Tuesday, January 12, 2021

శీర్షిక: అక్షరాల పొదరిల్లు అలిశెట్టి


అక్షరాలను ఒడుపుగ పేర్చి

అణుశక్తిని రగిల్చ

విదిలించిన కలం నీవు


సమాజపు అసమానతా

రుగ్మతను బాప

అక్షరసేద్యం చేయ

ఎత్తిన కలం నీవు


బర్రెమీదాన తీరు

చలనం లేని నాయకుల

పొడిచి నడిపే

అంకుశపు ఆరుగట్టె నీవు


సమాజానికి పట్టిన

ఆధిపత్య ఛీడను

వదిలించ చల్లిన

అగ్నివర్షపు జల్లు నీవు


ఆకలికేకలను

అక్షరాలుగ మలిచి

బలవంతపు ఊపిరి తెరలను

కవిత్వమద్దిన నగిషీ నీవు


అడుగడుగునా

ఆధిపత్యం అణచేసిన

ప్రతీసారీ ఎదురుతిరిగి

ఎగిసిపడిన అలజడి నీవు


విప్లవాగ్నిని తాలలేక

విసిరివేసిన

ప్రతీజాగల సెగలుగక్కిన

ఫిరంగి నీకలం


అక్షరాలను పేర్చి

అనుభవ కవితాసౌధాలు నిర్మించి

వంగిపోయిన సమాజాన్ని నిలిపిన

పేదోళ్ల వెన్నుపూస నీవు


అభ్యుదయ కవితాధారను

ఆసర జేసుకొని అడుగులేసి

అభ్యుదయానికే నడకనేర్పిన

సంక్షోభగీతం అలిశెట్టి


మరణం నా చివరిచరణం కాదంటూ

ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కవితలల్లి

అంతిమగడియల వరకూ

ఆగకుండా జూలు విదిలించిన

కవితాసింహం అలిశెట్టి


ఆయనో అద్భుత కవిత

అయనో చెరగని భవిత

నిత్యనిశీథిని చీల్చే

ప్రభాకర ప్రభ అలిశెట్టి!


(మరువలేని అలిశెట్టి కవీతాధారకు అక్షరనీరాజనం)


రాజశేఖర్ పచ్చిమట్ల

No comments: