వేకువనే లేస్తవు వేదపండితునోలె
స్నానజపము లేక సాగిపోతవు
పొద్దువొడిసేటాల్లకు పొలిమేరలు దాటి
తాటివనంలోన తచ్చాడతవు
బతుకుదెరువుకోసం పాకులాడుతవు
సాహసమే ఊపిరిగా సాగుతుంటవు గౌడన్నా !
మోకు బుజానేసి ముత్తాదు గట్టుకొని
వీరునోలె ముందుకేగి విజృంభించి
ఎత్తైన తాటిచెట్టు ఎగాదిగా జూసి
మొద్దుకు బంధమేసి మొగులుకెగబాకి
పచ్చనాకులంట పాకి పరవశిస్తవు గౌడన్నా!
ఆత్మవిశ్వాసమే సాకారమై
మోకుమీద నమ్మకంతో మొండిగ చెట్లెక్కి
సుతారంగ గొలనుగీసి సురను సృష్టించి
శ్రమజీవుల బడలికబాపు ధన్వంతరివీవు గౌడన్నా !
వృత్తి నిడిసి మనలేవు వృద్దాప్యం నొందలేవు
పొద్దంత పనిజేసిన పొట్టకూటికి కరువు
నిరంతర పోరాటం ఆగదు నీ ఆరాటం
దినదిన గండం నీ బతుకు చిత్రం
అల్లిన మోకు సంకలుంటే ఆకాశంలో నీవు!
మోకు జారిన మరుక్షణం పుడమి పొత్తిళ్లలో నీవే ! !
తలపాగతో తాడుశిఖల ఉదయించే సూర్యుడవు !
తాడుతెగిన తదనంతరం అస్తమించే భాస్కరుడవు !!
రాజశేఖర్ at 2:15 AM