Tuesday, June 5, 2018

అపూర్వానుషంగం !

తరతరాలు తవ్వినా
తరగని జ్ఞాపకాల గని
ఆస్వాదించిన కొలది
ఆనందాతిశయమ్మొనరించు
మధుర భావాల ఝరి
అద్వితీయం అనుభవైకవేద్యం బాల్యం !

ఆనందమొనరించు ఆటపాటలు
అల్లరి పనులు
అపురూప అనుభవాలు
కోతిచేష్టలు కొంటెపనులు
ఆజన్మాంతం తనువంటియుండే
మలయమారుతమధురజ్ఞాపకాలు
బాల్యపు సిరిసంపదలు!

అహోరాత్రులు ఆదమరిచి
స్నేహ పరిమళాల
నిరంతరాఘ్రాణంలో
తలామునకలై తపించినా
తనివితీరక తపన చావక
మైమరిపించే మధువనం బాల్యం !


ఆ క్షణం కోపం మరుక్షణ మానందం
అపుడే అలక తదనంతరం కలయిక
పొరపొచ్చాలు పోట్లాటలు
పంచుకుతింటూ పరవశమొందే
రాగద్వేషాల రాగరంజితం
నవ్వులుతుళ్లుల  నవరసభరితం బాల్యం !


పతంగులమై ఎగిరిన క్షణాలు
పక్షులమై గుమిగూడిన జ్ఞాపకాలు
సీతాకోకలమై విహరించి
సేకరించిన తేనెబిందువులు
ఎన్నో గురుతులు
ఎన్నెన్నో అనుభూతులు
కలగలిసిన కమనీయ ఘట్టం బాల్యం !

పచ్చని ప్రకృతి ఒడిలో
పాఠాలునేర్చి
అక్షయపాత్రయై అడిగిందిచ్చే
అమ్మ ఒడిలాంటి బడినొదిలి
చెట్టునీడను చెలిమి నొదిలిపెట్టి
పై చదువుల నెపంతో
పలుదిక్కులకు పయనమై
ఉన్నత విద్యలో ఉత్తములుగ రాణించి
అందిపుచ్చుకున్న అవకాశాలను
కడలి అలలతో గెలువలేక
చేజార్చుకున్న చేదు అనుభవాలను
ఆప్తమిత్రులతో పంచుకొనే
అరుదైన ఘట్టం ఆత్మీయ సమ్మేళనం !

అపాత మధురిమలను
అపురూప క్షణాలను
మరిమరితలచుకొని
మురిసి మైమరిచే
అమూల్య సన్నివేశం!
             ఆత్మీయాలింగనం!!


     పూర్వ విద్యార్థుల
         అపూర్వ సమ్మేళనం !








No comments: