Monday, January 6, 2020

అనుబంధాల ముల్లె

పల్లె
ఆప్యాయతానురాగాల ముల్లె
అనుబంధాలు పెనవేసిన మల్లె
పుట్లకొలది పంటలరాశులు
పాలయేరుల పాడియావులు
ఆడే పిల్లల అరుపులు
ఎగిరే లేగదూడల గెంతులు
అపురూప మేళవింపు పల్లె
మకరసంక్రమణంతో సూర్యుని తేజస్సు
సంక్రాంతి పండుగతో తెలుగు లోగిళ్లు
దేదీప్యమానమై తేజరిల్లుతాయి
చుక్కల తోపులై తళుకులీనుతుంటయి
పంటల రాకతో రైతు
పండుగ రాకతో పల్లె
మురిసిపోతది మైమరిచి పోతది!
ఇరుకైన పూరిళ్లు విశాలహృదయంతో
పల్లెమనసులు పరిమళించి
బంధుజనుల సందడితో
సంక్రాంతి సంబురాల్లో మునిగితేలుతది పల్లె!
కోడిపుంజుపోటీలు గంగిరెద్దులాటలు
భోగిమంటలు పిండివంటలు
తీరొక్క ముగ్గులు తీర్చిన గొబ్బెమ్మలు
కొత్తరంగు పులుముకుంటది పల్లె!
పరవశంతో పులకిించిి పోతది పల్లె!

No comments: