Friday, August 16, 2019

కలికితురాయి

(ఆకాశపు అంచున ఆదర్శ పాఠశాల)


పచ్చని ప్రకృతి ఒడిలొ వెలసి
సువిశాల మైదానమై నిలిచి
గుట్టనే దిష్టిచుక్కగా దాల్చిన ఇంద్రభవనం!
రంగురంగుల పూలు
కొలువుదీరిన నందనవనం!
బొండుమల్లెల పరిమళాలు
అడవంతా పాకినట్లు
విద్యాపరిమళాలు దశదిశల వ్యాపింపజేసిన కీర్తిపతాక మన ఆదర్శ పాఠశాల!

చకోరకములకు శరత్కాంతులతీరు
మధుపములకు
పూగుత్తుల తీరు
హంసల విహారములకు
 స్వచ్ఛ నదీతరంగములతీరు
పరమ మౌక్తికములకు
సాగరగర్భము తీరు
క్రమశిక్షణ మొదలు విద్యా సంస్కృతి సామాజిక శ్రేయోది సర్వవిషయములందు ఆదర్శప్రాయమై
సకల జనామోదమై
నిండు జవ్వనియై నిలిచినది మన ఆదర్శ పాఠశాల!

 నిర్మల వినీలాకాశపు
అంచున విరిసిన ఇంద్రధనసు
అజ్ఞానాందకారపు జాడలు
రూపుమాపే తొలిఉషస్సు
విభిన్న సంస్కృతుల
విశిష్ట మేళవింపు
జ్ఙాన కోవిదులు కొలువైన
విజ్ఞాన బాంఢాగారం
వాఙ్మయీప్రసన్న వరప్రసాదం
గొల్లపెల్లి శిగలో తురిమిన
వెన్నెల విరిమాల
మన ఆదర్శ పాఠశాల!

శంకుస్థాపన మొదలు
శాఖోపశాఖలై విస్తరించి
విద్యావిహంగముల కాలవాలమై
సంస్కృతీసంప్రదాయముల కాధారభూతమై
దినదినప్రవర్దమానమౌతూ
నభోవీథి కెగసిన కీర్తిపతాక మన ఆదర్శపాఠశాల!

అవరోదాల నెదురించి
అభివృద్ధి పథాన నడిచి
నీలిమేఘపు శకునాలన్నింటిని
దాటుకుంటూ
తేజోదీప్తమై ఉదయించిన
శరత్చంద్రిక ఆదర్శ పాఠశాల!


వందలాది వలస పక్షులకాలవాలమై
విద్యాధికోపన్యాసకులకు
నెలవై
ఎందరికో  దిశానిర్దేశమై
ఇంకెందరికో వరప్రసాదమై
విద్యగోరిన వారికి కొంగుబంగారమై
 ఒదిగిన సారస్వతాలయం మన ఆదర్శ పాఠశాల!

గ్రామీణవిద్యార్థుల పాలిటి
కల్పతరువు
జ్ఞాన పిపాసులందరికీ
విద్యాసుధ సాగరం
తత్వమెరిగెడు వారలపట్ల
బోధివృక్షం ఆదర్శ పాఠశాల!



ప్రజాప్రతినిధులు
అధికారులందరి అండదండలతో
ఆటస్థలమై అలరారుతు
అన్నింటికి ఆధారమై నిగర్విగా నిలిచిన
ఏడు నిలువుల ఎత్తైన శిల్పం మన ఆదర్శ పాఠశాల!
చదువులమ్మ మెడలో కలికితురాయి మన ఆదర్శ పాఠశాల!

No comments: