అనంతవిశ్వమంటి
గర్భకుహరంలో నలుసై వెలిసిన నిన్ను
ఈయవనికి పరిచయం చేసి
అనందపుఅలలపై పూసిన వెలుగుకిరణం అమ్మ!
ఉంగఉంగ అంటూ
దైవభాషల నువు ధ్యానంచేస్తుంటే
ఊకొడుతున్నావనుకుంటూ
సాగిసాగి ఊసులు జెప్పే తొలిగురువు అమ్మ!
అడ్డంగా అమ్మవొడిలో
శేషశయనుడవై యున్నా
మొలిచీమొలువని కాల్జేతులతో
గాలిలో ఈదులాడుతున్న నీయాటలుగని
మురిసిమైమరిచేది అమ్మ!
ఖాళీదిమాక్ తో ఇలకచ్చిన నీకు
అత్త తాత నాన్న మామఅంటూ
బంధాల మాధుర్యాన్ని
యెదలోని ప్రేమామృత దారలతో రంగరించి
భావిజీవితానికి భరోసానిచ్చే బడి అమ్మఒడి!
అలతియలతి మాటలతో
పాలుగారే పలుకుల జడివానల తడిసిముద్దై
పచ్చియనుభూతులు పంచే
నులివెచ్చని చీరకొంగు అమ్మ!
మునిమాపువేళలో
నల్లని ఆకాశంలో పూసిన తారలహారాల్ని చూపుతూ
గానకోకిలై సప్తస్వరాల నాలపిస్తది
చిట్టిపొట్టి కథలతో ఆలోచనానందాలు పంచుతూ
గోరుముద్దలు పెడుతూ గోములాడేది అమ్మ!
తెలియనిలోకంలో తెగువతో బతికేలా
నేలనుంచి మొదలు నింగిదాకా
అన్నింటిని అరచేతి కందించి
వంతపాడేటి పసితనానికి మురిసి
గానామృతంతో జ్ఞానాన్నందించే అమ్మఒడే అసలు బడి!
తను నీవెంటున్నా లేకున్నా
కాకులుగద్దలు తన్నకుండా
నిత్యం నిను రెక్కలకింద గాచే
శ్రీరామరక్ష అమ్మ!
గురుతరమైన అమ్మ పాదాల చెంతే
కులాసైన బతుకు
నడిసంద్రపు నావసొంటి మనబతుకును
దరిజేర్చు తెరచాప అమ్మ చేయిచలువ!