Saturday, December 13, 2025

సాధ్యమేనా (గజల్)

 గజల్ 


శిలలన్నీ ప్రతిమలుగా ప్రభవించుట సాధ్యమేన మనుషులంత మహాత్ములై వెలుగొందుట సాధ్యమేన


ఊహలన్ని పెనుగాలికి ఏకమేడ లైకూలెను 

కాలముతో సాగకుండా ఎదురించుట సాధ్యమేన


సాంకేతిక ముసుగులోన సమాజగతి దాగున్నది అభివృద్దిని కాంచకుండ నిదురించుట సాధ్యమేన 


అజ్ఞానపు అగాథాలు అడుగడుగున ప్రతిఘటించ 

ప్రత్యామ్నయ ప్రగతిబాట పయనించుట సాధ్యమేన 


మానవతను మరచిపోయి మనుగడసా గించుటేల 

మమత లేక మనషులుగా జీవించుట సాధ్యమేన


తోలుబొమ్మ లాడించుట సూత్రధారి పనితనమే ఆజ్ఞ మీరి క్షణమయినా మనగలుగుట సాధ్యమేన


అపజయాల చింతనలో కవిరాజుకు కలతెందుకు తెగినగాలి పటమిలలో పైకెగురుట సాధ్యమేన


పచ్చిమట్ల రాజశేఖర్

చెలినవ్వు (గజల్)

 కలతలన్ని చెదిరేలా విరుస్తోంది చెలినవ్వూ

ఆస్వర్గపు తలుపులనే తెరుస్తోంది చెలినవ్వూ


ప్రణయదారి మండుటెండ పదేపదే బాధించిన

అదరారుణ తివాచీని పరుస్తోంది చెలినవ్వూ


సుఖదుఃఖపు తరంగాలు సుడిదిరిగే సంద్రములో

నానావకు తెరచాపై నడుస్తోంది చెలినవ్వూ


ఆశరాల్చు శిశిరంలో తనువుబిరుసు బారువేళ

మనసుచెణికె చిరుజల్లై కురుస్తోంది చెలినవ్వూ


ఎందరున్న ఏకాకివె కవిరాజా నీవిలలో

ఏకాంతపు చీకట్లను చెరుస్తోంది చెలినవ్వూ

Wednesday, December 10, 2025

ప్రత్యేకత (గజల్)

శరత్తులో చంద్రికనై వెలగాలని ఉందినాకు

వసంతాన కోయిలనై పాడాలని ఉంది నాకు


ఇరుకుహృదిలొ ఇముడలేక తొంగితొంగి చూస్తున్నా

వేసవిలో మల్లియనై విరియాలని ఉందినాకు


వెల్లువలో పల్లవమై వెరచివణికి పోతున్నా

వెచ్చనినీ మదిగదిలో ఒదగాలని ఉందినాకు


చెలరేగే అలనీవై ముంచెత్తా లనిజూచిన

నినునాతో దరిజేర్చగ నడవాలని  ఉందినాకు


నీఒడిలో కైవల్యపు సంద్రముంది నిజమేనట

ఆస్వర్గపు తీరాలను చేరాలని ఉంది నాకు


నిత్యమునను నిందించే నరజాతిలొ ఇముడలేను

ఒంటరిగా తుంటరినై ఆడాలని ఉంది నాకు 


నలుగురిలో ఒకరిలాగ నీవెందుకు కవిరాజా

బాతులలో హంసతీరు మెరవాలని ఉంది నాకు