Saturday, August 31, 2019

చిత్రభావన

సీ॥
కురులన్ని విరబోసి హరివిల్లు గాజేసి
చెలియతా నేగెనో చెరువు దరకు
కుండసం కనబెట్టి కోమలొ య్యారియై
పడుచుద నమ్మొప్ప పథము సాగె
పయ్యెద తొలగంగ పలుమారు సరిజేసి
నీరుతా ముంచెనో నీలవేణి
కులుకులొ లుకుచుండ కుంజర మయితాను
అడుగులు కదిపెనో హంస గమన

వెల్లి విరిసిన జాబిల్లి వెలుగు లమర
సాగు చుండెనా దారిలో మగువ తాను
కాలమునకేల గుట్టెనో గన్ను దోయి
కాలి లోతులో దిగెనోయి కంటకమ్ము


Friday, August 30, 2019

చిత్రభావన

సీ.
కురులను విరబూసి హరివిల్లు గాజేసి
చెలియ తా నేగెనో చెరువు దరకు
కుండసం కనబెట్టి కోమలొ య్యారియై
పడుచుత నముబెంచ పథము సాగె
పయ్యెద తొలగంగ పలుమారు సరిజేసి
నీరుతా ముంచెనో నీలవేణి
కులుకులొ లుకసాగు కుంజర మైతాను
అడుగులు కదిపెనో హంస గమన

వెల్లి విరిలిన జాబిల్లి వెలుగు లమర
సాగు పోచుండె దారిలో మగువ తాను
కాలమునకేల గుట్టెనో గన్ను దోయి
కాలి లోతులో దిగెనోయి కంటకమ్ము

Thursday, August 29, 2019

కైైతికాలు



గాడుదుల మోతలు
గంగిరెద్దు లాటలు
చిలుకల పలుకులకు
స్వేచ్ఛ లేని సదువులు
వారెవ్వా విద్యార్థులు
వెతల మోస్తుబతుకులు - 1

 మెతుకు రూపకర్తలు
జగతి జీవదాతలు
అహర్నిశలు శ్రమించినా
అప్పులపాలాయె బతుకు
వారెవ్వా రైతులు
గంజిమెతుకుల వ్యథలు -2

 తెలుపురంగు దుస్తులు
నలుపురంగు మనసులు
ప్రజాసేవకులని మరిచి
పలుకుబడిని జూపుడు
వారెవ్వా నాయకులు
మేకవన్నె పెద్దపులులు -3

 ధనవంతుల జేరలేరు
దరిద్రుల దరికి రారు
ఆశ చిక్క వలెనంచు
అనాదిగ ఆశువోసుడు
వారెవ్వా సామాన్యులు
ఎండమావి బతుకులు -4

 ధనవంతుల జేరలేరు
దరిద్రుల దరికి రారు
ఆశ చిక్క వలెనంచు
అనాదిగ ఆశువోసుడు
మధ్యతరగతి మనుషులు
ఎండమావి బతుకులు-5

సృష్టికి మూలం తరులు
జగతికి ప్రాణం తరులు
విధాత చెక్కిన ధరణి
జీవుల త్రాణం తరులు
తరులే మనిషికి మరులు
ప్రగతికి దారులె తరులు - 6

కైైతికాలు

1.
నింగిని నేలను నమ్మి
కాలంతో కలబడుతరు
నిద్రాహారాలు మాని
పరులకు తిండి బెడతరు
వారెవ్వా కర్షకులు
పరోపకారపు ప్రతిరూపాలు!

2.
మొగులు జూసి మోహంతో
కలల సేద్యం సాగిస్తరు
ఆశలు తీరు దారి లేక
బతుకాటను ముగించేస్తరు
వారెవ్వా కర్షకులు
నడుమంత్రపు బతుకులు!

Sunday, August 18, 2019

గల్మల గంగ

సకసం. 2593
క.పేరు. రాజశేఖర్ పచ్చిమట్ల
కలంపేరు. కవిశేఖర
అంశం. మిషన్ భగీరథ
ఊరు. గోపులాపురం
జగిత్యాల జిల్లా
చరవాణి.9676666353
తేది. 18-08-16
      ———————
శీర్షిక: ఆకిట్ల గంగ

పల్లె పురాగ మారింది!
పరువుకొద్ది బతుకనేర్సింది!

నాటి చీదరింపుల్లేవు
చింతలు ఛీకాకుల్లేవు
దెప్పి పొడుపుల్లేవు
దెబ్బలాటలస్సల్లేవు!
పల్లె పురాగ మారింది!

మంచీళ్లకోసం పడిగాపుల్లేవు
పొంటెజాము నిలవడుల్లేదు
లైను గట్టుల్లేదు లడాయి వెట్టుల్లేదు!

కుళాయి కాడ కొట్లాటల్లేవు
ఈధులల్ల ఇమ్మడిచ్చుల్లేదు
బాయికాడ జవుడాల్లేవు
బోరింగు కాడ కారడ్డాల్లేవు!

నీళ్ల కోసం ఈడ్గిలవడుల్లేదు
కుండలు కుండలు గొట్లాడ్తలేవు
బిందెలు బిందెలు సిగెలు వడ్తలేవు
ఇజ్జత్ తక్క తిట్లులేవు!
ఈనందక్క మాటల్లేవు!

చెర్లు కుంటల్లకెల్లి నీళ్లు
తెచ్చుడు తప్పింది!
పొరిగింట్ల నుంచి బిందెలు
మోసుడు వోయింది!
బోరింగుల కాడ బారులు దీరుడు బందైంది!


సర్కారు బాయి సుట్టు
సాగిలవడి సేదుల్లేదు
దూరంకెల్లి బానలు మోసుల్లేదు
రోగాల్లేవు నొప్పుల్లేవు!
పత్తెంగిత్తెం ఎవ్విలేవు!

ఆకాశ గంగ ఆకిట్ల కచ్చింది
ఇంటింటికి పారుకమచ్చింది
గయిండ్ల నల్లచ్చింది
కుండలు బిందెలు
జలదరించినయి
ఆకిట్ల గంగ అలుగు వారింది!
అంపులకాడ గోలెం నిండింది!

నీళ్లుమోసెటోళ్లు యాడ గండ్లవడ్తలేరు
సంకల బిందెలు అట్కెక్కినయి
కుండలు మూలగ్గూసున్నయి
ఆడోల్లు ఆత్మగార్వంతో బత్కుతుండ్రు!
పల్లె పరవశించింది!
పల్లె మది పులకరించింది!

Friday, August 16, 2019

కలికితురాయి

(ఆకాశపు అంచున ఆదర్శ పాఠశాల)


పచ్చని ప్రకృతి ఒడిలొ వెలసి
సువిశాల మైదానమై నిలిచి
గుట్టనే దిష్టిచుక్కగా దాల్చిన ఇంద్రభవనం!
రంగురంగుల పూలు
కొలువుదీరిన నందనవనం!
బొండుమల్లెల పరిమళాలు
అడవంతా పాకినట్లు
విద్యాపరిమళాలు దశదిశల వ్యాపింపజేసిన కీర్తిపతాక మన ఆదర్శ పాఠశాల!

చకోరకములకు శరత్కాంతులతీరు
మధుపములకు
పూగుత్తుల తీరు
హంసల విహారములకు
 స్వచ్ఛ నదీతరంగములతీరు
పరమ మౌక్తికములకు
సాగరగర్భము తీరు
క్రమశిక్షణ మొదలు విద్యా సంస్కృతి సామాజిక శ్రేయోది సర్వవిషయములందు ఆదర్శప్రాయమై
సకల జనామోదమై
నిండు జవ్వనియై నిలిచినది మన ఆదర్శ పాఠశాల!

 నిర్మల వినీలాకాశపు
అంచున విరిసిన ఇంద్రధనసు
అజ్ఞానాందకారపు జాడలు
రూపుమాపే తొలిఉషస్సు
విభిన్న సంస్కృతుల
విశిష్ట మేళవింపు
జ్ఙాన కోవిదులు కొలువైన
విజ్ఞాన బాంఢాగారం
వాఙ్మయీప్రసన్న వరప్రసాదం
గొల్లపెల్లి శిగలో తురిమిన
వెన్నెల విరిమాల
మన ఆదర్శ పాఠశాల!

శంకుస్థాపన మొదలు
శాఖోపశాఖలై విస్తరించి
విద్యావిహంగముల కాలవాలమై
సంస్కృతీసంప్రదాయముల కాధారభూతమై
దినదినప్రవర్దమానమౌతూ
నభోవీథి కెగసిన కీర్తిపతాక మన ఆదర్శపాఠశాల!

అవరోదాల నెదురించి
అభివృద్ధి పథాన నడిచి
నీలిమేఘపు శకునాలన్నింటిని
దాటుకుంటూ
తేజోదీప్తమై ఉదయించిన
శరత్చంద్రిక ఆదర్శ పాఠశాల!


వందలాది వలస పక్షులకాలవాలమై
విద్యాధికోపన్యాసకులకు
నెలవై
ఎందరికో  దిశానిర్దేశమై
ఇంకెందరికో వరప్రసాదమై
విద్యగోరిన వారికి కొంగుబంగారమై
 ఒదిగిన సారస్వతాలయం మన ఆదర్శ పాఠశాల!

