Tuesday, November 8, 2022

సైనికత్యాగం (గజల్ )

 హిమనగమున మంచుపొరలు ఎరుపెక్కిన వెందుకనో

భరతావని గుండెగదులు బరువెక్కిన వెందుకనో


చల్లనైనవీచికలతొ విశ్వమంతసరసమాడ

సుమవనమున పొరలుతావి ఘాటెక్కిన దెందుకనో


మంచునడుమ దిరిగాడెడు నాపెనిమిటి తలపుకొస్తె

నామనమ్ము దిగులుగమ్మి బరువెక్కిన దెందుకనో


తెలిమాపున చలిగాలులు తెప్పలుగా వీయువేళ

దనకౌగిళి తలపురాగ తీపెక్కిన దెందుకనో


ఈదేశపు సౌభాగ్యము నీచేతుల దాగెనేమో

నినుజూడ నిరీక్షించి అలుపెక్కెను యెందుకనో


నీదేహము నెత్తురోడి నిశ్చలమై నేలగూల

నింగిజారి యాపతాక తనువెక్కెను యెందుకనో


తొలిపొద్దును చూడలేక మూసుకున్న రాజుకనులు

ఆకసమున ధృవతారను వెదుకుతున్నవెందుకనో

No comments: