Wednesday, July 4, 2018

జనన మరణాలు

జననముమరణము సహజము
అనవర తమగువా నిగూర్చి  తపియించు కంటెన్
మనిషిగ పుట్టిన వంటెనె
చనిపోవు టదిత థ్యమనియు జనులెరు గవలెన్

Monday, July 2, 2018

రైతు నానీలు

1.మబ్బులు లేని
ఆకాశంజూసి రైతు
నిట్టూర్చి నిలవలేక
నేలగూలిండు
2.
చేయడ్డువెట్టి
మొగులు జూసే రైతు
చేను తడువలే
మేను తడిసింది
3.
ఆరుగాలపు శ్రమ
నంగడికొంటవోతే
దళారులే
తళారులైరి
4.
ఆయిటి బూనిందని
ఆశ పడ్డ రైతు
ఇంట్లున్న ఇత్తులు
మంట్లె వోసిండు
5.
మబ్బుపొదుగు సుధకై
మన్నెదురు చూస్తుంది
రైతు స్వేదం
అంకురించాలని
6.రైతు బెంగటిల్లి
బేజారైతుండు
ఎగిసిపోతున్న
ఎరువుల ధరజూసి

Sunday, July 1, 2018

వలపువాహిని



నీ తలపులు
గుండెల్లో గోదారి వెల్లువై
మనసు పొరల్లో
కదలాడుతున్నంత సేపు
నీవు నానుండి దూరంకాలేవు చెలీ!

మన ప్రేమ వాహినికి
నువ్వు నేను చెరో తీరమై
చెలగినపుడు
మనం విడిపోయేదేలా?

గోదారి అలలై
హాయిగొల్పే హోరై
తీరపు ఇసుక తిన్నై
మన ప్రేమ నిత్య నూతనమై
సప్తవర్ణ శోభితమై
అలరారుతుందే గాని
అవిరవదులే చెలీ!

Tuesday, June 5, 2018

అపూర్వానుషంగం !

తరతరాలు తవ్వినా
తరగని జ్ఞాపకాల గని
ఆస్వాదించిన కొలది
ఆనందాతిశయమ్మొనరించు
మధుర భావాల ఝరి
అద్వితీయం అనుభవైకవేద్యం బాల్యం !

ఆనందమొనరించు ఆటపాటలు
అల్లరి పనులు
అపురూప అనుభవాలు
కోతిచేష్టలు కొంటెపనులు
ఆజన్మాంతం తనువంటియుండే
మలయమారుతమధురజ్ఞాపకాలు
బాల్యపు సిరిసంపదలు!

అహోరాత్రులు ఆదమరిచి
స్నేహ పరిమళాల
నిరంతరాఘ్రాణంలో
తలామునకలై తపించినా
తనివితీరక తపన చావక
మైమరిపించే మధువనం బాల్యం !


ఆ క్షణం కోపం మరుక్షణ మానందం
అపుడే అలక తదనంతరం కలయిక
పొరపొచ్చాలు పోట్లాటలు
పంచుకుతింటూ పరవశమొందే
రాగద్వేషాల రాగరంజితం
నవ్వులుతుళ్లుల  నవరసభరితం బాల్యం !


పతంగులమై ఎగిరిన క్షణాలు
పక్షులమై గుమిగూడిన జ్ఞాపకాలు
సీతాకోకలమై విహరించి
సేకరించిన తేనెబిందువులు
ఎన్నో గురుతులు
ఎన్నెన్నో అనుభూతులు
కలగలిసిన కమనీయ ఘట్టం బాల్యం !

పచ్చని ప్రకృతి ఒడిలో
పాఠాలునేర్చి
అక్షయపాత్రయై అడిగిందిచ్చే
అమ్మ ఒడిలాంటి బడినొదిలి
చెట్టునీడను చెలిమి నొదిలిపెట్టి
పై చదువుల నెపంతో
పలుదిక్కులకు పయనమై
ఉన్నత విద్యలో ఉత్తములుగ రాణించి
అందిపుచ్చుకున్న అవకాశాలను
కడలి అలలతో గెలువలేక
చేజార్చుకున్న చేదు అనుభవాలను
ఆప్తమిత్రులతో పంచుకొనే
అరుదైన ఘట్టం ఆత్మీయ సమ్మేళనం !

అపాత మధురిమలను
అపురూప క్షణాలను
మరిమరితలచుకొని
మురిసి మైమరిచే
అమూల్య సన్నివేశం!
             ఆత్మీయాలింగనం!!


     పూర్వ విద్యార్థుల
         అపూర్వ సమ్మేళనం !








Thursday, May 24, 2018

మాట విలువ

మాట వలన పెరుగు మమతలు బంధాలు
మాట వలన మనకు చేటు గలుగు
మనషు లాచి తూచి మాటాడ వలయును
పచ్చిమట్లమాట పసిడిమూట

మాట మనిషి లోని మాలిన్య మునుతుంచు
మాట మనుషు లందు మమత బెంచు
మాట వలనె మనకు మర్యాధ ప్రాప్తించు
పచ్చిమట్లమాట పసిడిమూట

మాట మధుర మైన మంచి మిత్రుల నిచ్చు
మాట కఠిన మైన మనసు విరుచు
మాట శక్తి దెలిసి మసలుకున్నమేలు
పచ్చిమట్లమాట పసిడిమూట

మాటవలన మనిషి మాన్యుడయివెలుగు
మనిషి విలువ పెరుగు మాట వలన
మనిషి నుదుటి రాత మార్చేది మాటలే
పచ్చిమట్లమాట తసిడిమూట

Tuesday, May 22, 2018

సమస్యాపూరణం


సమస్య - నన్నయాదులు మెచ్చిరి నాకవితను


నాడు సంస్కృతాం ధ్రమ్ముల నలరినట్టి
కవిత పురంద్రి  సాంగత్య పువిము ఖతతొ
అచ్చ తెలుగుకు పట్టంబు గట్టి నట్టి
నన్నయాదులు మెచ్చిరి నాక వితను
నన్నయాదులు మెచ్చిరి నాదు కవిత

Saturday, May 12, 2018

అమరతరువు అమ్మ

మాటల కందని మధురభావం
కవితల కందని కమ్మనిరూపం
సంగీత సాహిత్యాలు సరితూచని సమరస భావం!

నిశీథిలో ఉషోదయం
ఆప్యాయతానురాగాల అసలురూపం
ఆత్మీయతకు ఆలవాలం
ప్రేమానురాగపు లతామూలం
అల్లుకున్న పొదరింటి సుమసౌరభాలను
అందరాకిఅందించే
నిస్వార్థపు నిజరూపం అమ్మ!

శాఖోపశాఖలైవిస్తరించిన బందాలకు ఆలంభనై
పుంఖానుపుంఖాలై విరిసిన
అపురూప భావాల సారథియై
తరతరాల అనుబంధాల వారధియై
ఊడలను వేళ్లుగ విస్తరించి
ఉర్విజనుల ఊరట నందించే
ఊడలమర్రి అమ్మ!

మానవజాతి కంత మమతానురాగాల
మలయమారుతాలందించే
ఫలపుష్ప శోభిత
పంచామరతరుల మేళవింపు అమ్మ !