Friday, August 26, 2022

నానీలు

 ఎన్ని వేళ చేతులు

బురదను చిలికాయో

అన్నపు వెన్నను

వెలికి తీయుటకు


కూరగాయలకై

నింగిని వెదికాను

వాటికీవేళ 

రెక్కలొచ్చాయిగా


మేఘం వర్షించింది

పంటచేలపై

రైతు కన్నీరు

వాటిని తడుపలేదని


జీవన క్షేత్రంలో

ఆశలు మొలకెత్తాయి

చెమటచుక్కలు

నేలను తడిపి


రైతన్న 

పొద్దెక్కినా లేవలేదు

తాగింది

పురుగు మందుకదా


గాలిపటం

పైకెగురడం లేదు

దారం తెగింది

గమనించలేదు


ప్రజాస్వామ్యం

పైసకు గులామైంది

ఓటరు

కాసు క్కూసున్నాడు గదా


పాలకులు 

దోచేస్తున్నరు

ఎలక్షన్లలో

పంచేందుకు


జెండాలు ఎజెండాలు

పార్టీలు మార్చుతుండ్రు

పాలకులు

ఊసరవెల్లికి పోటీగా


చెరువుల 

యెదలెంత సంకుచించాయి

చినుకును సైతం

ఛీకొడుతున్నాయి.

No comments: