Tuesday, March 28, 2017

యుగాది

 విరియించి తన కుంచె విదిలించెనో యేమొ
       ఆకురాల్చినతర్వు లంకురించె !
 మండుటెండను త్రోసి మావిచిగురుతొడ్గి
       పూలు ఫలముతోడ పుష్ట మొందె !
 పుట్టువయినభూమి పులకింత నొందేల
       విరగబూసెనుచూడు వేపలన్ని!
 చిగురుటాకులజేరి చిలుకలు కులుకంగ
           కొత్తరాగములెత్తె కోకిలమ్మ!
ఆరు రుచులతోడ నరుదైన పచ్చడి
     ఆరగించినమేను ఆర్తి దీరు!
అటులె జనుల చింత లన్నింటి నెడబాపి
    హితము గూర్చ వచ్చె హేవళంబి !

                -రాజశేఖర్ పచ్చిమట్ల
                       M.A M.Phil (central university)
                 తెలుగు లెక్చరర్
     

Monday, March 27, 2017

ఉగాది కి స్వాగతం

  విపంచి తన కుంచె విదిలించ
 నక్కడక్కడ వడ్డ సిరా చుక్కలోలె
మండుటెండకు తనువు మాడుతున్న
పుడమి క్యాన్వాసుపై
 ఆకురాల్చిన చెట్లు అంకురించి
పచ్చని చిగురుల పలుకరింప

మావిచివురులు తొడిగి మారాకువేసి
పుష్ప ఫల శోభితములయి పరిఢవించ
వేపలు చిగురించి విరబూసి
పుడమి తల్లికి పూల దుప్పటి గప్పి
ఆనందాతిశయముతో  నలరారుతుండ

చిలుకల కులుకులలు
కోకిల కూతలు
పక్షుల కిలకిల రావాలతో
ప్రకృతి పరవశించ
సుఖదుఃఖాల సుందర
మేళవింపయిన జీవితాలను
తీపి పులుపు చేదు
వగరు లవణ కారము
ఆరు రుచుల అద్భుత పాయసమోలే
రసమయ మొనర్చి రంజిల జేసి

హలాహలము మింగి
అమృతమందించు హరుని వోలె
క్రొంగొత్త రాగాల కోటి ఆశలతో
మనుగడ సాగించు మానవాలి కంత
వెన్నుదన్నుగ నిల్చి

సకల సంతోషాలు జగతికినందించ
సుందర సుఖమయ స్వప్నిత
జీవితాన్నందించ వచ్చిన
హేవళంభికి
సాదర స్వాగతమ్ము !

          - రాజశేఖర్ పచ్చిమట్ల

Friday, March 17, 2017

నాన్నంటే . ?

 కనిపించేదైవం నాన్న
నడిపించే నేస్తం నాన్న
కలనైనా స్వార్థమెరుగని
కల్పతరువు నాన్న!

యెదలోతుల్లో దుఃఖం
 యేరులయి పారుతున్న
 కన్నీరు కనుకొలుకుల జారనీకుండా
 కొసపంటికింద అదిమి పట్టే గొప్ప సాహసికుడు నాన్న

 అంతరంగమందు లావా
అలజడి రేపుతున్నా
 యెగిసి పడకుండా ఒడిసి పట్టి
నిగ్రహించుకు నిలబడే ధీనగమే నాన్న . !

తను(వు)ఎండల మాడుతున్న
తనవారికి నీడనందించి
తనువు జిగి సచ్చి సైసుమన్నా
పండ్లనందించ తనపడే తరురాజమే నాన్న . !

తన మదిలోని బాధల
అగాథపు లోతుల్నీ
తనువులో దాచుకుని
కనుగవ గంభీరతను చాటు కడలే నాన్న . !

తనువణువణువూ
 ఆటుపోటులతో అతలాకుతలమవుతున్నా
తన వారందరినీ సాగరపు
టలలపయి ఓలలాడించే ఆదర్శమూర్తి నాన్న . !

తను(వు)పొరలలో
కన్నీటి కాలువలు పారుతున్నా
తనువు పయి తరువులను
నిలిపే సహనశీలధరణే నాన్న . !

నాన్నంటే ఆదరణ !

నాన్నంటే ఆలంబన !

నాన్నంటే ఆవేశం మాటున దాగిన  ఆప్యాయత . !
                              -రాజశేఖర్ పచ్చిమట్ల

Wednesday, March 8, 2017

మానవతకు మారురూపు మహిళ

జవసత్త్వములను జగతికి నందించి
మానవాళి పేర మహిన నిల్పి
మానవత్వమునకు మారుపేరుగనిల్చు
మగువ లేక మనిషి మహిని లేడు

త్యాగశీలి మహిళ

ఆ.వె.
అవని మీద మనిషి నవతరింపగజేసి
అణువణువుగ తాను కరిగి పోయి
జీవజాతికంత చేవనందించేటి
మహిళ సాటి లేరు మహిని యెవరు