Friday, May 29, 2020

గజల్ - తావిలేని పూలు

తావిలేని పూలనెలా ధరించెదవు ఓ నరుడా!
ఈవిలేని మనిషినెలా భరించెదవు ఓనరుడా!

వలపులేని వయసుపుఢమి వరపుధార వరిస్తుంటే
మనసులేని మనిషినెలా పూజించెద వోనరుడా!

కలువలెన్నో కొలువుదీరు కొలనుచూసి యెదనుమురిసే
కలువలేని కడలినెలా ప్రేమించెద వోనరుడా!

అల్లుకున్న అనురాగపు తీగెలలో తీపిగ్రోలి
శుష్కమైన సంతునెలా పోషించెద వోనరుడా!

పచ్చదనపు ప్రకృతంత రాగమొప్పు రాజుకరము
విలపించే విపనినెలా వలపించెదవో నరుడా!

పచ్చిమట్ల రాజశేఖర్

గజల్ - యెదతలపులు

మనసులోని జ్ఞాపకాలు కరిగినాయి కన్నీరయి
అంతులేని అశలన్ని చెదిరినాయి కన్నీరయి

మూగవోయి మౌనంగా యెదగదిలో కుములుతుంటే
మనస్నేహపు తలపులన్ని పొంగినాయి కన్నీరయి

ఓదార్పుతొ భుజంతట్టే హృదయం మరుగవుతుంటే
మదినంటిన మలినాలు చెలగినాయి కన్నీరయి

మంచితనం వంచితమై కనుదోయిన మెదులుతుంటె
తాలలేని వ్యథలన్నీ  పెనవేసినాయి కన్నీరయి

అమావాస్య చీకట్లు రాజుమదిని నిశిజేసిన
కన్నులలో వెన్నెలలు విరిసినాయి కన్నీరయి

Thursday, May 21, 2020

సమస్యా పూరణం

సమస్య- అక్కను పెండ్లాడె మిగుల ననురాగమునన్

మక్కిన మామిడి వోలెను
చక్కని సౌరుల్ గలిగిన సరసిజ నేత్రిన్
దక్కిన వరముగ  మిత్రుని
యక్కను పెండ్లాడెమిగుల ననురాగమునన్

Sunday, May 17, 2020

నరోద్భవఫలం(సీసం)

నరులంట పుఢమిపై! నవతరించిన నుండి
ప్రాణికోటికినంత! హానివచ్చె

మనుషులీమహిలోన! మనుగడొందిననుండి
చెట్టుచేమలకంత! చీడవట్టె

బుద్దిజీవులిలలో! వృద్ధిజెందిననుండి
ప్రకృతంతనువెలసి! వికృతి యయ్యె

నరసంతతిలలోన! నడయాడినానుండి
యేరులన్నియునెండి! యరుగులయ్యె

ఉత్తతోలుబొమ్మ!  హృదయమన్నదిలేదు
పాపభీతిలేని! పాతకుండు
భూతదయయులేని! భూతమీ మనుజుండు
నరునితోటె సర్వ!నాశమయ్యె