Monday, November 4, 2019

గజల్ - చిరునగవుల చెలి

ఆజాబిలి నింగినిడిచి నేల జారెనేమో
ఆవెన్నెల చంద్రునిడిచి పుడమి చేరెనేమో

మరులుగొలుపు ఆచీకటి మబ్బులలో నిలువలేక
చెలిశిరమున సేదతీరి
ముంగురులుగ మారెనేమో

మింటమెరియు చుక్కలన్ని
అంటుబాసి యరుగుదెంచి
కనుదోయిని కరిగిపోయి
కంటివెలుగు లాయెనేమో

ఆమన్మద రూపమ్మగు
విరిచాపము విరిగిపోయి
చెలినుదుటన చేరిచెలువ
భృకుటములుగ మారెనేమో

ధరనువెలయు దానిమ్మల భీజమ్ములు
పడతిమోము విడిదిజేసి
పలువరుసగ మారెనేమో

తొలిసంధ్యల ధరజేరుచు
విరులనంటి విహరించు
అరుణకాంతి అదమరిచి
నగుమోమున అలరెనేమో

అమాయకపు ఆనవ్వులు
శేఖరుమది చెణుకుచుండ
ఆచూపులు మదిసంద్రపు
అలలై దరి జేరెనేమో

No comments: