Saturday, April 21, 2018

నీలోని నేను

వర్తమానం నువ్వే
భవిషతంతా నువ్వే
గతమంతా నువ్వే
నా బతుకంతా నువ్వే!

నీతోనే జీవితం
నీతలపులే అనునిత్యం
నీ తోనే సహవాసం
నీ హృదిలోనే ఆవాసం!

చెలీ
నీవలపుల తలపుల్లో
మునిగితేలుతూ మురిసిపోతూ
నన్ను నేను మరిచిపోతున్నా!

నేనెక్కడున్నా
నామనసు నీ నీడై
నీ అడుగుల ననుసరిస్తుందని
నాహృదయం
నీతలపుల్లో ఓలలాడుతుందని
ఎలాచెప్పను సఖీ !

నీ వలపు సమీరమై
కవ్విస్తుంటే
నా తనువు గతి తప్పి మైమరచిపోయింది
ఆశగా కనులు తెరచి చూస్తే
అంతా శూన్యముగానే ఉంది!

నిండా నిరాశచీకటి నిండిన జీవితంలో
ఆశాకిరణాలు ప్రసరించే అడుగులకై ఎదిరిచూస్తూ
నన్ను వెలుగులోకి నడిపించే ఉషోదయంకై
వేచి చూస్తూ నీలోని నేను ..!


Friday, April 20, 2018

మొక్క నాట వోయి ఒక్క టైన

1.
నీరు లేక నేల నెర్రెబా రుచునుండు
పైరు లన్ని నీట సౌరు లొలుకు
నేల చల్ల బరచి నీటి నిలువ బెంచు
మొక్క నాటవోయి ఒక్క టైన
2.
పాడి పంట లేక పతనమ య్యెనురైతు
కరువు కాట కాలు కలత పెట్టె
కరువు పార ద్రోల కాలము గురిపించు
మొక్క నాట వోయి ఒక్క టైన
3.
చెట్టు చేమ లెండి చిన్నారి పక్షులు
కూడు గూడు లేక కుమిలి పోయె
సకల పక్షి జాతి సావాస ముండేల
మొక్క నాట వోయి ఒక్క టైన
4.
పొదలు లేక పుడమి పొరలుతు న్నదినేడు
పచ్చ దనము లేక పరిత పించు
చెట్లు నాటి పుడమి చింత దీర్చవలెను
మొక్కనాటవోయి ఒక్కటైన
5.
జలమె ప్రాణ ప్రదము జలమెబ్ర తుకుదెర్వు
జలమె రాజ్యమునకు బలము సుమ్మి
దార లుగను జలము ధరణికం దించేల
మొక్కనాటవోయు ఒక్కటైన

