Friday, September 13, 2019

మణిపూసలు


మాటలతో మాయజేసి
మనుషులను గొర్రెలుజేసి
పాలించెదరు ప్రజలను
పశులకన్న కిందజేసి - 1

నిన్ననేది తిరిగిరాదు
రేపునీది కానేకాదు
భూతభావి చింతలతో
నేడు జార్చు కొనగరాదు - 2

చెరువుకు కలువలు రమ్యత
తనువు వలువలు రమ్యత
ప్రగతి కొరకు పరితపించు
మనిషికి విలువలు రమ్యత -3

 నేల నీకు అడుగైనది
నింగి నీకు గొడుగైనది
ప్రకృతి వికృతిగ మార్చితె
నీనెత్తిన పిడుగైతది - 4

పిల్లలకు సంచి బరువు
పెద్దలకు ఫీజు బరువు
నింగికెగసె తరువులకు
పండు టాకు లేబరువు - 5

 తీగెకు కాయలు భారం
పడుచుకు ప్రాయము భారం
ఆధారమైన అవనికీ
సోమరిపోతులు భారం - 6

 ముంగిట ముగ్గులు అందం
పెరటికి మొగ్గలు అందం
పడుచుదనపు పరువానికి
 వాడని సిగ్గులు అందం - 7

 ముంగిట ముగ్గులు నందం
పెరటికి మొగ్గలు నందం
పడుచుదనపు పరువానికి
 వాడని సిగ్గులు నందం - 8

ఇంటికి పిల్లలు అందం
పిల్లల కల్లరి అందం
ఇల్లాలి సవరించి ముడిసిన
కొప్పుకు మల్లెలు అందం - 9
[9/1, 10:10 PM]

 చెరువుకు కలువలు రమ్యత
తనువు వలువలు రమ్యత
ప్రగతి కొరకు పరితపించు
మనిషికి విలువలు రమ్యత - 10

Wednesday, September 11, 2019

చిత్రకవిత (ఫొటో )



సీసం:
నింగిని వేలాడు నిండుజా బిలితాను
చుక్కల న్నిటినేరి చక్క గూర్చి

వాలుజ డనుదిద్ది వలపుల మరజేసి
సౌరభమ్మువిరిసి సౌరులొలుక

కారుచీ కటిబట్టి కన్నులు గాదాల్చి
కాంతులీ నగజూచె గన్ను దోయి

మరలిచూ పులతోడ తరలిపోవుచుతాను
ఓరగ పలుమారు తిరిగి చూసె

చిరున గవుల నొలకు చిగురాకు చెక్కిళ్లు
పాల పుంత నొసగు పళ్ల వరుస
దొండపండు తీరు దొరిసేటి పెదవుల
మధులొ లుకగ పిలిచె వధువు తాను

Tuesday, September 10, 2019

శివతత్వం



ఆచ రమ్ము మిగుల యర్చకుం డుండినా
శిలలు తేజ మలరి శివుడె యౌను
ఆచరమ్మువిడిచి నర్చకుం డుండినా
శివుడు తేజ మిడిచి శిలయెయౌను

Monday, September 9, 2019

కాళోజీ కైైతికాలు

నిజాం నెదురించిండు
దొరలమెడలువంచిండు
అణగారిన వారినంత
అనకొండలు జేసిండు
వారెవ్వా తెలుగోడు
ప్రజలమనిషి కాళోజీ - 1

భాషతోనె బతుకన్నడు
యాసలోనె భవితన్నడు
భాషయాస మరచిపోతె
బతుకుదెరువు లేదన్నడు
వారెవ్వా కాళోజీ
తెలంగాణ హీరోజీ - 2

ఉద్యమంలో ముందుంటడు
అన్యాయాన్నె దురిస్తడు
ప్రజలబాధ లన్నింటిని
తనబాధగ భావిస్తడు
వారెవ్వా కాళోజీ
సామాన్యుల హీరోజీ -3

Thursday, September 5, 2019

గల్మల గంగ

13.

పల్లె పురాగ మారింది!
పరువుకొద్ది బతుకనేర్సింది!

నాటి చీదరింపుల్లేవు
చింతలు ఛీకాకుల్లేవు
దెప్పి పొడుపుల్లేవు
దెబ్బలాటలస్సల్లేవు!
పల్లె పురాగ మారింది!

మంచీళ్లకోసం పడిగాపుల్లేవు
పొంటెజాము నిలవడుల్లేదు
లైను గట్టుల్లేదు లడాయి వెట్టుల్లేదు!

కొళాయి కాడ కొట్లాటల్లేవు
బాయికాడ జవుడాల్లేవు
బోరింగు కాడ కారడ్డాల్లేవు!
నలుగుట్ల వడుల్లేదు!

నీళ్ల కోసం ఈడ్గిలవడుల్లేదు
కుండలు కుండలు గొట్లాడ్తలేవు
బిందెలు బిందెలు సిగెలు వడ్తలేవు
ఇజ్జత్ తక్క తిట్లులేవు!
ఈనందక్క మాటల్లేవు!
ఈదులల్ల ఇమ్మడిచ్చుల్లేదు!

