Saturday, August 26, 2023

తండ్రి సంరక్షణ పద్యం

సీసం:


తండ్రి గాచు మనల ధరణితో తుల్యమై 

    తండ్రి గాచు మనల దండిగాను 

తండ్రి గాచుమనల తగురీతి మెప్పించి 

     తండ్రి గాచు మనల తరువు వలెను 

తండ్రి గాచు మనల తాగురువుగనిల్చి

     తండ్రి గాచు మనల దండ నమున 

తండ్రి గాచు మనల తానెసర్వస్వమై

    తండ్రి గాచు మనల దాత వలెను 


తండ్రి కఠినాత్ముడై యుండు తమను దీర్చ 

తండ్రి పిసినారి యైయుండు తమనుబెంచ 

తండ్రి శ్రమజీవి యైయుండు తమను సాక 

తండ్రి గొడుగుతానైయుండు నీడనొసగ

Friday, August 11, 2023

గజల్ స్నేహపరిమళం


అందమైన బంధమయ్యి అవతరించు రా చెలిమి

అవరోధాలెరుగకుండ ఆగమించురా చెలిమి ॥2॥


పేద ధనిక భేదాలను యెంచబోదు ఆబంధం

స్వార్థమన్నదే యెరుగక కొనసాగించు రా చెలిమి


కులమతాలపట్టింపుల కొలతమరచి కలుపుకుంటు

మానవతే పునాదిగా అంకురించురా చెలిమి


కలిమిబలిమి రంగురూపు లెంచకుండ తోడుండి

మంచితనమె భూమికయై యలరించురా చెలిమి


కవిశేఖరు గుర్తించిన కండబలమురా చెలిమి

సంకుచితకు తావియ్యక ఉద్దరించురా చెలిమి