Tuesday, June 16, 2020

సంఘర్షణ(గజల్)

వానచినుకు కురిసేందుకు మేఘమెంత కరగాలో
మొలక చిగురువేసేందుకు విత్తుయెంత నలగాలో

ఆనింగిని కమ్మేసిన చీకట్లను తరిమేందుకు
ఆకసాన అద్దినట్టి తారలెంత మెరవాలో

పసిపాపల ముసినవ్వులు మనముంగిట మెరియుటకు
తల్లితనువు అణువణువూ బాధనెంత భరించాలో

జగతిలోని సంఘటనలు కవిమదిలో నలిపోయి
కవితలుగా వెలయుటకూ వేదనెంత భరించాలో

(పుఢమితనువు పచ్చదనము)/
పచ్చదనపు ప్రకృతినీ కవిశేఖరు గాంచుటకు
మెత్తనైన మట్టిపొరల గాయమెంత కలగాలో

త్యాగశీలురు

తనువు చిద్రమై
వర్షిస్తున్న రుదిరదారల
నిలువెల్లా తడిసిన
నిర్భీతితో నిలకడగ కొట్టుకునేగుండె
ఒడలు సడలి పట్టుదప్పుతున్న
మరణం కళ్లముందు నిలిచిన
చివరిక్షణం కూడ
సత్తువంతా కూడదీసుకొని
చివరిఊపిరితో
'జైహింద్ ' అని పలికేధైర్యంతో
చివరి నెత్తుటిబొట్టునుసైతం
దేశరక్షణకు దారవోసే దేశభక్తుడు జవాన్

(చైనా - భారత్ ఎదురుకాల్పుల ఘటనలో మరణించిన వీరులకు జోహార్లు)

Monday, June 15, 2020

గతించని జ్ఞాపకాల ముల్లె

వత్సరాలు గతించిపోతున్నయి
ఏడుగుర్రాల రథమెక్కిన సూర్యుడు
ఎడతెరిపిలేకుండ తిరుగుతనే ఉన్నడు
ప్రకృతి పాతనుయెదలోతులో దాచుకొని
కొంగొత్త అందాలొలుకుతుంది

అయినా
నీ జ్ఞాపకాలు మమ్ముల్నొదిలడంలేదు
సిరంచకోట గుట్టల నడుమ
పచ్చనిపందిరిని మోస్తున్న తాడిచెట్లల్ల
పొందికగ పొందిచ్చి కట్టిన
తాటికమ్మల మండువ
చిలుకొయ్యకు తలిగేసిన మోకుముత్తాదు
యేళ్ల పొడువూత నువు గొట్టిన నెర్సుబండ
శరీరం వక్కలైన నీటిని మోస్తూ కత్తిమైలదీసే మొర్రిబింకి
నీకత్తులకు పదునువెట్టిన
తీడుగొల
మేఘాలనురుగులు నిండిన కుండలను
భుజంమోసిన కావడిబద్ద
అన్ని దిగులువడుతున్నయి
మమ్ముల్నెందుకు ముడుతలేరని!
నిండా శోకంల మునిగినయి
మాగౌడు గనవడ్తలేడని!
వనంల అడుగువెడ్తెజాలు
దినమంత ఎప్పుడు పిలిచినా
పలికే నీ ఆత్మీయపలుకులు
నన్ను స్పర్శిస్తు దోబూచులాడుతున్నయి
నీఅడుగుల గుర్తులు
కన్నీటి చెలిమలై
పాలిపోయిన నాప్రతిబింబాన్ని చూపుతున్నయి!
నీకునీడనిచ్చిన
మండువలో మర్రిచెట్టు నిలువునిత్తారం పడ్డది
జువ్విచెట్టు తన్నుతాను మార్చుకొని నాజూకయింది
భూబకాసురుల పారదెబ్బలకు
గడ్డంత గలిసిపోయి పొలమైంది
మండువ గూలి మొండెమైంది
మోకుముత్తాదు చీకిపోయింది
నీవు గలియదిరిగిన తాళ్లని
తలనరికిన సిపాయిలైనయి!

నీవులేక కళదప్పిన మనయిల్లోలె
మండువంత వెలవెలబోయింది!
నీవులేక ఆకులుపరుచుంది
యెల్లమ్మగుడినిండ!
నీ మడితానాలులేక
దేవతామూర్తులన్ని
మైలవట్టి గానరావట్టినయి!

ఊటచెలిమలైన కన్నీరెంత బారిన
తుడుచలేక పోతుంది
మనసులో పాతుకున్న నీబొమ్మను!
ఎంతమంది మావెంటున్నా
మమ్మల్ని వదలడంలేదు నీవులేని లోటు!

ఏ ఉడుతలకు చెట్లెక్క నేర్పుతున్నవో
ఏచిలుకలు తీయని పలకరింపు నేర్పుతున్నవో
ఏబాటసారులకు గుడిసెలేత్తున్నవో
ఏ తేనెటీగలకు కల్లంపుతున్నవో
ప్రకృతిలో లీనమైన నువు
సాల్లెన్ని గడిచినా
మరువలేకపోతున్నం నాన నిన్ను!
నీ తలపులు వీడి
మనలేకపోతున్న నాన!

(పదేండ్ల కింద దివికేగిన నాన్న యాదిలో)

Sunday, June 14, 2020

పోరుబిడ్డ పాపన్న (సీసాలు)

1.
గౌడకు లముబుట్టి| తాడిచెట్టునుగీసి (తొడగొట్టి బరిగీసి)
గీతకార్మికులకు ఊతమిచ్చె (దుష్టపాలకులను ద్రుంచ జూచె)

సామాజికాంశాల| చర్చించి చెలిమొప్ప
సబ్బండవర్ణాల| సంఘటించె

ప్రజలరక్షణకోరి| ప్రభువులకెదురేగి
ఊరిజనులగూర్చి| పోరుజేసె

ఓరుగల్లునబుట్టి| పోరుబాటనుబట్టి
ప్రజలందు భయమును| బారద్రోలె

బానిసత్వము జూడంగ| బాధపడెను
వెట్టిచాకిరినిదలంచి| వ్యధ జెందె
జాతి జనులకు జూపించ ప్రగతి బాట
జన్మ భూమిని విడిపించ జంగు సాగె

2.
 శైశవమ్ముమొదలు| శైవభక్తిచెలగి
కాటమయ్యనుగొల్చి| కల్లుగీసె

పన్నువసూలుకై| పల్లెకేతెంచిన
దొరలభంటులనెల్ల| తరిమిగొట్టె

పట్వారులపలుకు|బడినిదుంచి
కరణాలకెదురెల్లి| కాలుదువ్వె

సబ్బండ వర్ణాల|సంఘటితమొనర్చి
ధర్మయుద్ధముజేయ| దారిజూపె

పల్లెలన్ దోచెరాకాసు| లెల్లదరిమి
ఊరు బాగుకొరకు|ఉద్యమించె
సకల వృత్తి జనుల సాపాటు కలిగించ
ముక్తినొసగ తాను| ముందునడిచె

వరుణస్తవం (సీసం)

వరుణ సీసం
1.
అభ్రమా మామీద అలకెందు కోనీకు
కరుణించి కురువవా వరుణ దేవ!
నీరాక కైమేము రేబవల్ వేచేము
కరుణించి కురువవా వరుణదేవ!
మాదుత ప్పిదములు మనమునం దలపక
కరుణించి కురువవా వరుణదేవ!
ఆశలా విరులయ్యి అడుగంటు వేలాయె
కరుణించి కురవవా వరుణదేవ!


అలమ టించె నవని యాకలి కేకలై
దప్పి దీర్చ నైన దరకు రావె
నింగి నుంచి మమ్ము తొంగిచూ చెదవేల
కరుణించి కురవవా వరుణదేవ!

2.

మొరవిని కరుణించు వరుణదేవ!

ప్రకృతి సొగసు (చిత్రకవిత)



పులిపిట్టలమాటు దాగిన ఆకాశం
ఆడపిల్లై అవతరించింది
మబ్బులదాగిన అమాయకత్వం
అందగత్తె రూపుదాల్చింది
జీవజాతిని నయనాలుగ
కొమ్మరెమ్మలు కొసపెదాలుగ
ఊహించని మోహనాంగి ఉద్బవించింది
ప్రకృతి అందమైన బొమ్మను ప్రసవించింది!

Friday, June 12, 2020

గురువు (పద్యం)

గురువు రూపు చూడ కురుచగానున్ననూ
జ్ఞాన దీప్తి బంచు కొనల వరకు
దీపసెగల తీరు పాపని శినిబాపు
సురుకు వెట్టు ఖలుల కరములంట

Sunday, June 7, 2020

వలపుసమీరం(గజల్ )


చెలియకనులు సంధించిన చూపుశరము తాలగలన
మృదుమోవిని జాలువారు పరుషపదము తాలగలన

వసంతాన విరులసిరులు వర్షించే మేఘమాల
విరహపువీవెనలూపెడు వడగాలుల తాలగలన

చెలితలపుల నదితరగల చెలగిచెలగి ఈదులాడ
ఊటచెలిమయెదలోతులొ సుడిగుండము తాలగలన

నింగినుంచి తొంగిచూచు జాబిలంటి జానకనుల
అలమటించి యంబరమై వర్షించిన తాలగలన

యెదసరసున ఓలలాడు సరోజమౌ కవిశేఖరు
మదగజమ్ము సృష్టించే ప్రళయక్రీడ తాలగలన