Saturday, November 17, 2018

గజల్ చలనశీలం

క్షణక్షణం అనుక్షణం ఆగకుండ సాగాలి
నిలకడగా ఉండకుండ నిరంతరం సాగాలి

హోరుతోటి ప్రవహించే వాగులల్లే గాకుండా
నింపాదిగ పయనించే నదులవలెను సాగాలి

నిండా చీకటినిండిన ధీనమైన బతుకులలో
వెలుగులెన్నో విరబూసే
వెన్నెలవై సాగాలి
ఎండిన తరులతల జూసి ఎవ్వరినో నిందించక
నిండుగ చిగురింపజేయు  వసంతమై సాగాలి

రాశులుగా సంపదుండే సంద్రమల్లె నిలువకుండ
పశుపక్షులు సేవించే  ప్రవాహమై సాగాలి

సమాజపు అవసరాలు తీర్చుకుంటు నిరంతరం
మంచితనపు మారురూపు మనిషినిగ నువుసాగాలి

అందరిలా నీవుంటే అర్థమేమి కవిశేఖర
కొందరిలో ఒక్కడివై యెదలు నిండి సాగాలి

No comments: