Friday, September 29, 2017

కవిఘనత

అలతియలతి తెలుగు పలుకులన్నిటినేరి
కవితలల్లినట్టి కవులు ఘనులు
వారి వలనె తెలుగు వర్ధిల్లు చున్నది
పచ్చిమట్ల మాట పసిడిమూట

Thursday, September 28, 2017

బోయీల బతుకు చిత్రం

అలల ఊయలపై
అలుపెరుగని పయనం
నిలకడ లేని జీవితంలో
నిరంతరం చేపల వేటతో
అనునిత్యం అపనమ్మకంతో
ప్రకృతి నెదురించి సాగె
బతుకు పోరాటం
గోదావరి ఒడిలో
అలలపల్లకి నధిరోహించి
తెప్పె పడవకు తెడ్డేస్తూ
పొద్దుతో పోటీపడే
సుందర సుమధుర జీవితచిత్రం
 బోయీల బతుకు చిత్రం !

ఆలుబిడ్డల ఆకలి తీర్చ
పొద్దుపొడుపుతో నిద్రలేచి
నాటుపడవల నమ్ముకొని
లోతట్టుప్రాంతాలకు
పయనమవుతరు
చేపలు వేటాడుటకు !

చేపలు దొరికినవేళ
తెప్పనిండ విరిసిన జలపుష్పాలతో
మదినిండ విజయోత్సాహం !
నుదుటన గర్వరేఖతో
ఇల్లుచేరెడు బోయీలు !

వేట నిష్పలమైన వేళ
నిరాశ నిస్పృహలతో
మెయినిండ చెమటలతో
విషన్న వదనంతో
తిరుగు పయనంలో బోయీలు!

అలలపై తేలాడే తెప్పలపై
నిరాధారపు పయనం
భరోసా లేని జీవితం !
బోయీల బతుకు చిత్రం !!
















Sunday, September 17, 2017

కృషీవలుడు "నాన్న"

నాన్నంటే!
జీవనగతిని మార్చు నావికుడు
నాన్నంటే
మనల నడిపించు నాయకుడు
నాన్నంటే
నడయాడు టంకశాల కాదు
నాన్నంటే
అవసరాలు దీర్చే యంత్రం గాదు
మనకోసం జీవితాన్ని అర్పిస్తూ
తన రక్తాన్ని స్వేదంగా మలచి
శ్రమించే నిరంతర శ్రామికుడు
మనందరి కానందంపంచుతూ
మనలో తనానందాన్ని చూసుకునే
నిస్వార్థపరుడు నాన్న !
అమ్మ లా కన్నులు చెమ్మగిల్లనీకుండా
కష్టాన్ని కన్నీళ్లను చూసి
కుటుంబం కుంగిపోతుందని యెంచి
దుఃఖాన్ని దిగమింగి
దైర్యంగా నిలబడు సాహసికుడు నాన్న !
అహర్నిషలు అంతరం లేక
చీడ పీడలు దరిచేరకుండ
అనునిత్యం పరితపించు కృషీవలుడు నాన్న !
నాన్నంటే బాధ్యత
నాన్నంటే క్రమశిక్షణ
నాన్నంటే పరువు ప్రతిష్ట

అనుచరగణం కోసం అనునిత్యం శ్రమించు
నాన్నను ప్రేమించు !
             నాన్నను గౌరవించు !!
                          నాన్నను అనుసరించు !!!


అమ్మతనం


అమ్మంటే అనుబంధాలు అల్లుకున్న పొదరిల్లు
              అప్యాయతానురాగాల మేళవింపు                        మమతానురాగాల మారురూపు
అమ్మంటే ఎడతెగని ప్రేమ పాశం
అమ్మంటే అవిరల త్యాగం
అమ్మంటే అడిగిన విచ్చే దేవునిరూపం
అమ్మంటే రామరక్షణం
అమ్మకు సాటి లేదు భూతలం
అమ్మంటే అపూర్వం !
అమ్మతనం అపురూపం ! !


విరివింటి దొర

నా కనుల కాన్వాసు పై
నీరూపు బొమ్మను గీసి
కునుకు రాకుండ చేసావు !
నా హృదయకడలిలో
 నీ తలపుల  అలజడి రేపి
నా మదికలువను మదనపరిచావు !
విలువింటిదొర చెలికాడవై
విరి బాణాల పరంపరతో
మధుర బాధ కలిగించావు !
దూరంగా వుండి దోబూచులాడక
దరి చేరు దారులు వెతికి
 వయసు వారువాన్నధిరోహించి
అలల పరువానికి అడ్డుకట్టలేసేయ్



Saturday, September 16, 2017

ముకుళ కమలం

చందమామకు చలేసిందేమో
చుక్కల దుప్పటి గప్పుకొని
ఆకాశం కౌగిట్లో ఒదిగి పోయింది
కలువలు కలవరపడి
చెరువు యెద లోతుల్లో
చెమ్మగిల్లి చింతిస్తున్నాయి
లోకమంత
చిమ్మ చీకటి కమ్ముకుపోయింది
సూర్యోదయపు సుందర దృశ్యం
అగుపించేదెపుడో?
కారుచీకటిని పారదోలు
కాంతిపుంజం కనిపించేదెపుడో ?
నా హృదయ కమలం
వికసించి విరబూసేదెపుడో ?

Friday, September 15, 2017

సిగ్గరి మబ్బు

రైతుల అర్థనగ్నపు
సాగువాటు సాటుగ జూసి
నీలినింగి సిగ్గుపడి
మబ్బు దుప్పటి గప్పుకుంది !

ఆకాశపుటంచున వేలాడుతున్న
నల్లని కొండల జూసి
ఉల్లమున సంతసము
వేళ్లూనుతుండ

అపురూప వొస్తులు
పాత సందుగల దాసినట్టు
తీరైన ఇత్తుల దెచ్చి
మట్టి పొరల మరుగున దాసిరి !

సిగ్గువీడి సిరుజల్లు
కురిపించి కరుణించేదెపుడో ?
పుడమి పులకరించి
పరవశంతో పరితపించే దెపుడో ?
అన్నదాతల ఆశలు
అంకురించి మురిపించేదెపుడో ?
అవనిజనులకు అన్నపురాశులు
అగుపించేదెపుడో?