Wednesday, November 27, 2019

ఆలోచనల
సంకల్పం అంకురిస్తుంది
ఆచరణమున
సంకల్పం సిద్ది స్తుంది
అడుగడుగునా ఎగుడుదిగుడు లెన్నున్నా
ఆత్మస్థైర్యం
అన్నింటిని జయిస్తుంది

వారెవ్వా బసవన్నా
జగతికంత ఆదర్శమన్నా

Sunday, November 17, 2019

తెలుగు వెలుగేదెలా ?

తెలుగు భాష తెలుగుభాషని
వేదికల మీద గొంతు చించుకున్నంత మాత్రాన
భాష పూర్వ వైభవమొంది భాసిల్లుతుందా?

తేనెలొలికేటి తెలుగు భాషని
మకరందమోలె మధురమైందని
సభలల్ల సాటింపు చేసినంత మాత్రాన
భాషామాధుర్యం జనులకు బోధ పడుతుందా?

ఏళ్ల తరుబడి ఏలుబడిలుందని
గొప్ప పండితులెందరో కొలువుదీరి
ఉత్కృష్ట కావ్యాలు సృష్టించిందనీ
గతచరిత్ర చదివినంత మాత్రాన
తెలుగు గొప్పతనం ప్రజలకు తెలుస్తుందా?

నిద్రలేచింది మొదలు పడుకునేదాక
అవసరాలన్ని ఆంగ్లముల తీర్చుకొని
ఏడాదికోసారి సభలు జరిపినంత మాత్రాన
తెలుగు విరజాజై విరబూసి గుభాలిస్తుందా?

బడిలో గుడిలో తల్లి ఒడిలో
సందులో గొందులో వ్యవహారంలో
పరభాషను పలువిధాల అందళమెక్కించి
సభలల్ల సవతి ప్రేమ జూపినంత మాత్రాన
తెలుగు భాష జాబిల్లై వెలుగులీనుతుందా ?

బాహాటమైన బహిరంగ సభల వల్లనో
ప్రతిష్టాత్మక ప్రచారాల వల్లనో
సమావేశమై చేసే సంబురాల వల్లనో
హంగూఆర్భాటాలతో
అభిమానాన్ని ప్రకటిచడం వల్లనో
తెలుగు వెలుగదు సరిగదా భాష బతుకదు

విరిసీ విరియని పసిహృదయ క్షేత్రాల్లో
తేనెలొలుకు తెలుగు విత్తులు నాటి
అంకురించేల పెంచి పోషించి
ఎదుగుతున్న మొక్కల జూసి
ఎదకద్దుకొని ఎరువందించిన నాడు

తెలుగు మొక్కలు శాఖోపశాఖలై
వృక్షాలై . . .
మహా వృక్షాలై . . .
పుష్ప ఫల శోభితములై  విరాజిల్లుతుంది !
తేట తెలుగుతల్లి
సల్లని నీడనిచ్చి సేద దీర్చుతుంది !

Thursday, November 14, 2019

నాగరికత - కైైతికాలు


సింపుల గుడ్డలతోని
సిత్రమైన యేషాలు
పేషన్ దుస్తుల పేర
ప్రదర్శించు దేహాలు
వారెవ్వా ఆధునికత
అంగట్లో నేటి యువత

నాడు చినిగితె గరీబు
కూడుగుడ్డ లేనోడు
నేడు చినిగితె షరాబు
అన్ని హంంగులున్నోడు
వారెవ్వా నవసమాజం
అభివృద్ధికి అసలు రూపం

Friday, November 8, 2019

దీపావళి - రుబాయీలుకోటి తారల కొంగొత్త వెలుగుల పండుగ
ఇలపై వెలచిన లక్ష్మీరూప సిరుల పండుగ
నోచిన నోములు ఫలము లొసగేలా
వెన్నెలలు విరబూయు దీపాళి పండుగ!

నింగిన  మెరిసిన చుక్కలనేరి
మిలమిల మెరిసే మెరుపులనేరి
పడతుల చేతిలో సౌరులు దీరి
ముంగిట వెలసెను ముగ్గుగ మారి!