గ్రామీణవిద్యార్థుల పాలిటి
కల్పతరువు
జ్ఞాన పిపాసులందరికీ
విద్యాసుధ సాగరం
తత్వమెరిగెడు వారలపట్ల
బోధివృక్షం ఆదర్శ పాఠశాల!



ప్రజాప్రతినిధులు
అధికారులందరి అండదండలతో
ఆటస్థలమై అలరారుతు
అన్నింటికి ఆధారమై నిగర్విగా నిలిచిన
ఏడు నిలువుల ఎత్తైన శిల్పం మన ఆదర్శ పాఠశాల!
చదువులమ్మ మెడలో కలికితురాయి మన ఆదర్శ పాఠశాల!

Tuesday, August 13, 2019

సమస్య

సమస్య:
మామకె మామగను నిల్చు మాన్యుని గొల్తున్


మామా యంచును పిలిచెడు
భూమీ శులచెం తజేరి పులకిత మొందీ
లేమం టికావ్య మొసగుతు
మామకె మామగను నిల్చు మాన్యుని గొల్తున్

(మనుమసిద్ది ఆస్థానకవి తిక్కన ప్రశంస)

Wednesday, August 7, 2019

చెట్టు - తోబుట్టు

శీర్షిక: చెట్టు - తోబుట్టు

1.సీసపద్యం:
పుడమి తనువుచీల్చి పుట్లుపుట్లుగ మొల్చి
ఆకుపచ్చనివస్త్ర మవని కొసగు

అహరహమ్ము వెరిగి యలరారి వనములై
పశుపక్ష్య ములకంత వసతి గూర్చు

మనుజలో కముకంత మలయమారుతమిచ్చి
కమనీయ ఫలముల కడుపు నింపు

అంబరమ్మునసాగు యభ్రమ్ము లనుబిల్చి
అవనిదాహము దీర్చ నంబువొసగు

ప్రాణవాయు వొసగి ఆయుర్దాయముబెంచి
కూడు గూడు నొసగు కూర్మి తోడ
అఖిల ప్రాణి కోటి కాధార భూతమౌ
మొక్క నాటవోయి ఒక్కటైన

2.సీసపద్యం:

సాళ్లుసాళ్లుగనిల్చి స్వాగతమ్ములు బల్కి
ఛాయనిచ్చి మిగుల హాయి గొల్పు

అలసి వచ్చినవారి బడలికన్ దీర్చేల
మలయమారుతమిచ్చి మరులు గొల్పు

ఆకొని దరిజేరు యతిథిసంతుష్టికై
మధురఫలములిచ్చి మమతబంచు

సకల రోగములకు  స్వాంతన మ్మొసగేల
ఔషధ మ్ములనిచ్చి స్వస్త తొసగు

కన్నతల్లి వలెను కడుపు నింపుడెగాక
కామితార్థమొసగు కల్పతరువు
మనిషి మనుగడూంచు మహిత శక్తి తరువు
మొక్కనాటవోయి ఒక్కటైన!

Tuesday, August 6, 2019

ఆరాధన



కనిపించని భగవంతునికి
పుట్టెడు సంపద
దారవోసెడి జనులు

కల్లెదుట నిరీక్షించెడు నిర్భాగ్యునికి
పట్టెడన్నం  పెట్టనోపరు

ఆచారపు ఆరాధనలో
ఎంతైనా త్యజించుదురుగాని
అన్నార్థుల నాదుకొనగ
నడుగు ముందుకేయలేరు

తాగుతుందో లేదో
తెలియని పాములకోసం
పట్టువాలుతెచ్చి
పుట్టలవోసేటి భక్తజనం

ఆపాలకొరకే నిరీక్షిస్తున్న
 పరమాత్మను పట్టించుకోని
సంప్రదాయ సమాజాన్ని
ఏమని ప్రశ్నించను!

సాటి మనిషికి సాయపడడమే
సాక్షాత్తు భగవత్ సేవయని
వారలకెలా ఉపదేశించనూ!

Saturday, August 3, 2019

వాడినమల్లె

నిండుగ విరబూసిన మల్లెతీగెనై
సౌరభాలద్దిన పిల్లగాలితో
రాగరంజిత రాయబారమంపి
విరహపుభరణినైై
తనువంంతా కనులు జేసి
పందిట్లో చూపులు పరిచి
శిశిరమైై శుష్కింంచిన హృృదిలో
వసంంతాగమమునకైై వేచిచూస్తున్న!



అపాత్రదానము



ఆక లెరుగ నోరి కన్నంబు వెట్టినా
ధనము గల్గు వాన్కి దానమొసగ
వార్థి నికురి సేటి వర్షమే యగునయా
పచ్చిమట్లమాట పసిడిమూట