Tuesday, January 28, 2020

సీసం: ఆలిసేవలు



కౌమారదశలోనకౌతుక ములుదీర్చ
అప్సరసేయౌను ఆలితాను

మధ్యవయసులోని మంతనములలోన
మంత్రియైతగినట్టి మాటజెప్పు

ముదిమిజొచ్చినవేళ మూడొకాళుగమారి
పతులగమ్యమునకు పదములౌను

అవసానదశయందు అతిథిసేవలుజేసి
ఆలంభనగనిల్చి యాసరౌను

వేలుబట్టినదాదితా వెంటనడిచి
కష్టసుఖములనన్నింట కలిసిమెదిలి
ప్రేమ బంచుట లోపిల్ల పెన్మిటికడ
అమ్మలకుమారు సేవించి యాలినిలుచు

Wednesday, January 22, 2020

వాడుకభాషా వత్సలుడు(గిడుగు రాంమూర్తి)


పాలకభాష పండితభాష
ప్రామాణిక భాషంటూ
భాషను బహురూపుల బంధించి
శుద్ధగ్రాంథీకంలో సాహిత్యరచన జేసి
విద్యను బ్రహ్మపదార్థంగా
సామాన్య జనానికి సదువు వాసన సోకకుండా
పండితుల వంటింటి కుందేలునుజేసి
వాడుకభాషకు విలువనీయక
మేధావులంతా తత్సమభాషను
మేథస్సు నిదర్శనంగా ఊరేగుతున్న కాలంలో
ప్రజలభాష పరపతిపెంచి
సదువులతల్లిని సర్వజనుల
చేరదీసి చేయికందించిన
వ్యవహారికభాషోద్యమపితామహుడు గిడుగు

మాటలుతప్ప లిపిలేని
సవరభాషను సవరించి
సవర సాహిత్య సృజనకు
పునాదివేసిన భాషాశాస్త్రవేత్త గిడుగు

తెలుగుపత్రికను స్థాపించి
పండితప్రశంసాయుత గ్రాంధికభాషను గద్దెదించి
పామరజనరంజక ప్రజలవాడుకభాషకు పట్టంగట్టి
మాటలకుమాత్రమే పరిమితమై
గ్రామ్యంగా ముద్రవేయబడి
పలురకాల పరిహాసమొందిన
పల్లెభాషను
కావ్యభాషగా మెరిపించి మురిసిన భాషాయోధుడు గిడుగు!
సాధారణభాషలో సాహితీసృజనకు బాటలువేసిన సాహిత్యపిపాసి గిడుగు!

మాట్లాడేభాష వేరు సదివే భాష వేరుగ
చదివేపిల్లల శ్రమజూసి
పాఠ్యపుస్తకాలన్ని ప్రజలభాషలుండాలని
సాహిత్యమేగాక విజ్ఞానాన్ని
ప్రజలభాషకు మార్చి
సదువులమ్మను సామాన్యప్రజల లోగిల్లలో నిలిపిన అపర భగీరథుడు గిడుగు

         పచ్చిమట్ల రాజశేఖర్
                 జగిత్యాల
           9676666353

Monday, January 6, 2020

అనుబంధాల ముల్లె

పల్లె
ఆప్యాయతానురాగాల ముల్లె
అనుబంధాలు పెనవేసిన మల్లె
పుట్లకొలది పంటలరాశులు
పాలయేరుల పాడియావులు
ఆడే పిల్లల అరుపులు
ఎగిరే లేగదూడల గెంతులు
అపురూప మేళవింపు పల్లె
మకరసంక్రమణంతో సూర్యుని తేజస్సు
సంక్రాంతి పండుగతో తెలుగు లోగిళ్లు
దేదీప్యమానమై తేజరిల్లుతాయి
చుక్కల తోపులై తళుకులీనుతుంటయి
పంటల రాకతో రైతు
పండుగ రాకతో పల్లె
మురిసిపోతది మైమరిచి పోతది!
ఇరుకైన పూరిళ్లు విశాలహృదయంతో
పల్లెమనసులు పరిమళించి
బంధుజనుల సందడితో
సంక్రాంతి సంబురాల్లో మునిగితేలుతది పల్లె!
కోడిపుంజుపోటీలు గంగిరెద్దులాటలు
భోగిమంటలు పిండివంటలు
తీరొక్క ముగ్గులు తీర్చిన గొబ్బెమ్మలు
కొత్తరంగు పులుముకుంటది పల్లె!
పరవశంతో పులకిించిి పోతది పల్లె!

