Friday, November 24, 2017

ముళ్ల బాట

మది నిండ మమతలు
యెదనిండ ప్రేమలతో
హృది నిండ మానవతా
పరిమళాలు వెల్లివిరిసి
విశ్వనరుడై విలసిల్లిన
నాటి మనిషి నేడు కానరాడు

పొద్దు వొడిసిననుండి పొద్దు గూకె దాక
నిరంతరం పోటీపడి గడిపే
ఉరుకులు పరుగుల జీవితం
కొండను దవ్వితే ఎలుక ఫలితం
నిరాశ నిట్టూర్పులే నిత్యదర్శనం !

నాడు దుప్పటి తీసి దేవుని ప్రతిమలు జూసే జనం
నేడు  మూడు ముళ్లు ముచ్చటగ కదిలే
గోడగడియారం వంక గోసగ జూసి
ముళ్లతోటి కాళ్లు కదిపి తెగ మురిసిపోతుండు!

పొద్దు తోటి సద్దు చేయక కదులిన నాడు
పొట్ట కూటికొరకు పొరలని మనిషి
నేడు రాత్రనక పగలనక రాటోలె దిరిగినా
కోరికలు దీరక గోసపడుతుండు

కాలంతోటి కాలుగలిపి
నిత్య చైతన్యముగ నిలువెల్ల శ్రమించినా
ఆశ చావదు ఆకలి తీరదు!
అయినా !
అభీప్సితం నెరవేరక అహరహం పరితపిస్తూ
 అలసి సొలసి ఆదమరిస్తే
హఠాత్తుగ  పెద్ద ముళ్లాగి పోతుంది
గడియారం మూలవడుతుంది
బతుకుబండి చతికిల బడుతుంది

No comments: