Tuesday, January 19, 2021

గజల్ - 1

 ధేనువులో పరికించిన దైవరూపు తలపించును

రేణువులో పరికించిన మనిషిరూపు కనిపించును


కల్లోలపు సంద్రముగని మదికలవర పడకుసుమీ

అలలపైన ఊయలూగు కలలసాగు కనిపించును


పులుముకొన్న రాజకీయ పంకిలమ్ము మాయదుగద

హంసతీరు తరచిచూడ పాలునీరు కనిపించును


కుక్కతోక వంకరంటు లోకరీతి వల్లించక

సాధించగ పూనుకుంటే పెనుమారుపు కనిపించును


తలరాతని నిందించగ ఫలమదేమి కవిశేఖర
చిక్కులెన్నొ విడదీసిన మంచిబతుకు కనిపించును

Wednesday, January 13, 2021

ధనము విలువ

 ధనముగల్గినంత తగినగౌరవమొందు

ధనములేక విలువ దక్కబోదు

నీరులేనిబావి నెవరుచూడరుతొంగి 

పచ్చిమట్లమాట పసిడిమూట

Tuesday, January 12, 2021

కవితల కొలిమి (అలిశెట్టి)

 అర్థాంగి మనసు

అట్టడుగు పొరల్ని

పరికించి చూడగలిన

అర్థనారీశ్వరుడు తాను


కన్నీటిసంద్రపు

పేదల జీవితపు

చిట్టచివరి పేజీని 

చదివిన మేధావి తాను


పెట్రేగిన పెట్టుబడిదారుల

మెడలు వంచి మెదిపే

బలహీన వర్గపు చేతికిమొలిచిన

అక్షరకరవాలము తాను


నిష్కల్మష పల్లెపడచు

కొంగుచాటు బతుకును

హొయలొలిలే నగర రంగసాని

కపట సావాసము చేసిన అలిశెట్టి


అలిశెట్టి అంటే అందమైన చిత్రం

అలిశెట్టి అంటే నిలకడలేని జీవితం

అలిశెట్టి అంటే కాలుతున్న క్రొవ్వత్తి

ఆతని కవిత్వం నిప్పుల కొలిమి!

శీర్షిక: అక్షరాల పొదరిల్లు అలిశెట్టి


అక్షరాలను ఒడుపుగ పేర్చి

అణుశక్తిని రగిల్చ

విదిలించిన కలం నీవు


సమాజపు అసమానతా

రుగ్మతను బాప

అక్షరసేద్యం చేయ

ఎత్తిన కలం నీవు


బర్రెమీదాన తీరు

చలనం లేని నాయకుల

పొడిచి నడిపే

అంకుశపు ఆరుగట్టె నీవు


సమాజానికి పట్టిన

ఆధిపత్య ఛీడను

వదిలించ చల్లిన

అగ్నివర్షపు జల్లు నీవు


ఆకలికేకలను

అక్షరాలుగ మలిచి

బలవంతపు ఊపిరి తెరలను

కవిత్వమద్దిన నగిషీ నీవు


అడుగడుగునా

ఆధిపత్యం అణచేసిన

ప్రతీసారీ ఎదురుతిరిగి

ఎగిసిపడిన అలజడి నీవు


విప్లవాగ్నిని తాలలేక

విసిరివేసిన

ప్రతీజాగల సెగలుగక్కిన

ఫిరంగి నీకలం


అక్షరాలను పేర్చి

అనుభవ కవితాసౌధాలు నిర్మించి

వంగిపోయిన సమాజాన్ని నిలిపిన

పేదోళ్ల వెన్నుపూస నీవు


అభ్యుదయ కవితాధారను

ఆసర జేసుకొని అడుగులేసి

అభ్యుదయానికే నడకనేర్పిన

సంక్షోభగీతం అలిశెట్టి


మరణం నా చివరిచరణం కాదంటూ

ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కవితలల్లి

అంతిమగడియల వరకూ

ఆగకుండా జూలు విదిలించిన

కవితాసింహం అలిశెట్టి


ఆయనో అద్భుత కవిత

అయనో చెరగని భవిత

నిత్యనిశీథిని చీల్చే

ప్రభాకర ప్రభ అలిశెట్టి!


(మరువలేని అలిశెట్టి కవీతాధారకు అక్షరనీరాజనం)


రాజశేఖర్ పచ్చిమట్ల

Monday, January 11, 2021

మాటలపోట్లు


ఉట్టిలన్నం బెట్టి

ఊగులాడ దీసే ఏలుబడిల

అంటిన డొక్కల

ఆకలి దీరినట్లే?


దేశానికి వెన్నెముకకు

సాలుసాలుకు వెన్నుపోట్లే

అయినా అశచావక

ఏండ్లకేండ్లు ఎదురుచూపులే?


ఆవకాయంత సాయానికి

ఆకాశమంత ఆర్భాటం

పేదోనికందే ప్రభుత్వ ఫలానికి

నాయకుల హంగామా?

Thursday, January 7, 2021

మమతల మర్రి - నానీలు

 

పదచారుల విడిదిరూపు

పసివారికి ఆటవిడుపు

ఊరిచివరున్న

ఊడలమర్రి - 1


మమతల తల్లి

మర్రిచెట్టు

మనుషులకేకాదు

పసుపక్షుల బసగూర్చు - 2



వడ్డించిన విస్తర్లు

దేవదేవుల నైవేద్యం

వనములున్న

వటపత్రములు - 3

Saturday, January 2, 2021

మణిపూసలు - కొత్తవత్సరం

 పాతదనీ తాగుడాయె

కొత్తదనీ తిరుగుడాయె

కొత్తపాతలనుకుంటా

ప్రజపబ్బం గడుపుడాయె


కష్టమంటు తాగుతుండ్రు

బాధలంటు తాగుతుండ్రు

సాకులతో తాగుకుంటూ

మైకంలో తిరుగుతుండ్రు


కలలోగమ్యాన్ని చూసి

చేరాలని చింతజేసె

అడుగేయక బద్ధకించి

తాగిగమ్యమంద జూసె

పచ్చిమట్ల