6.
అడవు లందె సృష్టి యారంభ మాయెను
అడవె ప్రాణికోటి నాద రించె
అఖిల జీవకోటి కావాస మొసగేటి
మొక్కనాటవోయి ఒక్కటైన
7.
మొక్కనాటకుండ మొగులువం కనుజూచి
వాన కొరకు పొరల (కుంద) ఫలిత మేమి
మొక్క లేక భువికి చుక్క లే లారాలు
మొక్కనాటవోయి ఒక్కటైన
8.
తనువు నావ రించి నడవినం తనుజూచి
పులక రించి పోయె పుడమి తల్లి
పచ్చ దనము జూసి పరవశ మ్మొందేల
మొక్కనాటవోయి ఒక్కటైన
10.
నెర్రె బారి నట్టి నేలలన్ జూచుచు
పరితపించె నుగద వసుధ మాత
అట్టి దుఃఖ మనచి ఆనంద మొందేల
మొక్కనాటవోయి ఒక్కటైన
11.
చెట్లు లేనిదవని యెట్లు వానగురియు
చెట్లు లేక పంటలెట్లు వండు
తరులు లేని యెడల తాండవిం చుకరువు
మొక్కనాటవోయి ఒక్కటైన
12.
తరుల వలన భూమి తపమంత చల్లారు
తరుల వలన బెరుగు నీరు భువిని
తరులు పెంచి వసుధ కరువును త రిమేల
మొక్కనాటవోయి ఒక్కటైన
13.
నూరు యేండ్ల తరుల వేర్లను పెకిలించి
తారు రోడ్లు వేయ తపన యేల
నీడనిచ్చు తరుల నేలగూ ల్చుటమాని
మొక్కనాటవోయి ఒక్కటైన
14.
మొక్క నాటకుండ మొగులు కేసినుజూసి
వాన కొరకు కుంద ఫలితమేమి
మొక్కలేక భువికి చుక్కలే లకురియు
మొక్కనాటవోయి ఒక్కటైన
15.
ఆవరించియున్న అడవులన్నింటిని
ఉర్వి జూసి నంత గర్వ పడును
అడవులున్నచోట అన్నము కొరతేమి
మొక్కనాటవోయి ఒక్కటైన
16.
తాను మనుటె గాదు తనదుకొ మ్మలనీడ
పసుర జాతి కంత వసతి గూర్చు
మలయ మారు తముల మనుజుల కొసగేటి
మొక్కనాటవోయి ఒక్కటైన
17.
పక్షి జాతు లెల్ల బాహువు లగ్రహించి
ఊయ లూపు మిగుల హాయి గొలుపు
అహర హమ్ము తాను పరులకై బ్రతికేటి
మొక్కనాటవోయి ఒక్కటైన
18.
తనువు నణువ ణువున త్యాగధ ర్మమునిండి
ఫలప త్రకుసు మాలు  పంచి పెడుతు
పరుల సేవ లోన పరవశిం చునదైన
మొక్కనాటవోయి ఒక్కటైన
19.
పరిఢ విల్లు తరులు ఫలపుష్ప ములతోడ
గర్వ మించు కనక ఘనత నొందు
పరుల సుఖము కొరకు పరితపిం చెడునట్టి
మొక్కనాటవోయి ఒక్కటైన
20.
అంకురిం చినదాది అంబర మ్మెగబాకి
నిత్యచై త్యముతోడ నియతి గూర్చు
సాళ్లుగా తానిల్చి స్వాగతిం చుటెగాదు
బాటసా రులకంత వసతి గూర్చు
అలసినట్టి తనుతాప పరివాప్తి నొందేల
మలయమా రుతములు మరులు గొల్పు
పక్షుల కునెలవై పరిఢవి ల్లెడుతర్వు
కూనిరా గాలతో ఊయలూపు
ఆ.వె.
కన్నత ల్లివలెను కడుపునిం పుటెగాక
కామితార్థమొసగు కల్పతరువు
జగతి కంత ప్రగతినొ సగునట్టి
మొక్కనాటవోయి ఒక్కటైన

21.
పుడమిత నువునుండి పుట్లుపు ట్లుగమొల్చి
ఆకుప చ్చనివస్త్ర మవని గప్పు
అహరహ మ్మువెరిగి అలరారు టయెగాదు
పసుపక్షా దులకును వసతినొసగు
మనుజజా తికంతయు మధురఫ లమొసంగి
మలయమా రుతమున నలత దీర్చు
అంబర మునసాగు యభ్రమ్ము లనుబిల్చి
నీటత డుపునిల నేల నంత
ఆ.వె.
మంచిగాలితోడ మమతగూ ర్చుటెగాదు
కూడు గూడు నొసగు కూర్మి తోడ
వసుధనం తనుతాను వర్ధిల్ల జేసేటి
మొక్కనాటవోయి ఒక్కటైన1.సీసపద్యం:
పుడమి తనువుచీల్చి పుట్లుపుట్లుగ మొల్చి
ఆకుపచ్చనివస్త్ర మవని కొసగు

అహరహమ్ము వెరిగి యలరారి వనములై
పశుపక్ష్య ములకంత వసతి గూర్చు

మనుజలో కముకంత మలయమారుతమిచ్చి
కమనీయ ఫలముల కడుపు నింపు

అంబరమ్మునసాగు యభ్రమ్ము లనుబిల్చి
అవనిదాహము దీర్చ నంబువొసగు

ప్రాణవాయు వొసగి ఆయుర్దాయముబెంచి
కూడు గూడు నొసగు కూర్మి తోడ
అఖిల ప్రాణి కోటి కాధార భూతమౌ
మొక్క నాటవోయి ఒక్కటైన