చెర్లు కుంటల్లకెల్లి నీళ్లు
తెచ్చుడు తప్పింది!
పొరిగింట్ల నుంచి బిందెలు
మోసుడు వోయింది!
బోరింగుల కాడ బారులు దీరుడు బందైంది!

సర్కారు బాయి సుట్టు
సాగిలవడి సేదుల్లేదు
దూరంకెల్లి బానలు మోసుల్లేదు
రోగాల్లేవు నొప్పుల్లేవు!
పత్తెంగిత్తెం ఎవ్విలేవు!

ఆకాశ గంగ ఆకిట్ల కచ్చింది
ఇంటింటికి పారుకమచ్చింది
పాతాలగంగ పైకిలేసింది
గయిండ్ల నల్లచ్చింది!

కుండలు బిందెలు
జలదరించినయి
ఆకిట్ల గంగ అలుగు వారింది!
అంపులకాడ గోలెం నిండింది!

నీళ్లుమోసెటోళ్లు యాడ గండ్లవడ్తలేరు
సంకల బిందెలు అట్కెక్కినయి
కుండలు మూలగ్గూసున్నయి
ఆడోల్లు ఆత్మగర్వంతో బత్కుతుండ్రు!

గంగమ్మ కరుణించింది
అంటుముట్టనకుంట
 అందరింటికచ్చింది
అలాయ్ బలాయ్ దీసుకుంది
పల్లె పరవశించింది!
పల్లె మది పులకరించింది!

సకస: 2593 రాజశేఖర్ పచ్చిమట్ల(కవిశేఖర)
గోపులాపురం, జగిత్యాల.
9676666353
తేది: 18.08.2019

Monday, September 2, 2019

శీర్షిక: నింగిసొగసు



విశ్వమంతా వ్యాపించిన
వినీలాకాశంలో
పిండారబోసేటి
పండుముసలి జాబిల్లి
నింగిఅంచున వేలాడే
నీలిమబ్బుల
మేనివిరిసిన హరివిల్లు

నల్లని చీకటితెరలోంచి
తొంగిచూసె
నవనీతపుబొట్ల నక్షత్రాలు

అన్నీ ఆకర్షణే!
మనసంతా పరవశమే!

నిండాదిబ్బరిచ్చిన నీటిఅలలపై
తుళ్లిపడే తుంటరి తూడుపూలు
ఊరచెర్వుకట్టమీద గోధూళిలో
సాగిపోయే ఆలమందలు
నిటారుతోకలతో
నిండుసంతసంతో
గెంతుతూ రంకెలేసే
తుంటరి లేగదూడలు

అన్నీ ఆకర్షణే!
మనసంతా పరవశమే!

 రాజశేఖర్ పచ్చిమట్ల
03-09-19

Sunday, September 1, 2019

మడమతిప్పని యోధుడు (సర్వాయి పాపన్న) కైైతికాలు

గౌడకుల తిలకుండు
శైవభక్తి తత్పరుండు
ప్రజారక్షణె ధ్యేయంగ
ప్రభవించిన వీరుడు
సర్దారు (సర్వాయి) పాపన్న
గౌడకులంల నువు తోపన్న .1


అఖిలావని రక్షకుడై
అజ్ఙాతమె నివాసమై
పాలక దుశ్చర్యలు గని
విరుచుకుపడె పిరంగియై
వారెవ్వా పాపన్న
ప్రజాసేవకుడు నీవన్న .2


తురుష్కుల నెదురించి
ముసల్మాన్ల మట్టుబెట్టి
దొరల ఆగడాలు బాపి
గోల్కొండలొ ధ్వజమెత్తి
నాయకుడై నడిపించిన
పోరుబిడ్డ పాపన్న .3

బంధుజనుల పాలనకై
పరసేనల కెదురునిలిచె
మృత్యువునే జడిపించగ
అపరకాళియై నిలిచె
మడమతిప్పని యోధుడవన్న
మరువనెమరువం నిను పాపన్న . 4

సకలజనుల దండుగట్టి
నవాబుల మెడలువంచె
కురుబక్షకు చిక్కకుండ
తనకుతాను మరణించె
వారెవ్వా పాపన్న
స్వాభిమాని నీవన్న .5

నిజాం నెదురించిండు
దొరలమెడలువంచిండు
అణగారిన వారినంత
అనకొండలు జేసిండు
వారెవ్వా తెలుగోడు
ప్రజలమనిషి కాళోజీ - 1

భాషతోనె బతుకన్నడు
యాసలోనె భవితన్నడు
భాషయాస మరచిపోతె
బతుకుదెరువు లేదన్నడు
వారెవ్వా కాళోజీ
తెలంగాణ హీరోజీ - 2

ఉద్యమంలో ముందుంటడు
అన్యాయాన్నె దురిస్తడు
ప్రజలబాధ లన్నింటిని
తనబాధగ భావిస్తడు
వారెవ్వా కాళోజీ
సామాన్యుల హీరోజీ -3