Friday, December 28, 2007

నీకై...

వేకువ జామున మొదలు
మిసిరాత్రుల మేళనం వరకు
అను నిత్యం ప్రకృతితో
ప్రతి స్పందించే నీవు ...
మాతృప్రేమను మరువలేక
ప్రకృతి ఒడిలో శయనించావా...!

నిరంతరం శ్రమించే నీవు
ఆదమరిచి ఆకులపై
నిద్రించావా...!

నిత్యం దోబూచులాడె
ఆ పక్షుల కిల కిల రాగాలు వింటూ
వాటితో శృతి కలిపేందుకు
సాగిపోయావా...!

పిల్ల తెమ్మరల
ఈల పాటలు వింటూ
చేదు జీవితపు కలతలు మరిచి
తన్మయత్వంతో తరలిపోయావా...!

కటిక నేలపై కాలుజాపే నిన్ను
మత్త కోయిలలు మత్తుగా జోలపాడి
పచ్చని ప్రకృతమ్మ
వెచ్చని పొత్తిళ్ళలో నిద్రబుచ్చాయా...!

నిత్యం నీవు కదలాడే
పంటచేలోని ప్రతి మొక్క
వెర్రిగా నను ప్రశ్నిస్తుంది
నీ జాడ తెలుసుకోమని....!

పిల్లగాలి మెల్లగా
గేళి చేస్తుంది నను
నీవిప్పుడు అనాథవని ....!

తెలియదు వాటికి నిజం
చిగురించే ప్రతి మొక్కలో
నీ సున్నితపు మనస్సు,
వికసించే ప్రతి పూవులో
నీ చిరునవ్వులు దర్శిస్తున్నాని ...!

అందుకే....
ప్రకృతిని చూస్తే
ఒకింత ప్రేమ,
రెండింతలు ఈర్శతో
మదన పడుతుంటాను.
నిను ఒడిలోకి చేర్చుకొని
సేదతీరుస్తున్నందుకు...!
మానుండి దూరం జేసి
మాయ జేసినందుకు ...!

అయినా....
ప్రకృతిని చూస్తే పరవశించి పోతాను
నీవు దానిలో లీనమైనందుకు,
నిత్యం దానిలో వెతుకుతుంటాను
నీ ఆప్యాయత దొరుకుతుందేమోనని !
వికసించే వెన్నెలకై వేచి చూస్తాను
నీ రూపు దర్శనమిస్తుందేమోనని...!
(మానాన్న గారు స్వర్గీయ పచిమట్ల లచ్చయ్యగౌడ్ గారి ఙాపకార్థం)

Thursday, December 13, 2007

దయార్ద్ర హృదయుడు

అంట రాని వాడంటు
అడ్డు గోడ బెట్టకు
అంతులేని విలువ గల్గి
నీకంద రాని వానిని.

రంగు మెరుగు రాళ్ళ
నెరిగిన నీవు
వాటి జన్మ తలాలైన
మూలాలను యెంచలేవు.

సృస్టి కర్త తనువు నుంచి
చించుకుంటు మీరస్తే
పరుల మేలు గోరు
నేను పాదాలను యెంచుకుంటి.

మీరు చించిన దేహం
నేల రాలి పోకుండా
పాదాలలో ప్రవేసించి
పటిష్టంగ నిలబెట్టితి.

అర్థ విలువ లధికమయ్యి
ఆప్యాయత లెరుగలేవు
మమత లెరుగని నీవు
మనిషివి గానేరవు.

ఱెక్కలొచ్చిన మీరు
దిక్కులకై యెగురుతుంటె
జన్మ నిచ్చిన తల్లి
ఋణం తీర్చ నేనుంటి.

అంటరాని వాన్ని గాను
అనురాగం గల్గి నోన్ని
దలితుడిని గాను
నేనుదయార్ద్ర హృదయుడిని.

సిరులు గల్ల తల్లిని

పోరాటమె నా ఆయుధం
తెలంగాణమె నా ధ్యేయం
సంస్కృతులకు నెలవైన
చక్కదనాల తెలుగుతల్లిని
పిశాచాల్లా పీక్కుతిని
ఎముకల గూడు మిగిల్చిండ్రు.

తేనెలొలుకు నా భాషను
తూట్లు తూట్లు గాల్చేసి
పాండిత్యం గల్ల భాష
ప్రామాణిక మన్నారు.

పండితులం మేమే నని
పరవశించి పోయిండ్రు
తెలంగాణ కవి బిడ్డల
తుంగలోన దొక్కిండ్రు.

కన్న బిడ్డ కళ్ళు గట్టి
సిరులు గల్ల నాతల్లిని
నిలువున దోపిడి జెసి
వివస్త్రను గావించి
వినోదాలు జూస్తుండ్రు.

మీది తెలుగు మాది తెలుగని
మబ్బె పెట్టి మాయ జెసి
మేమంతా అన్నలమని
వరుసలు గలిపేస్తుండ్రు.

ఏరువడితె ఎదుగలేమని
కపట ప్రేమలొలకవోసి
పాలననే పేరు తోటి
పీల్చి పిప్పి జేసిండ్రు.

తెలుగు తల్లి నలరించిన
పచ్చని యా వరి మళ్లు
మీకుట్రల కుతంత్రాన
బిక్కసచ్చి బీళ్లు బారినై.

వెలుగు లిచ్చు నాతల్లి
జిలుగు లన్ని దోచుకొని
కటిక చీకటిని మాకు
కానుకగా యిచ్చిండ్రు.
నవాబుల రక్తాన్ని
నెమ్మదిగా నెమరు వేసిన
రైతన్నల తుపాకులు
ఆకలితో అరుస్తున్నై.

తూటాలకు తెలియదులే
మీరే మా అన్నలనీ
దారి గాచి దోచుకునే
దోపిడి దొంగల కాల్చి
ఆ నీచుల రక్తంతో
అభిషేకం జేయించి
పునీతగా మార్చుకొని
పట్టు బట్ట కడ్తాము
తెలంగాణ నడి వొడ్డున
మా తల్లిని నిలుపుతాము.

Tuesday, December 11, 2007

శవాల గుట్టలు

శోక సముద్రంలో కొట్టుకు పోతున్నాను
చిత్రం!నిద్ర లేచి చూస్తే
చుట్టు శవాల గుట్టలు
చిత్రంగా పడి ఉన్నవి.
ఆశ్చర్యం ! ఏమిటంటే
నే నిద్ర పోయి నెలలైంది
లేచి చూస్తే వింత దృశ్యం
ఒక్కొరిదో చరిత్ర
యెదల నిండ విషాదం
కదిలించితే కన్నీరు
ఏమని ఓదార్చను.

నేను వారిలో ఒకరినని
వారికెలా చెప్పను
బారమైన వారి గుండెల
బడలిక నెలా తిర్చను.
నిజంగా నే నిస్సహయుడ నయ్యా
చేద్దామని సాహసించిన
కాల్లు రెక్కలాడ లేదు
నేను చచ్చి నెలలైంది.

నీ రాక?

వసంత మాసంలో కోయిల రాక
మాఘ మాసంలో మంచుబిందువుల రాక
మధుమాసంలో మల్లెల రాక
యెప్పుడో చెలీ!నా యెద నిండిన నీ రాక?