క్షణక్షణం అనుక్షణం అలలమై సాగాలి!
ప్రతీక్షణం పరుగెడుతూ ప్రవాహమై సాగాలి!
హోరుతోటి ప్రవహించే వాగులల్లె పొర్లకుండ
నింపాదిగ పయనించే వాహినివై సాగాలి!
రాశులుగా సంపదుండే రత్నగర్భ చేరకుండ
జీవుల దాహార్తి తీర్చగలిగె దారవై సాగాలి!
నిండా చీకటినిండిన ధీనమైన బతుకులలో
వెలుగులెన్నో మోసుకొచ్చె వెన్నెలవైై సాగాలి!
ఎండిన తరులతల జూసి ఎవ్వరినో నిందించక
నిండుగ చిగురింపజేయు వసంతమై సాగాలి!
స్వార్థపరత తొలగించి త్యాగశీలతను పెంచుతు
సమసమాజ స్థాపనలో సమిధలమై సాగాలి!
సమాజ రుగ్మతలన్నిటి సంస్కరింపజేసుకుంటూ
మంచితనపు సారూపము మానవతై సాగాలి!
అందరిలా నీవుంటే అర్థమేమి 'కవిశేఖర'
లక్ష్యసాధకుల కోటిలొ ఒక్కడివై సాగాలి!
రాజశేఖర్ at 11:02 PM