Thursday, January 31, 2019

పాతివ్రత్యం

సంసారపు బాధల నీదలేక
సతమతమవుతున్న భర్తను జూసి
దిగులు పడుతు దినం గడువక
బాధనంత దిగమింగి
హదయాంతరాలలో పదిల పరిచి
మేకపోతు గాంభీర్యంతో
వెన్నుదన్నుగ నిలుస్తుంది గృహిణి !

అంతః పురమంతా ఖాళియై
వంటశాలలో ఒంటరిగ నున్న వేళ
తాను కన్నీటి చెలిమైతది
తన హదయం
సుడులు దిరిగే సంద్రమైతది
దుఃఖపు ముత్తెపు సరులను
కొంగున ముడేసుకొని
వర్షించిన మేఘమై
యెదతాపము చల్లార్చుకుంటుంది

అత్తెసరు పైకంతో
అవసరాలు తీరక
కుంటుతున్న కుటుంబానికి
మూడోకాలయి
భర్తకు బాసటగ నిల్చి
భరోసా నిచ్చి
సంసార నావకు తెరచాపయి
దూరాల తీరాలను
దరిజేర్చు దారి జూపుతుంది!

వేణుగానామృతం

వేణుమాధవమోవి వేణుగానమువిని
వనమయూరమ్ములు వలచి యాడె
మురళిలోలుడుజేయు మురళీరవమువిని
కోయిలల్ మారుగా కూత వెట్టె
పిల్లనగ్రోవితో నల్లనయ్యనుజూసి
రాయంచ నర్తించె రమ్యమలర
వంశనాళముబూని వాయించు రాగాల
గోపినాథునిగూడె గోప జనులు

వేణుగానపుటలలలో మేను మరచి
తన్మయత్వము తోడయ త్తన్వి మురిసె
నింగిలోనుండి కన్నయ్య తొంగి చూడ
శిరము దాచెను గోపికా సిగ్గు లొలుక

Monday, January 28, 2019

చిత్రగీతం : కడవెత్తిన పడతి

సీసం:
కడవనె త్తినబెట్టి కదిలివ చ్చినటుల
గనిపించె నొకయింతి కనుల ముందు
భుజముపై ఘటమును బొందిక గాయెత్తి
నడిచివె ళ్తున్నట్టి నారి యొకతి
ఒడుపుతో నొకకుండ నడుముపై మోయుచు
కైపుచూ పులతోడి కాంత యొకతి
కడవయొ క్కటెగాని గనిపించు మూడుగా
ముదితలం దరిచెంత యొప్పు నటుల

సరసి జవిలసి తమ్మగు సరసు తీరు
చెరువు చెంతకు జేరిన చెలువ లలరె
కడుర మణియంపు దృశ్యమై గాని పించి
మైమ రిచిమురి సేట్టుల మాయ జేసె

సాద్వి (పద్యాలు )

కౌమార దశలోన కౌతుక ములుదీర్చ
అప్సర సేయౌను ఆలి తాను
మధ్యవ యసులోని మంతన ములలోన
మంత్రియై తగినట్టి మాట జెప్పు
ముదిమిజొ చ్చినవేళ మూడొకా ళుగమారి
పతులగ మ్యమునకు పదము లౌను
అవసాన దశయందు అతిథిసే వలుజేసి
ఆలంభ నగనిల్చి యాస రౌను
వేలు బట్టిన దాదిగా వెంట నడిచి
కష్ట సుఖముల నన్నింట కలిసి మెదిలి
పేగుబం ధముతోడ పెనిమిటి ప్రేమ బంచి
అమ్మ లకుమారు సేవలో యాలి యగును

Thursday, January 24, 2019

మధుపానం



అన్నాది కాలాన ఆదిదే వులకంత
సురపాన మైనిల్చి సుధను గొల్పె

ప్రభువులున్ బ్రజలంత ప్రమధులై తిరుగాడ
ద్రాక్షాస వమ్మయి దార వారె

కాలగ మనమందు గౌడన్న చేతిలో
తాటిక ల్లుగరూపు దాల్చె నదియె

ఆధునీ కములోన బ్రాందివి స్కీపేర
నానావి ధమ్ముల నవత రించె

కల్లు దాగు నోళ్లు లొల్లిజే యుటెగాదు
చిక్కు లవిడ దీసి చక్క జేయు
మద్య మేది యైన మత్తెక్కు టేగాదు
దిగులు బాపి మనసు ధీమ నింపు

Wednesday, January 23, 2019

శీర్షిక. సంక్రాంతి శోభ



కారుమబ్బులు దూదిపింజలై
కళ్లాపి జల్లినట్టు
తెలుగు వాకిళ్లన్ని తలకోసుకున్నయి..

నింగి లోని చుక్కలన్ని
సుతారంంగ మునివేళ్లతో తెంపి
ముద్దుగుమ్మలు నేలకద్దినట్లు

ఆకసపుటాలంభనగ వేలాడే
ఇంద్రధనుసు నిలకుచేర్చి
వాకిల్లపరిచిన ముగ్గుల తివాచీకి
రంగులు పులిమినట్టు
రాగరంంజితమొనర్చే రంంగవల్లు

సప్తాశ్వ రథారూఢుడై
రయమున భూలోకావలోకముకై
కెంజాయ చూపులతో
యేగుదెంచెడు శుభకరుడి
నులివెచ్చని రాగకిరణాల స్పర్శ
చెలియల చెక్కిల్లను
ఎర్రబరుస్తున్న భాస్కరుడి ధీటుగ
చిమ్మ చీకటిని చీల్చుతూ
నులివెచ్చని ఆఛ్ఛాదనను
పంచుతున్న భోగిమంటలతో

పల్లెతనువుపయి
కొత్త చిగురులు తొడిగి
పల్లెవొడిజేరి
రంగులవిరులై విరిసిన
వలసపక్షులతో
పిల్లాపాపలతో
తెలుగు లోగిళ్లన్ని
మురిసినయి!
పల్లెలన్ని పండుగ
సంబరాలలో మునిగినయి!

గజల్ - చెలివలపు



చెలి నీచూపుల దారంతో నను కట్టేస్తావు
సఖి నీవలపుల సారంతో నను చుట్టేస్తావు

నీలాలను తలపించే నీకనుదోయి దాటి
జాలువారు వెలుగులతో నను చుట్టేస్తావు

నిరంతరం రగిలే సంఘర్షిత సమాజమును
చిరునగవుల చిట్కాలతో నను గెలిచేస్తావు

విరోదంతొ విహరించే వైరుధ్యపు లోకములో
మధురమైన మాటలతో నను దోచేస్తావు

పడతిని మించిన అందం ప్రకృతిలో లేదంటూ
పలుమరు పలువిధముల నను మురిపిస్తావు

చెలి వలపుల తావుల మునకలేల కవిశేఖర
చేయిసాచి చేరదీసి బిగికౌగిలిలో నను చుట్టేస్తావు