2.సీసపద్యం:

సాళ్లుసాళ్లుగనిల్చి స్వాగతమ్ములు బల్కి
ఛాయనిచ్చి మిగుల హాయి గొల్పు

అలసి వచ్చినవారి బడలికన్ దీర్చేల
మలయమారుతమిచ్చి మరులు గొల్పు

ఆకొని దరిజేరు యతిథిసంతుష్టికై
మధురఫలములిచ్చి మమతబంచు

సకల రోగములకు  స్వాంతన మ్మొసగేల
ఔషధ మ్ములనిచ్చి స్వస్త తొసగు

కన్నతల్లి వలెను కడుపు నింపుడెగాక
కామితార్థమొసగు కల్పతరువు
మనిషి మనుగడూంచు మహిత శక్తి తరువు
మొక్కనాటవోయి ఒక్కటైన!

పంజరాలలోన పక్షులబంధించి
విర్రవీగెవేల వెర్రివాడ
పంటలేలబండు పక్షులు లేకున్న
మొక్కనాటవోయి ఒక్కటైన - 24

వన్యప్రాణులన్ని వరమెమానవులకు
వాని దిరగ నీవు వనములందు
వన్యమృగ వధించ వనమేల వెలుగొందు
మొక్కనాటవోయి ఒక్కటైన- 25

వనముబెంచ పుఢమి పందిళ్లయిమనకు
నీడనిచ్చుమరియు నీళ్లనొసగు
వనముతుంచ పుఢమి వరపులే మిగులును
మొక్కనాటవోయి ఒక్కటైన - 26

నాడు మనకు నిలువ నీడనిచ్చినచెట్టు
గూడు నిచ్చి మనిషి గోడుబాపి
చావుబతుకులోన దాపునిల్చినయట్టి
బ్రతుకులోబ తుకయి బాసటయ్యిన
మొక్కనాటవోయి ఒక్కటైన -27

మణి పూసలు

మంచితనం పెంచుదాం
మాలిన్యం తుంచుదాం
మనుషులుగా మసలుకుంటు
మానవతను పంచుదాం - 28

Tuesday, April 17, 2018

పచ్చిమట్ల ముచ్చట్లు


ఆ:తెలుగు వాడినెపుడు తేలిగ్గ జూడకు
పొరుగు వానికెపుడు పాలిపోడు
తాను ఘనుడె జూడు తనదైన తెన్నున
పచ్చిమట్ల మాట పసిది మూట

ఆ: కాన వెదురు జూద కర్రలాగుండును
వేణు గన మదియె వెలువరించు
పరమ వెర్రి వాడు పండితుడగునురా
పచ్చిమట్ల మాట పసిడి మూట

ఆ:సంస్కృతాంధ్రములను సక్కగానెరుగుచూ
జోడు గుర్రపు స్వారి జోరు గలిగి
సాటి లేని మేటి సాహితీ మూర్తిగా
భేషగు గురుమూర్తి బేతవోలు

ఆ: విద్య వలన గల్గు విజ్ఞానమధికంబు
దాని సాటిరదు ధనము యెపుడు
వెలుగు రేయిరాజు వెన్నెల నిడుగా
పచ్చిమట్ల మాట పసిడి మూట

ఆ: దాచి యుంచ బెరుగు ధనము రాసులుగా
పంచు చుండ బెరుగు ప్రతిభ ధనము
తోడు చుండ సెలిమ తిరిగి నిండునురా
పచ్చిమట్ల మట పసిడి మూట

ఆ: ఆడువారి మనసు అద్దమ్ము నిలలోన
విరిచి అతుక బూన వెర్రి తనము
తెలిసి మసలు వాడె తెలివి పరుండురా
పచ్చిమట్ల మాట పసిడి మూట

మనిషి గుణము చేత మాహోన్న తుండగు
కలిమి బలిమి చేత నగుట కల్ల
ఎనుము బలిసి నంత ఏనుగె ట్లవునురా
పచ్చిమట్ల మాట పసిడి మూట

