వెతుకులాట


1.శాంతి 

వలసపోయింది

మానవులలోం

దానవ చూడలేక


2.మనసు విరిగిందో

మనిషే ఒరిగిండో

శాంతి

గూడు సెదిరింది


3.శాంతి కోరి

విశ్వాంతరాలలో వెదికిన

అశాంతి

ఆవగింజంత తగ్గలే



4.కార్తిక దీపకాంతి

కలత దీర్చింది

చీకటిలోకంలో

మిణుగురే శాంతి


5.మనసు సచ్చిందో

మనిషే మారిండో

శాంతి

చాలా దూరమైంది


పచ్చిమట్ల రాజశేఖర్

Tuesday, November 21, 2023

మెరిసి మురిసిన ముదిమి

 


ఎవరికెవరు ఏమౌతమో తెలియకుండానే కలిసి పోయాము

పాణిగ్రహనంతో అల్లుకుని పూవుతావిలా ఏకమై పోయాము

యవ్వనం వాడిపోయినా కొలది ప్రేమలత విరబూస్తూనే ఉందిచెలీ

అన్యోన్యతకు మనసుంటే చాలు కదా అందుకేనేమో

కడదాకా కలిసుండడమే కదా మనప్రణయ దారులకు గుర్తు!


పచ్చిమట్ల రాజశేఖర్

Sunday, November 19, 2023

నాన్న (గేయం)

 

నాన్నుంటే చాలురా

సంపదలింకేలరా

ఆదైవమె చెంత నుండ

దైన్యం దరిచేరదురా

మనఅడుగుకు గొడుగుపట్టి

మనభవితకు బాటలేసి

మనకలలకు కాపుగాసి

ధర్యమయ్యి దాపునిల్చి

తనువెండిన తననీడను పంచుతాడురా నాన్న

మనకోసమె అనునిత్యం తపిస్తాడురా నాన్న


మనకలలను నిజంచేసి

మమతలతో మనలపెంచి

తానవనిలో కూరిపోతు ఆకసాని కెత్తుతాడు

యెదుగుతున్న మనలచూసి యెదమాటున మురుస్తాడు

నింగినంట నీవెగిరితే దారమవుతడూ నాన్న

పడినాప్రతిసారి మనల లేపుతాడురా నాన్న


తన ఆశల ననుచుకుంటు మనల పెంచునూ

యెదుగుతున్న మనలచూసి యెదల మురియునూ




గెలుపుకోసం పరితపిస్తూ

జీవితంలో ఓడినప్పుడు

వెన్నుతట్టే వెంటనడిచే ధైర్యమే నాన్న

 నీగెలుపునే తనదనుకొని

వల్లెవేయుచు  మురిసేపోయె మంచిమనిషే నాన్న

Saturday, November 11, 2023

గజల్

 ఆవసంత కోయిలమ్మ మూగవోయ నెందుకో

ఆపచ్చని ప్రకృతినేడు ఆకురాల్చె నెందుకో


మనిషిబతుకు యెండమావి నీటిచెమ్మ లేకున్నా

కోరికలే గుర్రాలై పరుగుదీయు నెందుకో 


వలపురాణి చెలిమిలేక వయసన్నది వాడుతున్న

ఆవసంత మాసాంతం విరహవేద నెందుకో


బంధాలే పాశాలై వేదనెంతొ పెడుతున్నా

అనుబంధపు ఆనవాల అన్వేషణ లెందుకో


 ఆకాసాన చుక్కలదొర వెలుగులెన్ని పంచినా

కవిశేఖరు మదిచీకటి కమ్ముకున్న దెందుకో

Tuesday, November 7, 2023

బతుకమ్మ పాట

 తళతళ మెరిసేటి తంగేడిపూలు

మిళమిళ మెరిసేటి మందారములు

బంగరుసొగసున్న బంతులు చామంతులు

తీరుతీరురంగుల్లో తీరొక్కపువ్వులూ

అన్నిపువ్వులు గలిసి బతుకమ్మై విరిసెనూ

ఆడబిడ్డల మోమున ఆంనందం మురిసెను


మెట్టినింట మెరిసేటి ఆడబిడ్డలందరూ

పుట్టిల్లు తోవబట్టి పులకించి పోతరూ

ఆడపిల్లరాకజూచి యాతల్లిదండ్రులు

ఆనందంమదిలనిండి మురిసి మెరిసిపోతరూ


Sunday, November 5, 2023

మళ్లీ పోవాలనుంది పళ్లెటూరుకు (పాట)

మళ్లీ పోవాలనుంది పళ్లెటూరుకు

ఒళ్లో వాలాలనుంది తల్లిపేగుకు

మళ్లీపోవాలనుంది పల్లెటూరుకు

మళ్ళిమళ్ళీ పోవాలనుంది తల్లిచెంతకూ

అలలతీరు సుడులుతిరిగె జ్ఞాపకాలు నెమరేయుచూ

అనుభవాల దొంతరలను అహర్నిశలు తడిమేయుచూ

మళ్లీ పోవాలనుంది పళ్లెటూరుకు

ఒళ్లో వాలాలనుంది తల్లిపేగుకు

వసివాడని పసిప్రాయం గాలమేసి లాగుతుంటే

ఆప్యాయత లొలికేలా అమ్మలాలి పాడుతుంటే

చిన్ననాటి జ్ఞాపకాలు గిలిగింతలు పెడుతుంటే

ఆవసంత తీరాలకు ఆగకుండ సాగిపోయి

ఒదగాలని వున్నది ఆమధురావని ఒడిలోనికి  ॥మళ్లీ॥


పల్లెనిడిచి తల్లినిడిచి వెలగబెట్టినదియేమిటొ

పచ్చదనపు గుండెచీల్చి పాముకున్నదది యేమిటొ

నిలువనీడనిచ్చు తరుల కూలగొట్టె కుతంత్రాల

వాసనైన సోకనట్టి జనపదాల జాడవట్టి  ॥మళ్లీ॥


ఎంతకాలమయ్యిందో యెదలనిండ శ్వాసించి

 ఎన్నిరోజులయ్యిందో  మనసారా భాషించి

ఆత్మీయతలడుగంటి అనురాగం కొడిగట్టి

ఎండినగుండెల లోతున ఆరని ఆతడినెతుకుతూ

 ఒక్కసారి తనివి తీర మట్టిని ముద్దాడాలి

(తనివితీర తల్లియెదను తడిమి మురిసిపోయేందుకు )

వెక్కియేడ్చే తల్లి యెదశోకం బాపుటకు  ॥మళ్లీ॥

ఆఘ్రానించాలనుంటే ఆమట్టి పరిమళం

ఆస్వాదించాలనుంటే  ఆజీవనమాధుర్యం

తప్పదు మానవజాతి ఆత్మావలోకనం  

ప్రగతిముసుగుదీసి మరల పల్లెసొగసు చూసేందుకు ॥మళ్లీ॥ 

మరబతుకులు మాకొద్దని మనసు మొత్తుకుంటుంటే

పచ్చనైన పల్లెసీమ స్వాగతాలు పలుకుతుంటే

సీతకోకలై మనస్సు గాలిలోన తేలియాడ

కలలు మరచి కన్నతల్లి కౌగిలిలో చేరేందుకు ॥మళ్లీ॥

తప్పటడుగు తెలుసు కోని తల్లి ఒడిని చేరుదాం

సాలెగూటి పోగులోలె పల్లెను కాపాడుదాం ॥మళ్లీ॥