Thursday, July 18, 2019

పయోమృతధార




సీ.
నభమందు పయనించు అంబుధ మ్ముమురిసి
వర్షరూ పమునతా హర్ష మొసగ
నదులన్ని నిండుగా నడయాడు చుండగ
పుడమిపై జలధులు పొడము చుండె
చెరువులందున నీరు చేదబావు లనీరు
వాగువంకలు దుమికి యలుగు బారె
సెల్కలం దుననీరు సెలయేటి లోనీరు
ఊటచె లిమెలందు నుబుకె నీరు

జలధు లన్ని నిండి యలుగుదుంంకుతుపార
పారు జలము తోడ పంటబండె
పరవ శించి మురిసె పశుపక్ష్యు లన్నియు
జీవ రాశి కంత చేవ దక్కె

             - రాజశేఖర్ పచ్చిమట్ల

Wednesday, June 19, 2019

గజల్ మది నివేదన!




మదిలోని భావాలను విన్నవించనా చెలీ!
నామది నీయెదవాకిట పరిచివుంచనా చెలీ!

నీమనసున నాతలపులు అనునిత్యం పూచేలా
ప్రేమలతకు మధురాంబువు లోసి పెంచనా చెలీ!

నీ మనసును గ్రమ్మినట్టి కల్మషంపు కారుమబ్బు
తొలగించెడు పవనమ్ముల ప్రసరించనా చెలీ!

ముకులించిన వదనాంబుజము వికసింపజేసేలా
నీచూపుల కిరణమ్ములు సారించవా చెలీ!

చెలిమనసున యేమున్నదొ కవిశేఖరు కవగతమే
బిడియపు పరదలనుదాటి ప్రేమపంచవా చెలీ!


       - పచ్చిమట్ల రాజశేఖర్

Tuesday, June 11, 2019

చిరకీర్తి

(పాలకంటె పెరుగు పెరుగుకంటెను వెన్న, వెన్నకన్నను మిగుల నేయి శాశ్వతముగ నిలుచుతీరు మనుషులు నిత్య సంఘర్షనలతో మంచి మనుషులు మారి చిరకీర్తులందాలని ఆశిస్తూ - -)

సీసంం:
పాలవంటి మనసు పలుచనై దిగజారు
అచిరకా లమ్మునే అంత మౌను
పెరుగసొం టిమనసు పెంపునొం దునుగాని
మూడునా ళ్లకుతాను మురిగి పోవు
వెన్నలాం టిమనసు విసుగుచెం దకతాను
వారమ్ము కొలదిగా వరలుచుండు
నేయిలాం టిమనసు నిగనిగ లాడుతూ
నెలలువ త్సరములు నిలిచి యుండు

పాల నుండి పెరుగు వెలికివ చ్చినతీరు
పెరుగు నుండి వెన్న బరగు తీరు
వెన్న చిలుక నేయి వెలికి వచ్చినతీరు
మనిషి వెలయ వలెను మనల నుండి

Sunday, May 12, 2019

తల్లితీపి

నవ మాసాలు మోయడమే కాదు
నడక నేర్చే వరకు
బిడ్డ తన కాళ్లపై తాను నిలిచి నడిచేవరకు
తీగె కాయను మోస్తున్నంత
సునాయాసంగ
మక్కచేను సంకపాపను మోస్తున్నంత సుకుమారంగ
తల్లి బిడ్డను మోస్తూనే ఉంటుంది
బిడ్డే సర్వస్వంగా భావించి!
పెంట మీది కాకరచెట్టు
పగడాల్ల మెరిసే గింజల జూసి మురిసినట్టు
చింపిరిగుడ్డల సీతాఫలం
ఇంద్రనీలమణులసోంటి గింజలచూసి
సంబురపడ్డట్టు
తల్లి తన బిడ్డలను తనివిదీర ప్రేమిస్తుంది!
తనబిడ్డల దిగులుజూసి
తనువెల్ల తపనవడ్తది!

        -( తల్లికోరోజు తండ్రికోరోజు కెటాయించుకొని పూజించే దేశంలో మనం పుట్టలే. అనునిత్యం ఉదయాన్నే లేచి భగవద్సదృశులైన వారి పాదాలకు నమస్కరించే సాంప్రదాయికదేశంలో పుట్టిన మనమంతా ధన్యులం. మనలగన్న తల్లిదండ్రులు కడుధన్యులని భావిస్తూ )

Saturday, May 11, 2019

సమస్య: అడుక్క తినకున్న వాడు అధముంండయ్యెన్

కం.
బడిమా నినబా లుండును
గుడిమా నినవా డుమరియు గురుపీ ఠమ్మున్
ఎడబాసి తిరుగెడునతడు
అడుక్క తినకున్న వాడు నధముండయ్యెన్

Monday, May 6, 2019

కైైతికాలు

1.
నింగిని నేలను నమ్మి
కాలంతో కలబడుతరు
నిద్రాహారాలు మాని
పరులకు తిండి బెడతరు
వారెవ్వా కర్షకులు
పరోపకారపు ప్రతిరూపాలు!

2.
మొగులు జూసి మోహంతో
కలల సేద్యం సాగిస్తరు
ఆశలు తీరు దారి లేక
బతుకాటను ముగించేస్తరు
వారెవ్వా కర్షకులు
నడుమంత్రపు బతుకులు!

Monday, April 29, 2019

వర్షపుహర్షం



సీ.
ఆకము నవెలయు నంబుధ మ్ముమురిసి
వర్షరూ పమునతా హర్ష మొసగ
నదులన్ని నిండుగా నడయాడు చుండగ
పుడమిపై జలధులు పొడము చుండె
చెరువులందున నీరు చేదబావు లనీరు
వాగువంకలు దుమికి యలుగు బారె
చెలిమలం దుననీరు సెలయేటి లోనీరు
ఊటచె లిమెలందు నుబుకె నీరు

జలధు లన్ని నిండి యలుగుదుంంకుతుపార
పారు జలము తోడ పంటబండె
పరవ శించి మురిసె పశుపక్ష్యు లన్నియు
జీవ రాశి కంత చేవ దక్కె

             - రాజశేఖర్ పచ్చిమట్ల