మనసు లేక పుడమి మనిషి బ్రతుకదేల
సహన శీలి గాక సాధ్వి యేల
శ్వాస లేని తనువు సాధించి నదియేమి
పచ్చిమట్లమాట పసిడిమూట

తరిగి పోవు వయసు కరుగుకా లమ్మిల
సమసిపోవు సకల సంప దలవి
మనల వెంట నంటు మంచి కర్మలెగాక
పచ్చిమట్ల మాట పసిడి మూట

ఊర చెరువు జూడ నున్నకా డనెయుండు
చేరు గమ్య ములను బారు వాగు
చేతనత్వమున్న చేకూరు ఫలితముల్
పచ్చిమట్లమాట పసిడిమూట


కాయ ముపయి దెబ్బ కాలమ్ము తోమాయు
మదిని గ్రుచ్చు మాట మాసి పోదు
వాటు కన్న మిగుల మాటలే బాధించు
పచ్చిమట్ల మాట పసిడిమూట

మనిషి గుణము చేత మాహోన్న తుండగు
కలిమి బలిమి చేత నగుట కల్ల
ఎనుము బలిసి నంత ఏనుగె ట్లవునురా
పచ్చిమట్ల మాట పసిడి మూట

అహమె నరుని సాంత మంత మొందించును
చెట్టు మొదలు జెరచు చెదలు తీరు
అహము వీడి వినయ మలవర్చు కొనమేలు
పచ్చిమట్లమాట పసిడిమూట

కాగ డాల తోటి కాంతిబొం దగవచ్చు
కాగ డాల సృష్టి గాల్చ వచ్చు
మంచి తలపు లోనె మనుగడుం దనెరుంగు
పచ్చిమట్లమాట పసిడిమూట

తల్లిదండ్రి తోటి తగవు లాడవలదు
పాద సేవ జేసి ప్రణతు లొసగు
తల్లిదండ్రి మనకు దైవసమానులు
పచ్చిమట్లమాట పసిడిమూట

దాన గుణము చేత దరిజేరు జనులెల్ల
చేర దీయ కున్న దూర మగును
చెట్టు నీడ జేరి(పసులు) సేదదీ రినయట్లు
పచ్చిమట్లమాట పసిడి మూట

అశ వలన మనిషి ఆయాస పడుగాకభ
తృప్తి నొంద లేడు తృష్ణ వలన
స్వర్గ సుఖము నొందు సంతృప్తి గల్గినన్
పచ్చిమట్లమాట పసిడిమూట

మంచి వారి చెలిమి మర్యాద బెంచును
చెడ్డ వారి చెలిమి చేటు తెచ్చు
చెలిమి వలన గలుగు ఫలములీ లాగుండు
పచ్చిమట్లమాట పసిడిమూట

అల్పు నిపను లన్ని ఆడంబ రంగుండు
గొప్పవారి పనులు గుప్త ఫలము
మహిని సత్పురుషులు మహిమల ట్లుండురా
పచ్చిమట్లమాట పసిడిమూటకోప మునను జనులు గోల్పోవు సాంతమ్ము
సర్వ సిద్ది గలుగు శాంతి తోడ
మానవాలి కంత మకుటమే సహనమ్ము
పచ్చిమట్లమాట పసిడిమూట


నవ్వు విరియు మోము నరులుమె చ్చుటెగాదు
నవ్వు మోము మెచ్చు నార యణుడు
చిరునగవులె మోము చిరకాల పందమ్ము
పచ్చిమట్లమాట పసిడిమూట

జ్ఞాన మెంత యున్న గానియీ జనులకు
ముక్తి కలుగ బోదు భక్తి లేక
ముక్తి నొందు గోర భక్తియే మార్గమ్ము
పచ్చిమట్లమాట పసిడిమూట

దప్పి గొనిన వేళ దాహార్తినిన్ దీర్చి
ప్రేమ తోడ ముష్టి వెట్టువారు
దాత లైనిలుతురు ధరణిలో వెయ్యేండ్లు
పచ్చిమట్లమాట పసిడిమూట


