Thursday, May 5, 2022

ఉరివెట్టుకున్న మోకుముత్తాదు

 

ఆలుమొగల తీరు అన్యోన్యంగుండి

దినాం ఒకళ్లెంబడి ఇంకొకలున్నట్టు

నిత్తెం నింగికెగబాకె

గౌడన్న వొంటిమీద గజ్జెలహారమై

దారిన వోయెటోళ్ల దాహందీర్చె

మోకుముత్తాదు పొద్దుగూకినంక

రంగులబొంత గప్పుకొని

సిగ్గులమొగ్గై సిలుక్కొయ్యెక్కుతై జంటగువ్వలతీరు!

అరె బయ్ 

ఆన్లైన్ల ఆడరిత్తె అచ్చేది

గాదు కల్లుసుక్క!

గాలిలో వేలాడే దీపమై

పూటకో పుట్టువై

 ప్రమాదపు అంచున

కత్తిమొనపై నిల్సున్న

శ్రమజీవుల సెమటముక్క!

ఆకట అలమటించే బిడ్డలకడుపునింప

సేపుకచ్చిన సురధారలు!

తొవ్వనడిచే పాదచారుల

దూపదీర్చే ఊటసెలిమలు!

గీతకత్తోలె పదునైన బతుకులు

మోటువోయి మొత్తుకుంటున్నయి

బీరుబరండీల పారుకంల వడి

తెల్లగల్లు తెర్వు కచ్చినోడెలేడాయె


బర్వసలేని బతుకులకెవడు రాక

బొత్తలన్ని బీడువడ్డయి

తాళ్లన్ని తలలిరిగి రాతికంబాలోలె

బొట్టుబోనం లేక ముండవోసినట్టున్నయి!

కుండలెన్నొ మోసిన

కాడుబాద్ధ కాళ్లిరిగి మూలవడ్డది!

గుజికాళ్లకడ్డంబడి

నడువకుండ నాలెకు సరంగొడుతున్నది!

మోకుముత్తాదులు మొద్దుమొకం జూడని బెంగతో

సిలుక్కొయ్యెకురివెట్టుకున్నయి!

ఉయ్యాలూగుతున్నయి!!

గౌడన్నల బతుకు గాలిల దీపమైనయి!!!


రాజశేఖర్ పచ్చిమట్ల

9676666353