ప్రకృతి రామణీయకత
పరిఢవిల్లిన నేల
దాయాదుల పోరు దద్దరిల్లిన నేల
పచ్చదనపు పరవశపులోగిల్ల
వెచ్చని రుధిరం
తనువున జల్లుకుని పరిపరి విధాల
పరితపించిన నేల
వేటకుక్కలై తరుముకొస్తున్న ప్రత్యర్థిమూకలను
వెన్నుచూపని ధైర్యంతో నిలువరించిన ధీరులు!
ఎగిరే బాంబులై ఎదుటివారిపై
రెక్కలు విచ్చుకు పోరాడిన పందెంకోళ్లు!
దాయాదుల తుపాకులు
తనువును చిద్రం చేస్తున్నా
మొక్కవోని ధైర్యం మొకాన నిల్పుకొని
ముందుకుసాగిన సాహస తూటాలు!
కసాయి తూటాలు గుండెల్ని చీల్చినా
కారుతున్న రక్తపుటేరులతో
నేలతల్లి ఎరుపెక్కి జడుసుకుంటున్నా
అడుగు నేలనుసైతం ఆక్రమించనీకుండా
ముందుసాగిన మందుగుండ్లు!
సాయుధ బలగాలపై ఉక్కుపాదం మోప
వీజృంభించి కదిలిన యుద్ధ ట్యాంకులు!
భరతమాత ప్రియసుతుల పదకవాతుతో
పౌరుషం నిండిన నేల కార్గిల్!
ఆదమరిచి నిద్రించిన భరతమాత ఉలికిపడినదినం!
యావత్ భారతం భీతిల్లిన భయానకఘట్టం!
వీరోచితపోరాటాల ఫలితం!
తుపాకి తూటాలకు ఎదురేగిన సాహసం!
జనని భారతికి అంజలిఘటించి
సమర్పించిన
ఎరుపెక్కిన అడవిమల్లెల హారం!
గెలుపూ ఓటమి
పరాక్రమం పలాయనం
జననం మరణం
జయజయ ధ్వానాలు హాహాకారాల సమాహారం!
తెలిమంచు పైపొరలొ మోదుగుపూలు తాపిన
రుధిర హిమాలయం కార్గిలు
ఎందరో వీరులు మరణమొక జననమై
రణము జేసిన కార్గిలు
ఎందరో యోధులను తన ఒడిన జోకొట్టి
అమరులను జేసిన మరుభూమి కార్గిలు!