Sunday, November 17, 2019

తెలుగు వెలుగేదెలా ?

తెలుగు భాష తెలుగుభాషని
వేదికల మీద గొంతు చించుకున్నంత మాత్రాన
భాష పూర్వ వైభవమొంది భాసిల్లుతుందా?

తేనెలొలికేటి తెలుగు భాషని
మకరందమోలె మధురమైందని
సభలల్ల సాటింపు చేసినంత మాత్రాన
భాషామాధుర్యం జనులకు బోధ పడుతుందా?

ఏళ్ల తరుబడి ఏలుబడిలుందని
గొప్ప పండితులెందరో కొలువుదీరి
ఉత్కృష్ట కావ్యాలు సృష్టించిందనీ
గతచరిత్ర చదివినంత మాత్రాన
తెలుగు గొప్పతనం ప్రజలకు తెలుస్తుందా?

నిద్రలేచింది మొదలు పడుకునేదాక
అవసరాలన్ని ఆంగ్లముల తీర్చుకొని
ఏడాదికోసారి సభలు జరిపినంత మాత్రాన
తెలుగు విరజాజై విరబూసి గుభాలిస్తుందా?

బడిలో గుడిలో తల్లి ఒడిలో
సందులో గొందులో వ్యవహారంలో
పరభాషను పలువిధాల అందళమెక్కించి
సభలల్ల సవతి ప్రేమ జూపినంత మాత్రాన
తెలుగు భాష జాబిల్లై వెలుగులీనుతుందా ?

బాహాటమైన బహిరంగ సభల వల్లనో
ప్రతిష్టాత్మక ప్రచారాల వల్లనో
సమావేశమై చేసే సంబురాల వల్లనో
హంగూఆర్భాటాలతో
అభిమానాన్ని ప్రకటిచడం వల్లనో
తెలుగు వెలుగదు సరిగదా భాష బతుకదు

విరిసీ విరియని పసిహృదయ క్షేత్రాల్లో
తేనెలొలుకు తెలుగు విత్తులు నాటి
అంకురించేల పెంచి పోషించి
ఎదుగుతున్న మొక్కల జూసి
ఎదకద్దుకొని ఎరువందించిన నాడు

తెలుగు మొక్కలు శాఖోపశాఖలై
వృక్షాలై . . .
మహా వృక్షాలై . . .
పుష్ప ఫల శోభితములై  విరాజిల్లుతుంది !
తేట తెలుగుతల్లి
సల్లని నీడనిచ్చి సేద దీర్చుతుంది !

1 comment:

రాధేశ్యామ్ రుద్రావఝల said...

బాగా చెప్పారు..! నిష్టుర సత్యం..!!