Monday, April 2, 2018

చెరవీడిన బాల్యం !

పసిప్రాయపు పసిడి బాల్యానికి
ఊచల్లేని చెరసాల పాఠశాల
బడికి సెలవులంటే
యావత్ జీవశిక్షనుంచి
విడుదలయిన ఖైదీల్లా
పంజరం చెరవీడిన
సీతాకోక చిలుకల్లా
బోసినవ్వుల పసిహృదయాలు
రెక్కలు విదిల్చి ఎగిరి గంతేస్తాయి.
గతస్మృతులను నెమరువేసుకుంటూ
పల్లెకు పయనమవుతాయి !
తాతయ్య నాయనమ్మల తలపులతో
నెయ్యపు దారుల వెంట స్వేచ్ఛా విహంగాలై
పల్లెఒడిని చేరి సేదతీరుతాయి !
నవ పల్లవాగమం తో పండుటాకులు పరవశిస్తాయి
కల్మషమెరుగని నేస్తాలను కని హాయిగా నవ్వుకుంటాయి
మైమరచి ఆడుతుంటాయి పాడుతుంటాయి

భూతమే భావికి పునాదిగా
పసితనపు బాల్యానికి
ముదిమి ముసిరిన బాల్యపు
అనుభవాల నపురూపంగ అందిస్తూ
భవితను భద్రపరిచే ఊసులు  నీతులు
సంస్కృతి సంప్రదాయాలను
చందమామ కథలుగా చెవినేస్తూ
పండుటాకులు పల్లవములతోడ
ఊహల్లో విహరిస్తూ
ఆనందపు అంచుల్ని తాకుతూ
ఆడి పాడి ఆదమరిచి నిద్రిస్తాయి !

ఆకుపచ్చని ఆహ్లాదాన్ని  అందరికందించేలా
పచ్చని పొదరిల్లని ప్రకృతికందించిన తల్లివేరు
పరోపకారంతో తానెదుగుతుంటే
తన్మయత్వంతో మురిసిపోతుంది !

వలసపక్షుల పునరాగమంతో
పులకించిన పల్లె ఒడి
ఆనందాల లోగిలి
అనుబంధ లతలతో
ఆప్యాయతలు పెనవేసుకున్న  పందిరి !



No comments: