Tuesday, August 18, 2009

మనిషి

విద్య గల్గినంత విద్వాంసుడవ్వడు
మౌన మాచరింప మౌని గాదు
మంచి చెడుల నెంచి మసలువాడె మనిసి
పచ్చిమట్ల మాట పసిడి మూట

Friday, April 25, 2008

చెలి వదనం...!

ఆకసంలోకి చూస్తే
నిత్యం నీ తలంపే చెలీ!
నల్లమబ్బు చాటున
దాగిన జబిల్లిలా.....
ఝరీ అంచు చాటున
వికసించిన కుసుమ వదనం....!

చెలి కన్నులు......!

నా కళ్ళలోకి చూడు చెలి!
నీ రూపం కనిపించదా?
నీ మనస్సు తెరిచి చూడు చెలీ!
నా రూపం నిలిచిలేదా?

Wednesday, January 16, 2008

జీవిత సత్యం



చీకటిని చూసి చింతిస్తే
ఉషోదయాన్ని ఊహించలేరు. . .!
ఆకు రాలిందని అలమటిస్తే
చిగురుటాశలు చిగురించవు . . !
గతాన్ని చూస్తూ గాబరా పడితే
గమ్యపు భావిని రమించలేవు . . !
చీకటి జీవితపు చింతలనే
చిరునడకలుగా మలచి
భవిష్యత్తుకై అడుగులు కదుపు
బానిసవుతుంది భావి నీకు. . . .!

Monday, January 14, 2008

విరబూసిన నవ్వు












విరబూసిన పువ్వెందుకు చెలీ!

వాడిపోని నీ నవ్వుండగ.....

పున్నమి జాబిలి వెలుగెందుకు చెలీ..!

అందమైన నీ మోముండగ....

Friday, December 28, 2007

నీకై...

వేకువ జామున మొదలు
మిసిరాత్రుల మేళనం వరకు
అను నిత్యం ప్రకృతితో
ప్రతి స్పందించే నీవు ...
మాతృప్రేమను మరువలేక
ప్రకృతి ఒడిలో శయనించావా...!

నిరంతరం శ్రమించే నీవు
ఆదమరిచి ఆకులపై
నిద్రించావా...!

నిత్యం దోబూచులాడె
ఆ పక్షుల కిల కిల రాగాలు వింటూ
వాటితో శృతి కలిపేందుకు
సాగిపోయావా...!

పిల్ల తెమ్మరల
ఈల పాటలు వింటూ
చేదు జీవితపు కలతలు మరిచి
తన్మయత్వంతో తరలిపోయావా...!

కటిక నేలపై కాలుజాపే నిన్ను
మత్త కోయిలలు మత్తుగా జోలపాడి
పచ్చని ప్రకృతమ్మ
వెచ్చని పొత్తిళ్ళలో నిద్రబుచ్చాయా...!

నిత్యం నీవు కదలాడే
పంటచేలోని ప్రతి మొక్క
వెర్రిగా నను ప్రశ్నిస్తుంది
నీ జాడ తెలుసుకోమని....!

పిల్లగాలి మెల్లగా
గేళి చేస్తుంది నను
నీవిప్పుడు అనాథవని ....!

తెలియదు వాటికి నిజం
చిగురించే ప్రతి మొక్కలో
నీ సున్నితపు మనస్సు,
వికసించే ప్రతి పూవులో
నీ చిరునవ్వులు దర్శిస్తున్నాని ...!

అందుకే....
ప్రకృతిని చూస్తే
ఒకింత ప్రేమ,
రెండింతలు ఈర్శతో
మదన పడుతుంటాను.
నిను ఒడిలోకి చేర్చుకొని
సేదతీరుస్తున్నందుకు...!
మానుండి దూరం జేసి
మాయ జేసినందుకు ...!

అయినా....
ప్రకృతిని చూస్తే పరవశించి పోతాను
నీవు దానిలో లీనమైనందుకు,
నిత్యం దానిలో వెతుకుతుంటాను
నీ ఆప్యాయత దొరుకుతుందేమోనని !
వికసించే వెన్నెలకై వేచి చూస్తాను
నీ రూపు దర్శనమిస్తుందేమోనని...!
(మానాన్న గారు స్వర్గీయ పచిమట్ల లచ్చయ్యగౌడ్ గారి ఙాపకార్థం)