విప్లవం మొదలు వేదాల వరకు జీవనయానం సాగించిన బహుముఖ ప్రజ్ఞాశాలి, అపర వ్యాసుడు, నిత్యసాహితీ కృషీవలుడు గద్య దాశరథి కలంనుండి ఎగిసిన నవలాకెరటం "చిల్లర దేవుళ్ళు" గురించి గొల్లపెల్లి మండలకేంద్రంలో తెలుగు అధ్యాపకులుగా కొనసాగుతున్న పచ్చిమట్ల రాజశేఖర్ గారు తన అభిప్రాయాలనిలా వివరించారు.
'పెన్నే గన్నుగా చేబూని' ప్రజాపక్షం వహించి పోరాడిన సాహితీయోధుడు దాశరథి రంగాచార్య. విషయమేదైనా కుండబద్దలు గొట్టినట్టు ముక్కుసూటిగ చెప్పడం ఆయన నైజం.తన రచనలతో ప్రజల్ని మేల్కొల్పడానికి, అన్యాయాన్నెదురించడానికీ ఇష్టపడే రంగాచార్యులుగారి తొలి నవల, తెలంగాణ మాండలిక నవలగా పేరు గాంచిన 'చిల్లరదేవుళ్ళు' 1969లో గ్రంథరూపు సంతరించుకుంది. రంగాచార్య రచనలు భావోద్రేకాల్ని రగిలించేకన్నా భావోద్వేగాల్ని కలిగిస్తాయని చెప్పొచ్చు. వట్టికోట ఆళ్వారు స్వామి వదిలివెళ్లిన ఉద్యమాన్ని తన భుజస్కంధాలపై వేసుకొని 'గంగు' కొనసాగింపుగా ఈనవల రాసారు. దానికి కేంద్ర సాహిత్య అకాడమీఅవార్డు కూడా రావడం జరిగింది. తెలంగాణ సాయుధపోరాటాన్ని దగ్గరగా వీక్షించుటచేత ఆనాటి పాలకుల తీరు, తెలంగాణ సామాజిక స్థితిగతులకు అద్దం పడుతుందీ నవల. గార్ల ప్రాంతంలోని జాగీర్దార్ల దాష్టికాలను కళ్ళకుగట్టింది. ఈనవలలోని పీరిగాడు, పాణిమంజరి, ఇందిర పాత్రలు నాటిప్రజలకు ప్రతినిధులై నిలిచారు. ఈనవలలో తెలంగాణ పలుకుబళ్లు, నుడికారాన్ని ఒలికించి అక్షరబ్రహ్మగ, సాహితీసమరయోధునిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు దాశరథి రంగాచార్య