తల్లి దండ్రి మనకు దైవమ నియెరుగు
పాద సేవ జేసి ప్రాప్తి బొందు
అమ్మ నాన్న మించు ఆత్మీయు లింకేరి
పచ్చిమట్లమాట పసిడిమూట


దప్పి గొనిన వేళ దవ్వట మదియేల
ఆక లైన వేళ వంటలేల
ముందు చూపు గలుగ మోదమొం దగలము
పచ్చిమట్లమాట పసిడిమూట

వెలుగులున్న మనల వేవుర నసరించు
చీక టింట నుండ చేర రారు
ధనము జూసి బంధు జనమునీ దరిజేరు
పచ్చిమట్లమాట పసిడిమూట

కొలది మాట లాడ కోరివి నియెదరు
అతిగ వాగు వార పరిహ రింత్రు
మితపుభాషనమున మెప్పుపొం దగలరు
పచ్చిమట్లమాట పసిడిమూట

గెలపు కొరకు తపన గెలువగలననెడు
సంప్ర సాద నిత్య సాధ నమను
కారణాలు మూడు కార్యసా ధనముకు
పచ్చిమట్లమాట పసిడిమూట

తరువు బెరుగు నిలలొ తనకు తానులతలు
తరుల సిగలు బాకి తళుకు లీను
ఆత్మ శక్తి నెదుగ కానరా దుఅహము
పచ్చిమట్లమాట పసిడిమూట


అనువుగానిచోట అణిగియుండవలెను
అదును జూసి పావు కదుపవలెను
శక్తికన్నమిగుల యుక్తి ప్రధానంబు
పచ్చిమట్లమాట పసిడిమూట

పండుటాకురాల పల్లవ మ్ములునవ్వు
పండు ముసలి జూచి పాప నవ్వు
ఎడ్ల వెంటె బండి నడుచున నియెరుగు
పచ్చిమట్లమాట పసిడిమూట

అప్పు లధిక మైన ఆనంద నాశము
అప్పు గౌర వమ్ము లార గించు
అప్పులేని వార లదృష్ట వంతులు
పచ్చిమట్లమాట పసిడిమూట


పసిడినెంత కాల్చి వంకర్లు తిప్పినా
దాని విలువ యెపుడు తగ్గబోదు
మానవత్వమున్న మనిషివి లువలాగ
పచ్చిమట్లమాట పసిడిమూట

మాట విలువ బెంచు మమకార మున్ బంచు
మంచి గతులు వడయు మాట వలన
మాట తీరు కొలది మర్యాద ప్రాప్తించు
పచ్చిమట్లమాట పసిడిమూట


నిరత కష్ట కడలి నీదుచుం డెడువాడు
దినది నమ్ము మిగుల తేజ మొందు
వహ్ని గాల్చు పసిడి వన్నెలొ లికినట్లు
పచ్చిమట్లమాట పసిడిమూట

దరువులేని పాట చెరువులేనిదియూరు
అరుగులేని కొంప నలవి గాదు
గురువు లేని విద్య గుర్తింపు నొందునా
పచ్చిమట్లమాట పసిడిమూట

అంధు లైన యట్టి అజ్ఞానులంతకు
అంజ నమును బూసి కనులు తెరిచి
భావి జీవ నంపు పథముదీ ర్చుగురువు
పచ్చిమట్లమాట పసిడిమూట

అప్పు మనుష జాతి ముప్పుజే యుటెగాదు
అప్పు మనల గాల్చు నిప్పు వలెను
మగడు తాను అప్పు మగవార లకునెల్ల
పచ్చిమట్లమాట పసిడిమూట

చీమ చిన్నదైన చిట్టిచే తులతోడ
భువనమెత్తజూసె బుద్ది తోడ
చిట్టి చీమ కున్న చేవమనిషికేది?
పచ్చిమట్లమాట పసిడిమూట

భార మెంచి తాను భయపడ కనిలిచి
గంగను తలదాల్చి అవని కంపె
భర్గు మించి నజన బాంధవు లుగలరే
పచ్చిమట్లమాట పసిడిమూట