అంజనమోలె పరుచుకున్నట్టి నిశిలో
అలలై ఎగిసిన అమవస తామసిలో
కందెన పులిమిన చీకటి చీల్చుతు
మిణుగురులై టపాసులు ఎగసె చీకటిలో

సమస్య: రతిమూలము సర్వధర్మ రక్షణ కొరకైపతిలే నిసతులు జేసెడు
వ్రతత్యాగము ఫలమునీక వ్యర్థమ్మెయగున్
సతిపతు లిర్వురి త్యాగని
రతిమూలము సర్వధర్మ రక్షణ కొరకై


సతతము ధర్మాచరణము
గతితప్పకజేయువారు ఘనులే యగుదుర్
మతులగు జనుల త్యాగని
రతి మూలము సర్వ ధర్మరక్షణ కొరకై

Monday, November 4, 2019

గజల్ - చిరునగవుల చెలి

ఆజాబిలి నింగినిడిచి నేల జారెనేమో
ఆవెన్నెల చంద్రునిడిచి పుడమి చేరెనేమో

మరులుగొలుపు ఆచీకటి మబ్బులలో నిలువలేక
చెలిశిరమున సేదతీరి
ముంగురులుగ మారెనేమో

మింటమెరియు చుక్కలన్ని
అంటుబాసి యరుగుదెంచి
కనుదోయిని కరిగిపోయి
కంటివెలుగు లాయెనేమో

ఆమన్మద రూపమ్మగు
విరిచాపము విరిగిపోయి
చెలినుదుటన చేరిచెలువ
భృకుటములుగ మారెనేమో

ధరనువెలయు దానిమ్మల భీజమ్ములు
పడతిమోము విడిదిజేసి
పలువరుసగ మారెనేమో

తొలిసంధ్యల ధరజేరుచు
విరులనంటి విహరించు
అరుణకాంతి అదమరిచి
నగుమోమున అలరెనేమో

అమాయకపు ఆనవ్వులు
శేఖరుమది చెణుకుచుండ
ఆచూపులు మదిసంద్రపు
అలలై దరి జేరెనేమో

వేంకటేశ స్తవం


ఏడుకొండల వాడ ఓ వెంకటేశా
మూడునామాల వాడ ఓ శ్రీనివాసా
బహుదూరం పయనించి నిన్నుచేర వచ్చాము
నీచూపు మాపైనీ ప్రసరించవేమీ

అలవేలు మంగమ్మ యలకదీర్చుటే గాదు
పద్మావతి యొసగినట్టి
పలుకుదీర్చుటే గాదు
ఇష్టసతులనే గాదు
ఇలభక్తుల పాలించి
ఆదరించి బ్రోవుమయా ఓ శ్రీనివాసా   ॥ఏడుకొండల వాడ॥

లక్ష్మీశుడవై నీవు లాలసంగ దిరిగేవు
క్షీరసాగరములోనా ఖులాసాగ గడిపేవు
చీకుచింతలేకుండా శేషశాయి వైయుండక
మాచింతలు బాపరావ ఓ శ్రీనివాసా   ॥ఏడుకొండల వాడ॥

ఎత్తయిన కొండపైన  విలాసంగ నీవుంటివి
మలయమారుతములు గూర్చ
గమ్మత్తుగ నీవుంటివి
ఒడలసలే కందకుండ
ఒచ్చోరకు నిలిచిపోక
బడలిక దరిజేరకుండ పథము గూర్చవా శ్రీనివాసా  
॥ఏడుకొండల వాడ॥

గరువాహనుడవయ్యి గాలిలోన దిరిగేవు
ఆకాశపు మేడలలో హాయిగా ఒరిగేవు
నీదరిజేరుటలోన
నీరసించి కులబడితిని
మాపదముల మహిమనీయి ఓ శ్రీనివాసా

నీమహిమలు ఈ కనులతో గాంచలేని  దుర్బలులం
నీరూపును జూసినంత
నిలువలేని దరిద్రులం
మాబోటి భక్తులపై
 మమకారం చూపించి
నీఛాయను నిలువనీవ ఓ శ్రీనివాసా      ॥ఏడుకొండల వాడ॥