Saturday, August 4, 2018

కార్యానుకూలత

అనుకూ లతలే నియెడల
పనుల న్నిటగా నరాదు ఫలితం   బవనీ
అనుకూ లతగలి గినెడల
పనుల న్నియుస క్కజేసి పరవశ మొందన్

బాటసారి

అడుగడుగులు కదిలి పథము సాగుటెగాని
బడలి కెరుగ బోడు బాటసారి
ఎగుడు దిగుడు త్రోవ లెన్నెదు రైనను
జంక కుండ సాగి జయము నొందు

                పచ్చిమట్ల రాజశేఖర్

Friday, August 3, 2018

హరితహారం


దండిగ తరువులు బెంచిన
మెండుగ వానలు కురియును మేదిని యందున్
నిండును చెరువులు కుంటలు
పండును తెలగా ణనేల బంగరు పంటల్

తెలంగాణ అభ్యుదయ గేయం

 పల్లవి:
జై జై తెలగణ స్వాతంత్ర్యాభ్యుద
                యానందోత్సవ శుభ సమయం
ప్రియతమ తెలగణ జనయిత్రీ చిర
                 దాస్య విమోచన నవోదయం  ॥2॥
 1చరణం:
పొద్దుపొడిచె లేవండోయీ
నిద్రవిడిచి రారండోయీ ॥2॥
బంగరుభవితకు బాటలు వేయుచు
జాతిని జాగృత పరచాలోయీ   ॥జై జై॥

2చరణం:
హిందూ ముస్లిం క్రైస్తవ పార్సి
ఏకవేదికన నిలవండోయీ  ॥2॥
రంగులెన్నైన రాష్ట్రమొక్కటని
జగతి కెల్లరకు చాటండోయీ  ॥జై జై॥

3.చరణం:
చిన్నా పెద్దను తేడాలొదిలీ
తెలంగాణమున మొక్కలునాటి
హరితహారముతొ అవని వెలుగునని
భావితరాలకు తెలుపాలోయీ ॥జై జై ॥

4.చరణం:
కులమత భేదాలన్నీ వదిలీ
చెరువులన్నింటి పూడికతీసి
కరువునేలలో సిరులు పండించి
రైతే రాజుగ యెదగాలోయీ   ॥జై జై॥


Thursday, August 2, 2018

నాకు నచ్చిన పుస్తకం - చిల్లరదేవుళ్ళు

విప్లవం మొదలు వేదాల వరకు జీవనయానం సాగించిన బహుముఖ ప్రజ్ఞాశాలి, అపర వ్యాసుడు, నిత్యసాహితీ కృషీవలుడు గద్య దాశరథి కలంనుండి ఎగిసిన నవలాకెరటం "చిల్లర దేవుళ్ళు" గురించి గొల్లపెల్లి మండలకేంద్రంలో తెలుగు అధ్యాపకులుగా కొనసాగుతున్న పచ్చిమట్ల రాజశేఖర్ గారు తన అభిప్రాయాలనిలా వివరించారు.

               'పెన్నే గన్నుగా చేబూని' ప్రజాపక్షం వహించి పోరాడిన సాహితీయోధుడు దాశరథి రంగాచార్య. విషయమేదైనా కుండబద్దలు గొట్టినట్టు ముక్కుసూటిగ చెప్పడం ఆయన నైజం.తన రచనలతో ప్రజల్ని మేల్కొల్పడానికి, అన్యాయాన్నెదురించడానికీ ఇష్టపడే రంగాచార్యులుగారి తొలి నవల, తెలంగాణ మాండలిక నవలగా పేరు గాంచిన 'చిల్లరదేవుళ్ళు' 1969లో గ్రంథరూపు సంతరించుకుంది. రంగాచార్య రచనలు భావోద్రేకాల్ని రగిలించేకన్నా భావోద్వేగాల్ని కలిగిస్తాయని చెప్పొచ్చు. వట్టికోట ఆళ్వారు స్వామి వదిలివెళ్లిన ఉద్యమాన్ని తన భుజస్కంధాలపై వేసుకొని 'గంగు' కొనసాగింపుగా ఈనవల రాసారు. దానికి కేంద్ర సాహిత్య అకాడమీఅవార్డు కూడా రావడం జరిగింది. తెలంగాణ సాయుధపోరాటాన్ని దగ్గరగా వీక్షించుటచేత ఆనాటి పాలకుల తీరు, తెలంగాణ సామాజిక స్థితిగతులకు అద్దం పడుతుందీ నవల. గార్ల ప్రాంతంలోని జాగీర్దార్ల దాష్టికాలను కళ్ళకుగట్టింది. ఈనవలలోని పీరిగాడు, పాణిమంజరి, ఇందిర పాత్రలు నాటిప్రజలకు ప్రతినిధులై నిలిచారు. ఈనవలలో తెలంగాణ పలుకుబళ్లు, నుడికారాన్ని ఒలికించి అక్షరబ్రహ్మగ, సాహితీసమరయోధునిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు దాశరథి రంగాచార్య

Sunday, July 29, 2018

కందములు

1.కోపము మనుజుల కనిశము
తాపము గలిగించు టెదాని తత్త్వం బగుదా
నోపువ హించిన యెడలను
దీపము వలెత్రో వజూపి తీర్చును బాధల్

2.నల్లని మేనున్  నగుమోము
నల్లనయ్య లాలస ముతోడ నూయల లూగన్
ఉల్లము నన్ మురి పెమ్ముతొ
తల్లియ శోధత నయుజూసి తన్మయ మొందెన్

3.మితిమీ రినసం పదలవి
వెతలను గల్గించు టెగాక వేదన లొసగున్
అతిగా కురిసిన వానలు
బతుకులు చిద్రములొ నరించి బాధల నొసగున్

4.
కం.
పాపము జేసెడు వేళలొ
పాపము లనియెరు గలేరు పాపాత్ము లెపుడున్
పాపఫ లమొందె డుతరిన్
తాపమొం దిభీతి లెదరుగ దండిగ వారున్

5.
కం.
దండిగ తరువులు బెంచిన
మెండుగ వానలు కురియును మేదిని యందున్
నిండును చెరువులు కుంటలు
పండును తెలగా ణనేల బంగరు పంటల్

               రాజశేఖర్ పచ్చిమట్ల

Sunday, July 15, 2018

సమస్య

సమస్య.
పడుచున్నను పెండ్లి జేయు వారలు గలరే




గడిచిన రోజుల కొందరు
పడిపడి పరిణయ ములాడి బాధల నొందన్
కడుతీ వ్రతరమ గుపాట్లు
పడుచున్నను పెండ్లి జేయు వారలు గలరే

         -     ప.రా.