పొట్ట కూటి కొరకు పొర్లాడు బతుకులో
మాన వతను తాను మరచి నాడు
మనసు లేని వాడు మనుజుడె ట్లౌనురా 
పచ్చిమట్లమాట పసిడిమూట

తరిగి పోవు వయసు కరుగుకా లమ్మిల
సమసిపోవు సకల సంప దలవి
మనల వెంట నంటు మంచి కర్మలెగాక
పచ్చిమట్ల మాట పసిడి మూట

నీరు తగల గానె నిద్రలున్న విత్తులు
చలన శీలి యగుచు అంకురించు
జ్ఞాన మెందు టాది యజ్ఞాన ముదొలంగు


పచ్చిమట్లమాట పసిడిమూట

సిరులు లేని వారి నీసడిం చుజనులు
సిరులు కూడ బెట్టి నీర్ష్య చెందు
ఏమి జేసి నప్రజ లేడ్పుమా నరుగదా
పచ్చిమట్ల మాట పసిడి మూట

అవని పైవెలసిన అన్ని జీవమ్ములు
ఆయు క్రమము కొలది అంతరించు
కవి రవులిరువురిల కలకాల ముందురు
పచ్చిమట్లమాట పసిడి మూట

మనిషి యెదుట నొకటి మనిషివె న్కనొకటి
మనసులోన నొకటి మాట యొకటి
మూర్ఖ మతికి నిట్లు మూతులు రెండుండు
పచ్చిమట్లమాట పసిడిమూట

అంత మెపుడు లేదు మనిషికో రికలకు
తీర్చు కొలది వచ్చు తిరము గాను
నిత్య నూత నముగ నియతిభా నునితీరు
పచ్చిమట్లమాట పసిడిమూట

పొట్ట కూటి కొరకు పొర్లాడు బతుకులో
మాన వతను తాను మరచి నాడు
మనసు లేని వాడు మనుజుడె ట్లౌనురా 
పచ్చిమట్లమాట పసిడిమూట

అగ్ని నార్పు టకును సలిలంబు గాకుండ
యుత్త మంబు  నైన దుర్వి గలదె
కోప మార్పు టకును ఓర్పుమిం చినదేమి
పచ్చిమట్లమాట పసిడిమూట


          - రాజశేఖర్

Sunday, April 15, 2018

కొలదిగ తావిడు విరులను
వెలదులు ధరియిం పగోరు వేడుక తోడన్
అలరా రుతుతా వొసగని
పూలను ధరియింపగోరుపొలతులు గలరే ?

సమస్య- పూలను ధరియింప గోరు పొలతులు గలరే

కొలదిగ తావిడు పూలను
వెలదులు ధరియిం పగోరు వేడుక తోడన్
అలరా రెడుకా గితంపు
పూలను ధరియింపగోరుపొలతులు గలరే ?

Tuesday, April 10, 2018

సమస్య- అడక్కు తినకున్న వాడు యథముండాయెన్

క.
 కడులచ్చి గలిగి నైనను
కుడువక గట్టక వలువల ముడుపుల్ గట్టీ
పిడికెడు దానం జేయక
యడక్కు తినకున్న వాడు యథముండాయెన్

Sunday, April 8, 2018

మాపెళ్లిరోజు

మూడుముళ్లు
ఏడడుగుల బంధంతో ఏకమై
తనువున తనువై
మనమున మనమై మెలుగుతూ
సహధర్మచారత్వ భాగస్వామియై
వంశవృక్ష నవపల్లవోద్భవధాత్రియై
అనుబంధాల కాలవాలమై
ఆత్మీయానురాగాల నెలవై
పుట్టినిల్లు మెట్టినిల్లుల నడుమ
ఆసువోస్తూ అల్లిన
అనుబంధపు వారధై
పెనవేసుకున్న ఆత్మీయబంధాల
లతలపొదరింటి పాదు తానై
దినదిన ప్రవర్దమాన
అష్టైశ్వర్యాలకు నెలవై
నాతో కలిసి నడుస్తూన్న
లావణ్య శేఖర శోభిత
నా జీవితభాగస్వాయైన శుభదినం !
మా ఇంటిల్లిపాదికి పర్వదినం !!

