Friday, November 30, 2018

ఆ.వె

ఆస్తి పాస్తి కన్న యనురాగ మేమిన్న
కలిసి యుండు కన్న కలిమి లేదు
ఆలు మగలు నిరత మర్ధనా రీశులై
తోడు నీడ బతుకు గడుప వలెను

Saturday, November 17, 2018

గజల్ చలనశీలం

క్షణక్షణం అనుక్షణం ఆగకుండ సాగాలి
ప్రతీక్షణం పరుగెడుతూ ప్రవాహమై సాగాలి
(నిలకడగా ఉండకుండ నిరంతరం సాగాలి)

హోరుతోటి ప్రవహించే వాగులల్లే పొర్లకుండ
నింపాదిగ పయనించే నదులవలెను సాగిపోతూ
రాశులుగా సంపదుండే రత్నగర్భ చేరకుండ
జీవుల దాహార్తి తీర్చు చెరువు తీరుమారాలి

నిండా చీకటినిండిన ధీనమైన బతుకులలో
వెలుగులెన్నో నింపాలి వెన్నెల రారాజువై
ఎండిన తరులతల జూసి ఎవ్వరినో నిందించక
నిండుగ చిగురింపజేయు  వసంతమై సాగాలి


స్వార్థపరత తొలగించి త్యాగశీలతను పెంచి
సమసమాజ స్థాపనకై సంఘటితముగా సాగి
సమాజ రుగ్మతలన్నిటి సంస్కరింపజేసుకుంటూ
మంచితనపు మారురూపు మనిషిగనువుసాగాలి

ఎందరెందరో జేరిన అనంత జగత్తులోన
కొందరేగ చిరస్థాయిగ నిలిచిపోదురవనిలోన
అందరిలా నీవుంటే అర్థమేమి కవిశేఖర
కొందరిలో ఒక్కడివై యెదలు నిండి సాగాలి

Wednesday, November 14, 2018

రుబాయి - దైవత్వం



అడిగితే సాయం చేయు వాడు మానవుడు
అడిగినా కనికరించని వాడు దానవుడు
అడిగినా అడుగకున్నా సమాజ శ్రేయముగోరి
అవసరాలనెరిగి సాయం చేయువాడు దేవుడు

Tuesday, November 6, 2018

దత్తపది

దీప-చేప-రూప-పాప దత్తపది


లక్ష్మి రూప మయ్యి లావణ్య మొప్పేల
దీప రూప మెత్తి దీవె నొసగు
చెడును త్రుంచి వేయు చేపట్టి ఖడ్గమ్ము
పాపు చుండు తాను  పాప గతుల

దీపావళి - రుబాయి



కోటి తారల కొంగొత్త వెలుగుల పండుగ
ఇలపై వెలచిన లక్ష్మీరూప సిరుల పండుగ
నోచిన నోములు ఫలము లొసగేలా
వెన్నెలలు విరబూయు దీపాళి పండుగ!

పరువాల సెలయేరు

కొండకో నలనుండి వెండిను ర్గలతోటి
జలజాత ముయిలకు జాలువారె
జాలువా రుతుతాను జాబిల్లి లామెర్సి
కొండకో నకువెల్గు వెండి నొసగె
పాలుగా రెడుకొండ పడతియా కారమై
సాకార మైనది సలిల ప్రతిమ
పొంగిపొ ర్లడెనీరు పొలతియై పారుతు
పచ్చతి వాచిని బరచి పిలిచె

పండువె న్నెలవంటి పరికిణి వేసుకున్న
పైడికాంతజూడ పరిత పించె
అట్టి జల కన్య అందాల ముగ్దులై
నిలచి చూచె దరుగ నిండు జడిని







గణపతి పండుగ

ఘనమైన పండుగ గణపతి పండుగ
సంఘజీవన సాఫల్యం గణపతి పండుగ
జీవన సారమునే గాక
పరతత్వము బోధించు పండుగ
పంచ భూతాల కలబోత
పరమ సాత్వికం గణపతిపండుగ!
సకల శుభాలకు మూలం
సర్వాంగ ప్రతీకాత్మకం
మేలిమిగుణాల మేటికలయిక గణపతిపండుగ!

మర్మమెరుగని మనుషులు
మట్టి బొమ్మల మరచిపోయిరి
ప్రకృతిని వికృతిని జేయ
నిలువెత్తు బొమ్మల నిలుపవట్టిరి
రసాయనల రంగులతోటి
తీరొక్కబొమ్మల దీర్చి
గల్లీకొక గణపతి నిలుపవట్టిరి

అసలు తత్త్వమిడిచిపెట్టి
ఆటపాటలతోటి వికృతచేష్టలతోటి
ఆడమగ ఆదమరచి
అంగరంగ వైభవంగ సాగనంపవట్టిరి!





రుబాయి - రాజకీయం



అయిదేళ్ల కొకసారి అలరించు పండుగ రాజకీయం
అలాయ్ బలాయ్ తో హాయిగొల్పు పండుగ రాజకీయం
అదినమ్మిన ప్రజలంతా అందళము నెక్కిస్తే
సేవలను మరిచి సేద దీరుడే అసలైన రాజకీయం

తరువులోలే నీడనిచ్చు నాయకులు రావాలి
వాహినిలా సాగిపోవు నాయకులు రావాలి
ప్రజల శ్రేయమే పరమావధిగా సాగుతూ
దీపంలా వెలుగు పంచు
యువనాయకులు రావాలి

Sunday, November 4, 2018

ఓటీశ్వరుడు




ఓటరన్నా
నేడు నీవుసామాన్యుడవుగాదన్నా
ఓటీశ్వరుడవు .!
నాయకుల రాతలు రాసే
ఆదిదేవుడవు ..!

దేవానుదేవతలకు
వైజ్రవైఢూర్యాలు కానుకలిచ్చే కుబేరులు
నీ కరుణాకటాక్షాలకై వేచి చూస్తున్నారు !

మేరుపర్వతమే వంగి వందనం జేసినట్లు
నీకు ఎనలేని గౌరవాన్నిస్తున్నరు !

అయిదేండ్లల్ల అసలే గనవడని
రాజకీయ నాయకులంతా
నేడు నీ గుమ్మం ముందర
వామనావతారంలో ప్రత్యక్షమైతుండ్రు !

నమ్మి వరమిచ్చి మోసపోక
నాయకుల పటిమ నంచనావేసి
ఆజ్ఞాపరిపాలురకు ఓటువేయి !
అంచలంచల అభివృద్ది నందవోయి !!