సీసం॥
అమ్మనాన్నలతోడ యాదెరు వొందంగ
తెలుగు పదపరాగ తీపి దెలిసె
తోడివారలతోడ నాడంగపాడంగ
పలుపదమ్ములకోటి పలుక దెలిసె
పలుదినమ్ములువోసి బడిలోన సదువంగ
పదలాలితమ్మది పట్టువడియె
పలుకుబడులు దెల్సె పదబంధములుదెల్సె
భాషదెలిసె పలుకు యాస దెలిసె
తెలుగుతల్లియెదన తేనెపల్కులుగ్రోల
మాతృభాష యన్న మమత బెరిగె
ఆత్మగల్లభాష యనిజనుల్ కీర్తించ
తెలుగువారకేల చులక నయ్యె
(తెలుగు జిహ్వకేల తెగులు బుట్టె)
సీసం॥
ఉంగవుంగాయంటు ఊకొట్టి పాడంగ
ఆనంద మందేటి అమ్మ గురువు
వేలుబట్టినడిపి వెన్నెమ్ము కైనిల్చి
నడకనేర్పెడువేళ నాన్న గురువు
ఆటపాటల తోడ పాటముల్ నేర్వంగ
అండయై తానిల్చు అన్న గురువు
బడిలోని పాఠముల్ బలిమితో సదువంగ
ఆటవిడుపుజూపు యక్క గురువు
ఆ.వె.
పలకబలపమిచ్చి పాఠశాలనుజేర్చ
పెరిమ తోడ నేర్పు పెద్దగురువు
అట్టిగురుల పదము లానందముగతాకి
శిరము వంచి మ్రొక్కె శిష్యగణము
No comments:
Post a Comment