Sunday, April 1, 2018

ఇల్లాలు

సంసారపు బాధలనీదలేక
సతమతమౌతున్న పెనిమిటిజూచి
నిండ నీటితో భారంగా
కదులుతున్న మేఘమై తిరగాడుతూ
నిత్యం మోముపై చిరునవ్వుల నంటించుకొని
ధైర్యం సాకారమైనట్టు కనవడుతూ
గాలి ఆప్యాయతకు కరిగి
భారం దించుకున్నట్లు
చాటుగా కన్నీరు కార్చి బాధను దించుకొని
మేకపోతు గాంభీర్యంతో
భర్తకు వెన్నుదన్నై నిలుస్తుంది భార్య!

నెలవంకలను నేర్పుతో అద్దిన
ఆరు గజాల అతుకుల చీరతో
తనువు మసక బారుతున్న
చిరుదరహాసము చితికి పోనీకుండ
వెన్నెలయి వెలుగుతుంది వెలది !

అంతఃపుర మంత ఖాళీయై
వంటింట్లో ఒంటరిగానున్న వేళ
తనో కన్నీటి చెలిమైతది
తన హృదయంసుడులు దిరిగే సంద్రమైతది
అయినా
భర్తకు బాసటగ నిల్చి భరోసానిచ్చి
సంసారనావకు తెరచాపై
దూరపు తీరాలు దరిజేర్చు
దారి జూపుతుంది దయిత !

మనసంత సమస్యల
నిలయమై కలవరపెడుతున్నా
ఆత్మాభిమానం అణువంతైన చేజారనీక
ఆత్మస్థైర్యాన్ని కూడగట్టుకొని
ఇంటిగుట్టు బయటపడకుండ
గుట్టుగా సంసారం సాగించే
     సహనమూర్తి ఇల్లాలు !







No comments: