Thursday, December 31, 2020

కొత్తవత్సర సీసం

 సీసం:


తెలగాణ యిలవేల్పు యెములాడ రాజన్న

కరుణాకటాక్షాల కాంతినింప


కొండగట్టుసిగన కొలువైన అంజన్న

బలముజనులకంత కలుగ జేయ


దక్షిణకాశిమా ధర్మపురపువేల్పు

మూడునామమ్ముల మోక్షమీయ


యాదాద్రి కొలువైన యాదగిరీశుడు

కోరివచ్చినవారి కోర్కెదీర్చ


దేవ దేవుళ్లు కలువైన ధీమతోడ

లింగత్రయపు నేల లీల జూప

ముక్కొటిజనము గాచుచు దిక్కునిల్చి

కొత్తవత్సరమున జిమ్మాలె క్రొమ్మెరుగులు


పచ్చిమట్ల రాజశేఖర్

Tuesday, December 29, 2020

కైతికాలు-1

 ఎరుపురంగు కురులల్లో

ఎగబాకెను ఒకసర్పము

మగువకురులు ముడుచుటలో

కనిపించెను కడుదర్పము

వారెవ్వా! వనితలు

ముడుచుటలో సిద్ధహస్తులు - 71

అరిగడ్డిని మోపుగట్ట

పసిడిపాము మెరిస్తుంది

ఏమరుపాటుగ జూడగ

గగుర్పాటు కలిగుతుంది

వారెవ్వా! పడతులు

మెరిసిమురిసె నాకురులు-72


ఎరుపురంగు కురులల్లో

ఎగబాకెను ఒకసర్పము

మగువకురులు ముడుచుటలో

కనిపించెను కడుదర్పము

వారెవ్వా! వనితలు

ముడుచుటలో సిద్ధహస్తులు 73


దున్నదెంత కృతజ్ఞతో

వెన్నుపైన మోస్తున్నది

మేతమేపె పిల్లడిపై

ప్రేమను కురిపిస్తున్నది

సాకుతున్న యజమానిపై

పసులకెంత విశ్వాసమో - 74


పసులవెంట తిరిగితిరిగి

అలిసెనేమో పసివాడు

సెలకలల్ల మేయుచున్న

గేదెపైన వాల్చినాడు

వారెవ్వా! ఏమిరాజసం

విశ్వమంతా గులాంగులాం - 75

ఒంటిపైన గుడ్డలేదు

ఒంటరైన బోసివోడు

ఏరాజ్యం లేకున్నా

మారాజుకు తీసిపోడు

చీకుచింతలేనోడా

పసులగాసె మొనగాడ - 76


ఆడిపాడె వయసులోన

ఆలమంద నెంబడించె

అలసిపోయి నడువలేక

గేదెనెక్కి పవ్వళించె

ఆటగోరు ఆబాలుడు

అసలుసిసలు గోపాలుడు - 77

పడతికురుల ముడినిచూడ

గడ్డిమోపు తలపించును

ఏమరుపాటుగ చూచిన

గగుర్పాటు కలిగించును

అందం పడతుల సొంతం

ముడులకేవి అనర్హం - 78


పుస్తకాల పఠనమ్ము

మస్తకాల విరియించు

బుద్ధిబలము వికసించి

బతుకుదెరువు కలిగించు

పుస్తకాల నేస్తము

వికసించును చిత్తము - 79


అక్షరమణులను పొదిగిన

అందమైన పత్రగుచ్చము

జ్ఞానవీవెనలు వీచే

వాడిపోని పూగుచ్చము

జయజయహో! పుస్తకము

అనంత జ్ఞాన కాసారము - 80

 

ఒంటిమీద గుడ్డలేదు

ఇంటివెనుక సేనలేదు

విప్పారిన ఆకళ్లలొ

ధైర్యానికి కొదువలేదు

వారెవ్వా! బాలకా

భావితరపు ఏలికా


బాలుడు స్తంభము నిలిపెను

స్తంభము బాలుని నిలిపెను

ఒడుపుగ నిలిచిన చిత్రము

అచ్చెరువు మదిన గొలిపెను

చిత్రము జూడ చిత్రము

మదిలొ ఏదో ఆత్రము -


భయముగుప్పిట నక్కిన

బాలుడి ధీనత చూడు 

సుడులుదిరిగె కన్నీళ్లు

వినిపించు వానిగోడు

అయ్యో! ఆధీనవదనం

పేదరికపు నిదర్శనం - 82


అనంతభరతావని మది

 దైవత్వం పులుముకుంది

పూలలోన దారంలా

ఆధ్యాత్మికత దాగుంది

మనోనేత్రం తెరిచిచూడు

దేవుడు నీముందు నిలుచు - 83


 పశువైన దాటించె

పసివాని నవతలికి

ఆపశువు నదిలించె

మేతమేసేతలికి

పరిస్థితుల బట్టి

పైనకిందవుట తథ్యం -84


ఆడిపాడి బాలుడు

అలసిపోయినవేళ

పశువుశిరపు పాన్పు

పవ్వళించె తానిల

జోజో! బాలకా

నిద్రచోటెరుగదు గదా - 85

 ఏటికవత లమ్మనాన్న

ఇవతలేపు చిన్నినాన్న

దరికిజేర తలపించగ

దాటించెను గదాదున్న

బజ్జోర కన్నా

నీకెందుకు బెంగ - 86

 అలుపులేక ఆలమంద

పాలించెను గోపాలుడు

ఆమందల నాపలేక

అలిసిపోయె నీబాలుడు

అరెరే చిన్నోడు చూడు

ఆవెన్నుని బోలిన రేడు - 87


ఆకలికేకలు వేయగ

ఏరవతల గేదెమేసె

అలసటతనువు నిండగ

ఏరుదాట గేదేమోసె

చూడ పశువేయైనను

చూపించె నమ్మతనము - 88


ఆకలేసి ఆపిల్లడు

అమ్మపాల కైవెదికెను

ఉట్టుతున్న చెట్టుజూసి

పాలదారె యనితలచెను

కాడు వీడమాయకుడు

వీడెంతో మాయకుడు - 89


ఉడుతసొంటి బుడుతడుతను

ఈతచెట్టు నెగబాకెను

పాలసొంటి చెట్టునీర

పొట్టనిండ తనుగ్రోలెను

ప్రకృతెంత గొప్పదో

పసియాకలి దీర్చెను -90


వేలెడంత పసిబాలుడు

వేలాడెను చెట్టువట్టి

కారేఅమృ తపుబొట్లను

తాగేసెను బుక్కవట్టి

ఆకలెంత చెడ్డదోగద

అకార్యాలు చేపించును - 91


పేదోనిగల్మల నిలిచి

ఓట్లడిగేటి మాయకులు

గద్దెనెక్కి గరీబోల్ల

గదమాయించె నాయకులు

ఓహో! మన నాయకులు

వికృతాంగ వినాయకులు


ఓహో మననాయకులు

మహామహా మాయకులు - 92

Monday, December 28, 2020

చలికాలపు తొలిపొద్దు

 లోకమంతా చీకటి దుప్పటిలో తలదాచుకొని

వేకువకై వేచిచూస్తుండగా

పక్షుల కువకువ సరాగాల నడుమ

పుఢమిపై పరుచుకున్న

తెలిమంచు ముత్యాలనేరుకుంటున్న

ఉదయభానుడి కరస్పర్శతో

ముకిలించుకున్న కుసుమాలు

ముదముతో విరిసిన తరుణం

చలినెగల్ల రగరగలో మెరిసే

చంద్రబింబాననల చేతివేళ్ల

ఐంద్రజాలిక రంగవల్లులతో

స్వాగతించే ఉదయమే ఊహాతీతం

Thursday, December 24, 2020

గిరిపుత్రులు - కైతికాలు


విపనిలో విహరించు

జీవరాశుల గుంపు

అడవిలో బతికేటి

ఆదివాసుల సొంపు

వారెవ్వా! కానకూనలు

మోసమెరుగని మోటుమనుషులు -66


అడవితల్లి ఒడితిరిగే

ఆటవికులాదివాసులు

అన్నెంపున్నె మెరుగని

అమాయకపు జీవులు

వారెవ్వా! ఆటవికులు

సంస్కృతికి వారసులు-67


ఆకలిదప్పులు తప్ప

ఆస్తిపాస్తులు లేవు

అనురాగమే తప్ప

అలమరలన్నవిలేవు

వారెవ్వా! అడవిబిడ్డలు

మెరిసే మోదుగుపూవులు-68


కాయలుపండ్లు తిని

కాలమెల్ల దీస్తరు

కమ్మని జుంటితేనె

పిండుకోని తెస్తరు

వారెవ్వా! గిరిజనులు

వనానికి జనానికి వారధులు-69


కాయలు పండ్లతోటి

కాలమెల్ల దీస్తరు

జుంటితేనెల రుచులు

జగతికి జూపిస్తరు

వారెవ్వా! గిరిజనులు

కల్తిలేని మనుషులు - 70

Tuesday, December 22, 2020

చురకలు

 

పచ్చనిపంటలు

మొలిపించిన నాగలి

ఊయలూగుతుంది నేడు

మోడుబారిన చెట్టుకు -1


పల్లెతనం 

డొల్లతన మయింది

పట్నపు హంగులు

పులుముకొంది - 2


పక్షులన్నీ

వలస వోయినయి

వట్టివోయిన

చెరువుల నిలువలేక-3


తాజ్ మహల్ 

తలదించుకుంది

గిజిగాడు అల్లిన

ఊయల మేడను జూసి -4


ఎడారి ఆకలికి

ఒయాసిస్సు బియ్యపుగింజ

పేదోడి ఆకలి దీర్చ

ప్రభుత్వ పథకాలు తీరు -5


పుస్తకం అలిగింది

తలుపు దెరువని బడుల జూసి

బడిమొకంజూడని

పిల్లల జూసి -6


మనసు పీకి

గడీయారపు కొయ్యకు 

తగిలించిండు మనిషి

గంటల నడుమ ఊగిసలాటే -7


చేపలు నీటికి

ఎదురీదుతున్నయి

ఆటవిడుపుకు గాదు

ఆకలి వేటకు - 8


బువ్వ

బురదయింది

ప్రకృతి

వికృతచేష్టలతో - 9


కృషీవలుడు

బయటపడకుండు

విత్తనకంపెనీ

వలనుండి- 10


అలసిన 

రైతు కదలలేకుండు

ధరణి 

పొత్తిళ్ల సేదదీరిండేమో -11


నాయకులు

జమచేస్తుండ్రు మనీ

ఓటరుకు

ఎరేయడానికనీ- 12


పెద్దమనిషి

ఏషం మార్చిండు

ఖద్దరేసి

గద్దెనెక్కిండు - 13


మనిషి

పరాధీనుడైండు

పైసల

మోహం వీడలేక -14


మనిషి

పరుగులువెడుతుండు

గడియారపు

ముళ్లుపొడుస్తుంటే -15


రోగం

భోగాన్ని మరిపించింది

మనిషిలోని

మనసు చిగురించింది -16




Friday, December 18, 2020

ఆశల పసలు

 

పుఢమిపై యేరుల తలపించే

మోముపై ముడతలు

ఇంద్రధనుసోలె వంగినయెన్నెముక

విశాలవిశ్వంలో అక్కడక్కడ 

మొలిచినిలిచిన పచ్చనిమొక్కలోలె

ఒంటిపై గుడ్డలు

మూడోకాలుంటే తప్ప 

నడువలేని ముసలితనం

అన్నింటిని మించి 

భావిపై భ్రమలేని పండుటాకు

అయినా

తానేదో చేయాలనుకుంటుంది

భావితరాలకు బతుకునీయాలనుకుంటుంది

తనురాలే ఆకే అయినా

తనఆశలు అంకురించేలా

ఆశయాల విత్తులు నాటాలనుకుంటుంది

నమ్ముకున్న ఎవుసం

అయినవాళ్లందరిని ఉరితీసినా

మట్టిని నమ్మి

పోగేసినవన్నీ పోగొట్టుకున్నా

బందబారిన గుండెతో

మొక్కవోని అశయంతో

చలించని ధృఢసంకల్పంతో

పచ్చని పైరుల పెంచి

సిరులరాశులు పంచేలా

అనుభవపు పుటలు తిరిగేసి

మళ్లీ

పొలం బాటవట్టింది

పాతవిత్తుల పాతరవెడుతుంది

నడుమంచి నాట్లేసి 

ఆకుపచ్చని ఆహార్యమద్ది

ధాన్యరాశుల దగదగలతో

అవనిని అన్నపూర్ణని నిరూపించనుంది


పచ్చిమట్ల రాజశేఖర్ 

గోపులాపూర్ 

జగిత్యాల

9676666353

rajaachimatla@gmail.com

Sunday, December 13, 2020

చిత్ర - కైతికాలు

 ప్రకృతి ప్రసాదగు

నవధాన్య రాశులు

శిల్పిచేయి జేరి

యొనగూరె చిత్రములు

వహువా! కళాహృదయం

మొలిపించె మోహినీరూపం - 56


సంటిబిడ్డ చేతవట్టి

సంబురంగ అడుగులేసె

అంబరాన తిరుగాడే

ఆచంద్రుని బుట్టలేసె

వారెవ్వా! పల్లెపడతి

నీవల్లె కుటుంబప్రగతి- 57


పల్లెపడతి నడకందం

పసికందుల తోడందం

నింగివిరిసె రవిబింబం

బుట్టజేర మిగులందం

విశ్రమించని కాలగమనం

శ్రమజీవుల బతుకుపయనం! - 58


వసుధలో మొలిచేటి

సుగంధ ద్రవ్యాలు

ఒడుపుగా పొదిగేను

సుందర రూపాలు

వారెవ్వా! కళాతపస్వి

నీవేలే చిరయశస్వి - 59

వెలిసినాయి పుడమిపైన

ఆధునికపు గుడులు

మనిషి మేథను దీర్చుతు

భవితగూర్చును బడులు

ముక్తినొసగు గుడులకన్న

విముక్తి నొసగు బడులెమిన్న - 59


యెదనిండ నీరున్న

పయనమా పదుయేరు

ప్రాణికోటి కిబంచి

పులకించు మిన్నేరు

ప్రకృతెంత గొప్పది

పరులకొరకే బతుకుతది - 60


లోకానికి వెలుగుపంచ

ఉదయించె అర్కబింబము

నిలువుటద్దపు యేటిలో

చూసిమురిసె తనబింబము

మోహమెంత మాయనో

మహామహుల నావహించు - 61


ప్రేమ తనువు నావహించ

అన్నుమిన్ను గానకుండు

ప్రేయసి చేయందించగ

స్వర్గమెతన చెంతనుండు

వారెవ్వా! ప్రేమికులు

ఊహలోక భావకులు! -62


గాలిబుడగ లేపినట్టు

యువకుని లేపిందినారి

ప్రేమగాలి సోకియువత

పడుతున్నదిల పెడదారి

వారెవ్వా! నారీమణి

నీప్రతిభకు సలాంమరి-63


అరిగడ్డిని మోపుగట్ట

పసిడిపాము మెరిస్తుంది

ఏమరుపాటుగ జూడగ

గగుర్పాటు కలుగుతుంది

వారెవ్వా! పడతులు

మెరిసిమురిసెనా కురులు-64


రాజశేఖర్

Tuesday, December 8, 2020

రైతులు - కైతికాలు

  మట్టిపొరల మనసుజూచి

గంగతల్లి నుబుకించెను

పుఢమిపురిట విత్తునాటి

అన్నపురాశి మొలిపించెను

వహువా! రైతన్నా

బ్రహ్మ మారుపు నీవన్నా - 1


ఎండనక వాననక 

సెల్కల్ల చెమటోడ్చి

పైరులన్నో బెంచి

పంటలను బండిన్చి

వారెవ్వా! కృషీవలుడు

దాచుకోని త్యాగశీలుడు - 2


నాగలికర్రు వంగింది

భూమిపొరలు చీల్చలేక

రైతునడ్డి విరిగింది

అప్పుకొండ మోయలేక

అయ్యయ్యో! హలదరుడు

వేలాడెను ఉరితాడుకు - 3

Saturday, December 5, 2020

గజల్

 ఆజాబిలి నింగిజారి యిలకు చేరెనేమో

తామరాకు ఆచంద్రుని గొడుగు పట్టెనేమో

తానునడిచినా పథమున వెన్నెలెంతొ పులుముకొంటు
భువిచీకటి తరిమికొట్ట వెలుగు తెచ్చెనేమో

యెదపుఢమిల దాగివున్న దివ్వెలన్ని వెలిగించగ
తనకన్నుల మెరుపుతీగె లరువు యిచ్చెనేమో

మోడుబారి ముడుచుకున్న మదిప్రకృతి మనసువిరియ
చిరుజల్లుల చంద్రికలను యిలకు దించెనేమో

ఆచల్లని చూపులలలు యెదగోడలు తడిపేలా
నులివెచ్చని సమీరాల వలపు  విచ్చెనేమో