మూడురంగుల జెండా (గేయం)

శీర్షిక: మూడురంగుల జెండా
రచయిత పేరు: పచ్చిమట్ల రాజశేఖర్
పల్లవి:
మూడురంగుల జెండా ముచ్చటైన మన జెండా
భరతావని యెదలనిండి రెపరెపలాడే జెండా
చ1.
తరతరాల బానిసత్వ సంకెళ్లను తొలగించిన
త్యాగధనుల గుండెనిండ
ధైర్యము నింపిన జెండా
చ2.
సైరికులతో సైనికులతో
సంప్రదాయ విలువలతో
ఆకాశపు అంచులలో
అలరారెను మనజెండా
చ3.
ఆసేతు హిమాచలము అణువణువూ తడిసేలా
మానవతా పరిమళాలు
మదిపులిమిన మన జెండా
చ4.
అస్త్రశస్త్ర విలువిద్యలో ఆరితేరినా యోధుల
అహింసనే ఆయుధమై యలరారిన మన జెండా
చ5.
కులమతాలు వర్ణవర్గ విభేదాలు యెన్నున్నా
భారతీయసూత్రంతో బంధించిన మన జెండా

గోపులాపూర్ గ్రామం
జగిత్యాల జిల్లా
9676666353

Saturday, January 4, 2020

శీర్షిక: అంధుల బంధువు

(లూయీస్ బ్రెయిల్  జన్మదిన సందర్భంగా)


చిక్కులెన్నిటినో చిరునవ్వుతో చేధించి
చీకటిబతుకుల్లో చిరుదివ్వె వెలిగించావు
'అంధ'కారమగు అంధుల మోముపై
చిద్విలాసమై చిగురించావు

దారితెలియక పడబడు అడుగులకు
ఊతమై క్రాంతిపథం చూపించావు
చుక్కలలిపితో  చక్కని రాతనేర్పి
చూపులేని వారకు చుక్కానివైనావు!

Friday, January 3, 2020

శీర్షిక: మణిదీపం


ఉన్నతవర్గంలో ఉద్భవించి
అగ్రవర్ణంలో  మెరుగులు దిద్ది

దళితవాడలో
కటికదరిద్రంలో పుట్టి
మైలవడ్డ బతుకుల కడిగి
ముత్యాల జేసింది

అజ్ఞానపుచీకట్లు ముసిరిన
ఆదిహిందువుల అడుగులకు
దారిజూపే చేతిదీపమైంది

అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని
దుష్టబుద్దిని దురహంకారాన్ని తూలనాడి తూర్పారవట్టింది!

మురికివాడల కంపుగొట్టిన
తాడితపీడిత బహుజనుల బాగుకొరకు
అవమానాల్నే అలంకారాలుగ
పిడికిలి బిగించి పోరాడింది!

పడగవిప్పిన బానిసత్వపు కోరలు పీకి
బడుగులఅడుగుల్లో అడుగై
అజ్ఞానపు బతుకుల్లో
అక్షరదీపం వెలిగించింది!
ఆదిగురువై నిలిచింది!

గజల్



ఊగిఊగి ఉయ్యాల ఉన్నచోటనే ఆగెను
ఎగిరియెగిరి నామనసు దేహగూటికే చేరెను

రేయింబవలు ఆశలకై తమకముతో చెలరేగిన
కలలుదీరు దారిలేక మదిన కలతలే చేరెను

సత్యమేదో తెలుసుకోక స్వార్థముతో దోచేసిన
ఏసంపదలెంటరాక వల్లకాటికే చెరెను

ఆలుబిడ్డలన్నదమ్ము లనుబంధము పెనవేసిన
ప్రాణము దేహమునువీడి పరమాత్మనే చేరెను

మేదినీలో మహిమలన్ని గాంచలేరు జన శేఖర
మాయపొరలు చీల్చుకొని మహితకనులనే చేరెను

(మేదినిలో మహిమలన్ని గాంచునులే కవిశేఖర
 మాయపొరలు చీల్చుకొని మహితకనులనే చేరెను)

Thursday, January 2, 2020

ఎడబాటు


చెలీ!
ఎడబాటు వేదిస్తుందనీ
చెలగి కన్నీరు కార్చకు!
మన ఈ ప్రేమాయాణంలో
నీకు నేనెంత దూరమో
నాకు నువ్వంతే దూరం
కాని చిన్న తేడా
ఎడబాటుకు ఏడ్చియేడ్చి
గుండెబరువు దించేసుకు
కుదుటపడుతావు నీవు!
ఎడబాటును అణచివేస్తూ
ఏడుపంత దిగమింగి
బరువెక్కిన గుండెతో
బతుకీడుస్తాను నేను!

ఆవేదనతో అవిసిన
గుండెనుసైతం గుడిచేసి
బండబారిన శిలపై
నీరూపసౌందర్యం నెరపి
నిన్నే ఆరాధిస్తా చెలీ!

ఆంగ్లవత్సరాది

కవితాలోకంలో విహరించే
కవివరేణ్య నెచ్చెలికాండ్రందరకు
'ఆటవెలది' తో హార్ధిక శుభాకాంక్షలు
ఆ.వె.
సఖియసొంటినూత్న సంవత్సరమువచ్చె
ఆలువంటి గతము అరగిపోవ
పాతనొదిలిపెట్టి కొత్తనా హ్వానించి
హాయి నొందు మిగుల సోయి మరచి