(09 ఏప్రిల్ 2010 మేమిరువురమేకమైనరోజు)Thursday, April 5, 2018

అందాల భామకు అశృనివాళి


అందానికి నిర్వచనం 
అభిమానానికి ఆలవాలం 
చిరు నగవు చిరునామా 
నిత్య యవ్వన నింగి భామా 
అందానికి ఆహార్యం జోడించి 
లాఘవ లావణ్య లాలిత్యం తోడ 
బాల నటి మొదలు బాలీవుడ్ వరకు 
అభిమాన కోటి మనస్సుల్లో 
చెరగని  ముద్ర వేసిన  వెన్నెల భామ 
సుందర సుమధుర భావాలను మేళవించి
నటనకే నడకలు నేర్పి
చిత్రసీమలో చిరస్థాయిగా నిలిచి 
భువి నుంచి దివి కేగిన  చిరయశస్వి శ్రీ దేవి!

అప్సర కంటకు అశ్రునయనాలతో భూలోకపు నిమంత్రణం !
ఇంద్రపురి దేవాంగన లోకం నీకు పలికింది ఆమంత్రణం  !!

సుతులు - గతులు

సుతులు గల్గు వారు  గతులు వడిసెదరు 
సుతులు లేని యెడల గతులు లేవు 
సుతులు గతుల నునవి  సృష్టించి నదెవరో 
పచ్చిమట్ల మాట పసిడి మూట 

Tuesday, April 3, 2018

తెగిన మోకు

వేకువనే లేస్తవు వేదపండితునోలె
స్నానజపము లేక సాగిపోతవు
పొద్దువొడిసేటాల్లకు పొలిమేరలు దాటి
తాటివనంలోన తచ్చాడతవు
బతుకుదెరువుకోసం వ్యథలువడతవు
సాహసమే ఊపిరిగా సాగుతుంటవు గౌడన్నా !

మోకు బుజానేసి ముత్తాదు గట్టుకొని
వీరునోలె ముందుకేగి విజృంభించి
ఎత్తైన తాటిచెట్టు ఎగాదిగా జూసి
మొద్దుకు బంధమేసి మొగులుకెగబాకి
పచ్చనాకులంట పాకి పరవశిస్తవు గౌడన్నా!

 తనువు అణువణువు ఆత్మవిశ్వాసంతో
మోకుమీద నమ్మకంతో మొండిగ చెట్లెక్కి
సుతారంగ గొలనుగీసి సురపానము సృష్టించి
శ్రమజీవుల బడలికబాపు ధన్వంతరి నీవు గౌడన్నా !

వృత్తి నిడిసి మనలేవు వృద్దాప్యం నొందలేవు
పొద్దంత పనిజేసిన పొట్టకూటికి కరువు
నిరంతర పోరాటం ఆగదు నీ ఆరాటం
దినదిన గండం నీ బతుకు చిత్రం

అల్లిన మోకు  సంకలుంటే  ఆకాశంలో నీవు!
మోకు జారిన మరుక్షణం పుడమి పొత్తిళ్లలో నీవే ! !
తలపాగతో తాడుశిఖల ఉదయించే సూర్యుడవు !
తాడుతెగిన తదనంతరం అస్తమించే భాస్కరుడవు !!

Monday, April 2, 2018

చెరవీడిన బాల్యం !

పసిప్రాయపు పసిడి బాల్యానికి
ఊచల్లేని చెరసాల పాఠశాల
బడికి సెలవులంటే
యావత్ జీవశిక్షనుంచి
విడుదలయిన ఖైదీల్లా
పంజరం చెరవీడిన
సీతాకోక చిలుకల్లా
బోసినవ్వుల పసిహృదయాలు
రెక్కలు విదిల్చి ఎగిరి గంతేస్తాయి.
గతస్మృతులను నెమరువేసుకుంటూ
పల్లెకు పయనమవుతాయి !
తాతయ్య నాయనమ్మల తలపులతో
నెయ్యపు దారుల వెంట స్వేచ్ఛా విహంగాలై
పల్లెఒడిని చేరి సేదతీరుతాయి !
నవ పల్లవాగమం తో పండుటాకులు పరవశిస్తాయి
కల్మషమెరుగని నేస్తాలను కని హాయిగా నవ్వుకుంటాయి
మైమరచి ఆడుతుంటాయి పాడుతుంటాయి

భూతమే భావికి పునాదిగా
పసితనపు బాల్యానికి
ముదిమి ముసిరిన బాల్యపు
అనుభవాల నపురూపంగ అందిస్తూ
భవితను భద్రపరిచే ఊసులు  నీతులు
సంస్కృతి సంప్రదాయాలను
చందమామ కథలుగా చెవినేస్తూ
పండుటాకులు పల్లవములతోడ
ఊహల్లో విహరిస్తూ
ఆనందపు అంచుల్ని తాకుతూ
ఆడి పాడి ఆదమరిచి నిద్రిస్తాయి !

ఆకుపచ్చని ఆహ్లాదాన్ని  అందరికందించేలా
పచ్చని పొదరిల్లని ప్రకృతికందించిన తల్లివేరు
పరోపకారంతో తానెదుగుతుంటే
తన్మయత్వంతో మురిసిపోతుంది !

వలసపక్షుల పునరాగమంతో
పులకించిన పల్లె ఒడి
ఆనందాల లోగిలి
అనుబంధ లతలతో
ఆప్యాయతలు పెనవేసుకున్న  పందిరి !Sunday, April 1, 2018

చెలిమి చిరునామ చందు

 (ఆత్మీయ మిత్రుడు     మటేటి చంద్రశేఖర్ కు హార్థిక శుభాకాంక్షలతో)

స్నేహానికి నెలవై
ఆత్మీయత కాలవాలమై
అందరికాదర్శప్రయమై
మిత్రకోటికి ఆప్తుడవై
అందరి ఆదరాభిమానాలతో
అహర్నిశలు శ్రమిస్తూ
అంచలంచలుగా యెదిగి
స్నేహ పరిమళాలు
సర్వత్ర వ్యాపింపజేస్తు
అశేష నెచ్చెలుల కాదరువై
నిత్యం చిరునగవులలరించిన
ప్రసన్నతామూర్తి
చెలిమికి చిరునామయై
మెలిగే చిన్ననాటి నేస్తానికి
 హృదయపూర్వక శుభాకాంక్షలతో ........

                   కవిశేఖర

ఇల్లాలు

సంసారపు బాధలనీదలేక
సతమతమౌతున్న పెనిమిటిజూచి
నిండ నీటితో భారంగా
కదులుతున్న మేఘమై తిరగాడుతూ
నిత్యం మోముపై చిరునవ్వుల నంటించుకొని
ధైర్యం సాకారమైనట్టు కనవడుతూ
గాలి ఆప్యాయతకు కరిగి
భారం దించుకున్నట్లు
చాటుగా కన్నీరు కార్చి బాధను దించుకొని
మేకపోతు గాంభీర్యంతో
భర్తకు వెన్నుదన్నై నిలుస్తుంది భార్య!

నెలవంకలను నేర్పుతో అద్దిన
ఆరు గజాల అతుకుల చీరతో
తనువు మసక బారుతున్న
చిరుదరహాసము చితికి పోనీకుండ
వెన్నెలయి వెలుగుతుంది వెలది !

అంతఃపుర మంత ఖాళీయై
వంటింట్లో ఒంటరిగానున్న వేళ
తనో కన్నీటి చెలిమైతది
తన హృదయంసుడులు దిరిగే సంద్రమైతది
అయినా
భర్తకు బాసటగ నిల్చి భరోసానిచ్చి
సంసారనావకు తెరచాపై
దూరపు తీరాలు దరిజేర్చు
దారి జూపుతుంది దయిత !

మనసంత సమస్యల
నిలయమై కలవరపెడుతున్నా
ఆత్మాభిమానం అణువంతైన చేజారనీక
ఆత్మస్థైర్యాన్ని కూడగట్టుకొని
ఇంటిగుట్టు బయటపడకుండ
గుట్టుగా సంసారం సాగించే
     సహనమూర్తి ఇల్లాలు !