Tuesday, September 11, 2018

అన్యాయాన్నెదిరించిన కాళోజీ

తండ్రి మరాఠా తల్లి కన్నడా
అయినా కాళన్నకు
తెలంగాణపై మక్కువ
పుట్టినూరు నొదిలిపెట్టి
మడికొండకు మకాంమార్చి
ఓరుగల్లులో ఒదుగి యెదిగి
తెలంగాణ ముద్దుబిడ్డవైనావు !

పలుభాషలు నేర్చుకొని
పలువిధాల పరికించి
తెలంగాణ యాస మెచ్చి
తెగువతో నిటొరిగినావు !

ఆట తప్పు మాట తప్పు
ఆచారాలసలే తప్పని
అన్నింటిని అణచివేసి
ఉర్దూను మనపై రుద్దిన
నిజాంపై భాషాశరమ్ములు సంధించి
తెలుగు ప్రజలకందరికి ఆదర్శమై నిలిచితివి

తెలంగాణ భాష యాస
సంస్కృతి సారస్వతములను
అణగద్రొక్కి నాంధ్రులను
మెడలువంచి మెప్పించి
తెలంగాణ గోసనంత
మన యాసల తెలిపితివి !

అవనిపై జరిగేటి
అవకవకలన్నిటిపై
అవేదనతో స్పందించి
ప్రజల మనసు గెలిచినట్టి
ప్రజాకవి మన కాళోజీ !

ధనికపేద వర్గాంతరాలను
వ్యత్యాసాలుగ జెప్పిన
ఉదాత్తవాద సిద్ధాంతాలను
నిరసించి నీరుగార్చి
రాజకీయ డొల్లతనాన్ని
ఎండగట్టిన హేతువాది కాళోజి !

వస్తువేదైనా తన మస్తిష్కపు
అలోచనలో ఓలలాడితే చాలు
కవిత్వపు రంగు పులుముకొని
ఈటెలుగా వెడలాల్సిందే
సమాజాన్ని తట్టి లేపాల్సిందే !

నిజాం వ్యతిరేక పోరాటం మొదలు
సాయుధ రైతాంగపోరాటం వరకు
ప్రేమ నమ్మకం  మూఢాచారాలు
హాస్యం వ్యంగ్యం అధిక్షేపణలు
వేదన నుంచీ బోధన వరకు
అన్నీ వశమైన కవితా వస్తువులే
తాను వశమవ్వడు దేనికీ !

అన్యాయాన్నెదురిస్తే నాగొడవకు సంతృప్తని
అన్యాయం అంతమైతే నాగొడవకు ముక్తిప్రాప్తని
అన్యాయాని కెదురునిల్చి
అగ్ని గుండమై రగులుతున్న
తెలంగాణ కదనరంగాన
కొదమసింహమై దునికిన ధీరకవి కాళోజీ!

నిజాంపాలనను నిరసిస్తూ
దొరల అరాచకాల నెదురిస్తూ
రజాకార్ల ఆగడాల కడ్డునిలిచి
నిప్పులు చెరిగే భావాలతో
కవితలల్లి కలమెత్తి
ప్రజాభివృద్ది కాంక్షించిన అభ్యుదయవాది కాళోజీ!

ఒక్కొక్క సిరాచుక్కతో లక్షల మెదల్లను కదిలించి
తెలంగాణ భాషలోని తెగువను చూపించి
ప్రజాచైతన్యపు బాటలువేసిన
తెలంగాణ వైతాళికుడు కాళోజీ!

ప్రజల గొడవను తనగొడవగా యెంచి
ప్రజల భాషలో కవితలను రాసి
అన్యాయాన్నెదురించి అందరినీ ఆదరించి
ఆత్మాభిమానం పలికించిన ప్రజాబంధు కాళోజీ!

భాషలోనే బతుకుందనీ
యాసలోనే భవితుందనీ
భాష యాస మరిచిపోతే
మనుగడ కరువవుతుందనీ
బడిపలుకుల నొదిలించి
పలుకుబడులు వలికించిన
 మాతృభాషాభిమాని కాళోజీ!

బానిసత్వపు బాధలుబాపి
అణిచేసిన సంస్కృతికి కంచెనాటి
పరిహసించిన భాషకు పట్టంగట్టి
మనిషిలోని జడత్వాన్ని బొందవెట్టి
అక్షరసేద్యంతో లక్షలమెదల్లు కదిలించి
ప్రజల మనిషి కాళోజి!
మానవతను పరిమళింపజేసిన
మానవతావాది మన కాళోజీ!

No comments: