Tuesday, August 16, 2022

అద్వితీయ స్వర్గసీమ (అఖండ భారతం)

 స్వదేశీ సంస్థానాలాదిగా

విదేశి పాలకుల అణచివేత ధోరణికి

అడ్డుకట్ట వేసేందుకు అలలై ఎగిసి

ఉద్యమించి ఉరిమిన

వీరుల నుదుటి తిలకమె  

కాషాయమై మురిసిన జెండా!


స్వచ్ఛతరోజ్వల హిమగిరి 

శిరమున జాలువారిన

జీవనదుల తరగల నురగలై

జిలుగులు పంచే వెన్నెల వెలుగులై 

తెలుపు వర్ణమై మెరిసిన జెండా!


ప్రకృతి పురుడువోసిన పచ్చని వనసీమలు

వర్షాధార తృణధాన్యాల రాశులు

అన్నపూర్ణావతారమై అలరారిన

భరతావని యెదపై ఏపుగ పెరిగిన

పజ్జొన్నలు పంటపొలాలె

పచ్చరంగు పులిమిన జెండా!


అహింసోద్యమం మొదలు

అరాచక పాలకుల తరిమేదాక

ఎందరో షహీద్ ల వెచ్చని ఊపిరులు 

తనువణువణువూ నింపుకున్న తిరంగజెండా!

త్యాగధనుల తనురుధిర దారల

తానమాడిన అరుణపతాకం మనజెండా!

కశ్మీరం మొదలు కన్యాకుమారి దాక

విభిన్న సంస్కృతుల విశిష్ట మేళవింపు

ధార్మిక వర్తన తాత్త్విక చింతనలో

విరిసి మెరిసిన ఇంద్రధనసు మనజెండా!


భరతమాత శిరమున భ్రమరమై ఎగురుతూ

భరతజాతి యెదలో  సాకారమైన గర్వరేఖై ఒదుగుతూ

సర్వమత సహన రూపమై సాగుతూ

భారతీయతత్వంతో ఫరిఢవిల్లుతూ

ప్రపంచం ప్రణమిల్లే పవిత్రమూర్తి!

విశ్వమంతా వీక్షించే విమలమూర్తి!

అద్వితీయ స్వర్గసీమ అఖండ భారతం!



No comments: